వాహనాలు షెడ్డుకు.. ప్రయాణికులు ఆస్పత్రికి..

ABN , First Publish Date - 2021-12-09T03:04:14+05:30 IST

రాపూరు - పొదలకూరు మధ్య ప్రయాణిస్తే వాహనాలు షెడ్డుకు, ప్రయాణికులు ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాహనాలు షెడ్డుకు.. ప్రయాణికులు ఆస్పత్రికి..
పొదలకూరు సమీపంలో చెరువులా రోడ్డు

పొదలకూరు రోడ్డులో ప్రయాణం నరకప్రాయం

రాపూరు, డిసెంబరు 8: రాపూరు - పొదలకూరు మధ్య ప్రయాణిస్తే వాహనాలు షెడ్డుకు, ప్రయాణికులు ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  వర్షాలకు ముందే ఈ రోడ్డు ధ్వంసమైంది. దీనికి తోడు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను ఈ మార్గంలోకి మళ్లించడంతో మరింత ధ్వంసమై ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలో నెల్లూరుకు వెళ్లివచ్చిన వాహనం తప్పనిసరిగా షెడ్డుకు వెళ్లాల్సిన దుస్తితి నెలకొనిందని వాహనదారులు అంటున్నారు.  గుంతల కారణంగా  వాహనాలు దెబ్బతింటుండగా, ఆర్టీసీ బస్సులకు మరమ్మతులు చేసేందుకు రోజూ చెమటోడాల్సి వస్తోందని మెకానిక్‌లు చెబుతున్నారు. కండలేరు డ్యాం సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద భారీ గోతులు ఏర్పడడంతో దారిని మూసివేసి ఒక వెంట్‌ నుంచే రాకపోకలు కొనసాగిస్తున్నారు. రాపూరు నవాబుపేట, పొదలకూరు సమీపంలో కొన్నిచోట్ల రహదారి పక్కనే పెద్ద పెద్ద బండరాళ్లు ఉన్నాయి. వాహనం స్కిడ్‌ అయితే బండరాళ్లతో ప్రమాదం పొంచి ఉందంటున్నారు. ఒకట్రెండు చోట్ల రహదారి పక్కనే భారీ గోతులు ఉన్నాయి. అక్కడక్కడా రోడ్డుకు ఇరువైపులా కర్రల గుట్టలు వేయడంతో మరింతగా ప్రమాదం పొంచి ఉందంటున్నారు. ఈ రహదారి మీద రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం తిరుగుతున్నారే తప్ప పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.




Updated Date - 2021-12-09T03:04:14+05:30 IST