సిరుల రోషిణీ

ABN , First Publish Date - 2020-12-04T06:09:22+05:30 IST

దేశంలోని అత్యంత ధనిక మహిళల జాబితాలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చైర్‌పర్సన్‌ రోషిణీ నాడార్‌ మల్హోత్రా అగ్రస్థానంలో నిలిచారు.

సిరుల రోషిణీ

  • భారత ధనిక మహిళల జాబితాలో  నెం.1
  • వ్యక్తిగత ఆస్తి రూ.54,850 కోట్లు 
  • హైదరాబాద్‌ నుంచి 10 మందికి చోటు 
  • ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురికి స్థానం 


ముంబై: దేశంలోని అత్యంత ధనిక మహిళల జాబితాలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చైర్‌పర్సన్‌ రోషిణీ నాడార్‌ మల్హోత్రా అగ్రస్థానంలో నిలిచారు. ఆమె వ్యక్తిగత సంపద రూ.54,850 కోట్లు. రూ.36,600 కోట్ల ఆస్తితో బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌ షా రెండో స్థానం దక్కించుకున్నారు. కోటక్‌ వెల్త్‌, హురున్‌ ఇండియా సంయుక్తంగా ఈ లిస్ట్‌ను విడుదల చేశాయి. కనీసం రూ.100 కోట్ల ఆస్తి కలిగిన 100 మంది భారతీయ మహిళలకు ఈ జాబితాలో చోటు కల్పించాయి. మరిన్ని విషయాలు.. 



  1. ఈ వంద మందిలో 31 మంది మహిళలు స్వశక్తితో ఎదిగిన వారేనని రిపోర్టు వెల్లడించింది. ఈ 31 మందిలో ఆరుగురు ప్రొఫెషనల్‌ మేనేజర్లు కాగా, 25 మంది వ్యాపారస్తులని తెలిపింది. 
  2. స్వశక్తితో ఎదిగిన ధనిక మహిళల విభాగంలో కిరణ్‌ మజుందార్‌ షా నెం.1 స్థానం లో నిలిచారు. జోహోకు చెందిన రాధా వెంబు (రూ.11,590 కోట్లు), అరిస్టా నెట్‌వర్క్స్‌కు చెందిన జయశ్రీ ఉల్లాల్‌ (రూ.10,220 కోట్లు) ఆ తర్వాత స్థానా ల్లో ఉన్నారు. ఈ ముగ్గురికీ హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌లోనూ స్థానం దక్కడం గమనార్హం. 
  3. ఈ జాబితాలోని మహిళల మొత్తం ఆస్తి రూ.2.72 లక్షల కోట్లు. వీరి సగటు వయసు 53 ఏళ్లు. ఈ వందలో 19 మంది మహిళలు 40 ఏళ్లలోపు వారే. 
  4. ఈ లిస్ట్‌లో ఇద్దరు యూనికార్న్‌ హోదా కలిగిన స్టార్ట్‌పల ప్రమోటర్లు. సౌందర్య ఉత్పత్తుల ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ నైకాకు చెందిన ఫాల్గుణీ నాయర్‌ ఆస్తి రూ.5,410 కోట్లు. ఎడ్యుటెక్‌ యాప్‌ బైజూ్‌సకు చెందిన దివ్య గోకుల్‌నాథ్‌ సంపద రూ.3,490 కోట్లుగా నమోదైంది. వంద కోట్ల డాలర్ల  (రూ.7,400 కోట్లు) మార్కెట్‌ విలువ కలిగిన స్టార్ట్‌పలను యూనికార్న్‌లుగా పిలుస్తారు. 
  5. కొన్ని పారిశ్రామిక కుటుంబాల్లో ఒకరి కంటే ఎక్కువ మందికి ఈ లిస్ట్‌లో చోటు లభించింది. అపోలో హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సీ రెడ్డికి చెందిన నలుగురు కూతు ళ్లూ స్థానం పొందారు. గోద్రెజ్‌ గ్రూప్‌ నుంచి ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. 
  6. రంగాల వారీగా చూస్తే.. ఫార్మా నుంచి 13, టెక్స్‌టైల్స్‌ నుంచి 12, హెల్త్‌కేర్‌ నుంచి 9 మందికి లిస్ట్‌లో స్థానం లభించింది. 
  7. నగరాల వారీగా చూస్తే.. దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి 32, ఢిల్లీ నుంచి 20, హైదరాబాద్‌ నుంచి 10 మందికి చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురుస్థానం దక్కించుకున్నారు. 

Updated Date - 2020-12-04T06:09:22+05:30 IST