ఆధ్యాత్మిక క్షేత్రాల జాబితాలో వేలాంకన్ని Church

ABN , First Publish Date - 2021-11-26T14:30:44+05:30 IST

భారతదేశంలో ప్రాచుర్యం పొందిన ఆధ్యాత్మిక క్షేత్రాల జాబితాలో నాగపట్టణం జిల్లాలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన వేలాంకన్ని మేరీమాత ఆలయానికి చోటు కల్పించినట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.

ఆధ్యాత్మిక క్షేత్రాల జాబితాలో వేలాంకన్ని Church

                    - ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటన


ప్యారీస్‌(చెన్నై): భారతదేశంలో ప్రాచుర్యం పొందిన ఆధ్యాత్మిక క్షేత్రాల జాబితాలో నాగపట్టణం జిల్లాలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన వేలాంకన్ని మేరీమాత ఆలయానికి చోటు కల్పించినట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో నివసిస్తున్న సీనియర్‌ సిటిజన్లు ఉచితంగా ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం 2018లో పథకాన్ని పరిచయం చేసింది. ఇందులో వేలాంకన్ని మేరీమాత ఆలయాన్ని కూడా చేర్చినట్టు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తాను అయోధ్యలోని రామ జన్మభూమిని సందర్శించిన సమయంలో తనకు ప్రశాంతత లభించిందని, ఈ స్పందన దేశంలోని ఒక్కొక్క పౌరుడికి అందజేయాలన్నదే తన ఏకైక లక్ష్యమని తెలిపారు. అయోధ్య నుంచి ఢిల్లీ చేరుకున్నాక తమ మంత్రివర్గంతో చర్చించి రామ జన్మభూమిని ఆధ్యాత్మిక కేంద్రాల జాబితాలో చేర్చామని, ఈ పథకానికి సంబంధించిన మొట్టమొదటి రైలు వచ్చే డిసెంబరు 3న ప్రారంభమవుతుందని, ఇందులో పాల్గొనే వారి పేర్ల నమోదు కూడా ప్రారంభమైందని తెలిపారు. ఈ పథకంలో కొన్ని పుణ్యక్షేత్రాలకు కూడా చోటు కల్పించాలని క్రైస్తవ సోదరులు విన్నవించుకున్నారని, ఢిల్లీకి చెందిన సీనియర్‌ సిటిజన్లు కూడా ఈ కోరిక తమ దృష్టికి తీసుకొచ్చారని, వారి వినతి మేరకు వేలాంకన్ని చర్చిని కూడా పుణ్యక్షేత్రాల సందర్శన జాబితాలో చేర్చినట్టు కేజ్రీవాల్‌ తెలిపారు.

Updated Date - 2021-11-26T14:30:44+05:30 IST