వెలిగల్లు నీళ్లు.. ఏటి పాలు..

ABN , First Publish Date - 2022-06-30T05:16:14+05:30 IST

వెలిగల్లు ప్రాజెక్టు నుంచి 250 క్యూసెక్కుల నీరు వృథాగా ఏటిపాలైంది.

వెలిగల్లు నీళ్లు.. ఏటి పాలు..
వెలిగల్లు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన దృశ్యం

ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు శాపం

వృథాగా నీటిని వదిలిన వైనం


రాయచోటి...ఈ పేరు వినగానే... ఎవరికైనా ఇట్టే గుర్తుకొచ్చేది.. కరువు.. ఎక్కడ చూసినా ఎకరాలకు ఎకరాలు బీళ్లు... చుక్కనీరు లేని చెరువులు.. అడుగంటిన బావులు.. మేత లేక బక్కచిక్కిన పశువులు.. పల్లెలకు పల్లెలే వలసలు. గుమ్మాలకు గుమ్మాలే తాళాలు.. ఇవి ఏ పల్లెలో చూసినా కనిపిస్తాయి. వీటన్నింటికీ ఒకే ఒక కారణం.. సరైన సాగునీటి వసతి లేకపోవడం.. వానలే దిక్కు కావడం.. అందుకే ఇక్కడ ప్రతి నీటి చుక్కా.. ఎంతో విలువైనది. నింగి నుంచి జారిపడే నీటి చుక్కను ఒడిసి పట్టాల్సిందే.. నీటిని ఇంత అపురూపంగా చూసుకునే ఈ కరువు గడ్డ మీద.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం.. వెలిగల్లు ప్రాంత రైతులకు శాపంగా మారింది. వెలిగల్లు ప్రాజెక్టు నుంచి 250 క్యూసెక్కుల నీరు వృథాగా ఏటిపాలైంది. రాష్ట్ర ప్రభుత్వం కాలువల మరమ్మతులు, పూడికతీతపైన నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే.. నీళ్లు వృథాగా పోయాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


(రాయచోటి - ఆంధ్రజ్యోతి): 

కరువు ప్రాంతమైన రాయచోటి నియోజకవర్గంలో 2008లో సుమారు 208 కోట్ల రూపాయల వ్యయంతో గాలివీడు మండల పరిధిలో వెలిగల్లు ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు కింద కుడి, ఎడమ కాలువల ద్వారా 24 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధాన కాలువ 52 కిలోమీటర్లు, పిల్ల కాలువలు 140 కిలోమీటర్లు ఉన్నాయి. అయితే ఈ కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల పెద్దపెద్ద బండరాళ్లు కాలువల్లో పడ్డాయి. కంపచెట్లు, ముళ్ల పొదలు కాలువలను పూర్తిగా కమ్మేశాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలువలను మరమ్మతు చేసేందుకు రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసింది. కాంట్రాక్టర్లు మరమ్మతుల పనులు కూడా మొదలుపెట్టారు. అయితే ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో.. కాంట్రాక్టర్‌ మధ్యలోనే పనులు నిలిపేశాడు. దీంతో కాలువల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. అనేలా అయిపోయింది. 


నిండుకుండలా వెలిగల్లు

4.62 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన వెలిగల్లు ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా నీటితో తొణికిసలాడుతోంది. గత ఏడాది, ఇటీవల కురిసిన వర్షాలకు వెలిగల్లు ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరింది. దీంతో ప్రాజెక్టులో ప్రస్తుతం 419.5 అడుగుల మేర నీరు నిలువ ఉంది. అదే ఇప్పటికి కాలువలు బాగా ఉండి ఉంటే 24 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చి ఉండవచ్చు. అయితే కాలువలు లేకపోవడంతో.. నీటి చుక్క వెలిగల్లు ఆయకట్టును తడపలేకపోయింది. 


250 క్యూసెక్కుల నీరు విడుదల

ఇప్పటికే సామర్థ్యం మేర నీరు నిలువ ఉండడం.. నైరుతి రుతుపవనాల వల్ల వర్షాలు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. గత ఏడాది అన్నమయ్య ప్రాజెక్టు అనుభవంతో ఈసారి అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈనెల 25వ తేదీ ఒక గేటును ఎత్తి.. వెలిగల్లు నుంచి నీటిని ఏటిలోకి వదిలారు. ఇప్పటి వరకు 250 క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రస్తుతం ఉన్న నీటిమట్టం నుంచి 30 సెంటీమీటర్లు నీటిని వదిలేశారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఇంకో 20 సెంటీమీటర్లు నీటిని వదులుతారు. దీనిపైన ఈ ప్రాంత రైతులు ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. నోటి కాడ కూడు.. నేల జారినట్టు.. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే.. నీళ్లు వృథాగా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి 32 చెరువులకు నీటిని నింపే ప్రతిపాదనలు ఉన్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఈ ప్రతిపాదనలు ఏమయ్యాయో? అని ప్రశ్నిస్తున్నారు. 250 క్యూసెక్కుల నీళ్లతో చెరువులను నింపి ఉంటే.. కనీసం ఏడాది పాటు ఇబ్బంది ఉండేది కాదని వాపోతున్నారు. ఇప్పటికైనా.. రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి సత్వరమే వెలిగల్లు కాలువలను మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు. 


రెండు సంవత్సరాలుగా సాగుకు నోచుకోలేదు

- పద్మనాఽభరెడ్డి, బోరెడ్డిగారిపల్లె

నాకు వెలిగల్లు ప్రాజెక్టు కుడి కాలువ కింద 2.5 ఎకరాల పొలం ఉంది. గత రెండు సంవత్సరాలుగా కుడి కాలువకు నీళ్లు వదలకపోవడంతో వ్యవసాయ భూములు బీడుగా మారి చెట్ల పొదలతో నిండిపోయాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిన కాలువలు తవ్వినా.. ప్రాజెక్టులో నీళ్లు ఉన్నా.. వ్యవసాయ భూములకు నీళ్లు ఇవ్వలేకపోవడం దారుణం. 800 అడుగుల లోతు బోర్లు వేసినా.. చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. కాలువలను వెంటనే మరమ్మతులు చేసి నీళ్లు వదలాలి. 


రైతులను ఆదుకోవాలి

- వెంకట్రామిరెడ్డి, పూలుకుంట

వెలిగల్లు ప్రాజెక్టు నిండా పూర్తి స్థాయిలో నీళ్లు ఉన్నాయి. అయితే ప్రభుత్వం చెట్లు, రాళ్లతో పూడిన కాలువలను శుభ్రం చేసి నీళ్లు వదిలే పరిస్థితి లేదు. నాకు కుడి కాలువ కింద ఏడు ఎకరాల పొలం ఉంది. కాలువల్లో నీళ్లు రాకపోవడంతో... పొలమంతా.. చెట్లతో నిండి ఉంది. గతంలో ప్రాజెక్టు పూర్తిగా నిండకపోయినా.. ఉన్న నీటిని రైతుల కోసం వదిలారు. ఇప్పుడు నీళ్లున్నా.. ఉపయోగం లేదు. ఇప్పటికైనా అధికారులు నీటిని సముద్రం పాలు చేయకుండా కాలువకు వదిలి రైతులను ఆదుకోవాలి.


250 క్యూసెక్కులు వదిలాం

- జనార్ధన్‌, డీఈ, వెలిగల్లు ప్రాజెక్టు

ఇప్పటికి 250 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు దిగువ ప్రాంతానికి వదిలాము. ఇంకో రెండు, మూడు రోజుల పాటు విడుదల చేస్తాం. కాలువలు మరమ్మతులు ఉండడంతో నీటిని దిగువకు వదలాల్సి వచ్చింది. కాలువల మరమ్మతులకు రూ.15 కోట్లు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్‌ పనులు మొదలు పెట్టి బిల్లులు రాక పనులు నిలిపేశాడు. 



Updated Date - 2022-06-30T05:16:14+05:30 IST