Velankanni: నేత్రపర్వంగా రథోత్సవం.. భక్తుల పారవశ్యం

ABN , First Publish Date - 2022-09-08T13:24:04+05:30 IST

రాష్ట్రంలో వేలాంకన్ని(Velankanni) ఆరోగ్యమాత కొలువుదీరిన నాగపట్టణం, చెన్నై ప్రాంతాల్లో బుధవారం రాత్రి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. రాష్ట్రం

Velankanni: నేత్రపర్వంగా రథోత్సవం.. భక్తుల పారవశ్యం

                                  - కిటకిటలాడిన వేలాంకన్ని 


ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 7: రాష్ట్రంలో వేలాంకన్ని(Velankanni) ఆరోగ్యమాత కొలువుదీరిన నాగపట్టణం, చెన్నై ప్రాంతాల్లో బుధవారం రాత్రి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి తరలివెళ్లిన భక్తులతో వేలాంకన్ని దివ్యక్షేత్రం కిటకిటలాడింది. నాగపట్టణం జిల్లా వేలాంకన్ని, బీసెంట్‌నగర్‌లోని వేలాంకన్ని చర్చిల్లో గత నెల 29న పతాకావిష్కరణతో వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతాల్లో రద్దీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసుశాఖ పకడ్బంధీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. తంజావూరు జిల్లా ఎస్పీ జవహర్‌(Thanjavur District SP Jawahar) నేతృత్వంలో రెండు వేల మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. కరోనా కారణంగా గత రెండేళ్లు వేలాంకన్ని మేరిమాత దివ్యక్షేత్రాల్లో భక్తులు లేకుండా ప్రార్థనలు నిర్వహించారు. కాగా, ఈ ఏడాది కోలాహలంగా ప్రారంభమైన వార్షికోత్సవాలకు రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, కర్ణాటక, కేరళ(Andhra Pradesh, Telangana, Karnataka, Kerala) తదితర రాష్ట్రాల భక్తులు పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. వార్షికోత్సవాల్లో ప్రధానాంశమైన రథోత్సవం బుధవారం సాయంత్రం 5.15 గంటలకు వేలాంకన్ని బాసలిక క్షేత్రంలో ప్రారంభమైంది. తంజావూరు బిషప్‌ ఆంబ్రోస్‌, చర్చి ఫాదర్‌ ప్రభాకరన్‌ సమక్షంలో ప్రపంచదేశాల్లో ఘర్షణలు, విద్వేషాలు సద్దుమణిగి శాంతి వెల్లివిరియాలని, ప్రజల్లో సోదరభావం పెంపొందాలని, రోగులు రోగాల బారి నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకోవాలని, వివిధ కారణాల వల్ల మృతిచెందిన వారి ఆత్మలు శాంతించాలని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రాత్రి 8 గంటలకు విద్యుద్దీపాలు, వివిధ పూలతో అలంకరించిన రథంలో చంటిబిడ్డతో సహా వేలాంకన్ని మేరీమాత విగ్రహాన్ని కొలువుదీర్చి అశేష భక్తజనం మధ్య ఊరేగించారు. అదే విధంగా, స్థానిక బీసెంట్‌ నగర్‌ వేలాంకన్ని చర్చి ఆధ్వర్యంలో నిర్వహించిన రథోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్ధం ప్రభుత్వ రవాణా సంస్థల ఆధ్వర్యంలో నాగపట్టణం, వేలాంకన్ని(Velankanni) ప్రాంతాలకు 700 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. దక్షిణ రైల్వే కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ప్రధానంగా బంగాళాఖాతం తీరంలో వెలసిన ఈ ఆలయాలకు వెళ్లే భక్తులు సముద్రంలో దిగి స్నానాలు చేసేందుకు పోలీసు శాఖ నిబంధనలు విధించింది. గురువారం వేలాంకన్ని మేరిమాత పట్టాభిషేకం, సాయంత్రం పతాక అవనతంతో వార్షికోత్సవాలు ముగుస్తాయి.


Updated Date - 2022-09-08T13:24:04+05:30 IST