Abn logo
May 23 2020 @ 03:26AM

చిరు వ్యాపారులపై.. కేసులా

ఆటోల్లో కూరలు తీసుకు వెళ్లాలంటే కష్టమే

హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌ వద్ద వాహనాల సీజ్‌

అర్థం లేని పోలీసు నిబంధనలపై విక్రయదారుల ఆగ్రహం


గుంటూరు(సంగడిగుంట), మే 22: కరోనా ఎందరికో కష్టాలు తెచ్చింది. ఈ కోవలో గుంటూరులో ఆకుకూరలు, కూరగాయలు విక్రయించే తమపై పోలీసులు అర్థం లేని ఆంక్షలతో అవస్థలు పెడుతున్నారని చిరువ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ అప్పటి నుంచి గుంటూరులో హోల్‌సేల్‌ కూరగాయల విక్రయాలను జాతీయ రహదారిపై  చేపట్టారు. అయితే కొన్ని రోజులుగా ఇక్కడ నల్లపాడు పోలీసులు వ్యాపారులను ఇబ్బందులు పాలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల పోలీసుల వైఖరికి నిరసనగా మూడురోజులపాటు ఆకు కూరల వ్యాపారులు సమ్మె చేశారు. నగరపాలక సంస్థ అధికారుల హామీతో  విరమించారు. అయినా పోలీసులు తమ ధోరణిని మార్చుకోలేదని పలువురు వాపోతున్నారు.


ఆకుకూరలు పండించే రైతులు ఇక్కడకు తీసుకువచ్చి విక్రయిస్తారు. కొందరు అద్దెకు ఆటోల్లో తెస్తుండగా తక్కువ మొత్తంలో తెచ్చే వారు బైక్‌లపైనో లేదంటే ప్రయాణికుల ఆటోల్లోనే తెస్తుంటారు. ఇలా బైక్‌లపైన, ప్రయాణికుల ఆటోల్లో తెచ్చే వారిని పోలీసులు ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఆయా ఆటోలను, బైక్‌లను సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో ఇలాంటి వారు మార్కెట్‌కు రాలేక పోతున్నారు. వారికష్టాలు అలా ఉంటే అక్కడికి కొనుగోలు కోసం వచ్చేవారి కష్టాలు మరోలా ఉన్నాయి. కొనుగోలు చేసినవారు కూడా బాడీ అటోలలోనే ఆకుకూరలు తీసుకువెళ్ళాలనే పోలీసుల నిబంధనతో ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరులో కూరగాయల రిటైలర్‌లకు బాడీ ఆటోలో తీసుకువెళ్ళేంత వ్యాపారం ఉండదు.


ప్రయాణికుల ఆటోలలో, లేదా వారి సొంత  ద్విచక్ర వాహనాలలోనే తీసుకువెళ్తుంటారు. ఇది ఎన్నో ఏళ్ళుగా జరిగే ప్రక్రియ. ఇప్పడు పోలీసులు దానిని తప్పు పడుతున్నారు. ఇలా వచ్చిన చిరు వ్యాపారుల వాహనాలను నల్లపాడు పోలీసులు లారీలలో స్టేషన్‌కు తరలిస్తున్నారు. వీరంతా వ్యాపారులు కాదని కొనుగోలుదారులని, సమీపంలోని మార్కెట్లకు వెళ్లకుండా ఇక్కడకు వస్తున్నారని పోలీసులు వాదిస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్‌ వద్దకు వచ్చి కొనుగోలు చేసే వారు వెనుకంజ వేస్తుండటంతో ఇక్కడ వ్యాపారాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. అసలే ధరలు లేక అల్లాడుతుంటే మధ్యలో పోలీసుల కేసులు ఎందుకని పలువురు మార్కెట్‌కు రావడంలేదు. 


ఇలా అయితే వ్యాపారాలు చేయలేం

మార్కెట్‌ వద్ద పోలీసులు అనుసరిస్తున్న ధోరణి వల్ల వ్యాపారాలు చేయలేం. ఆకుకూరలు పండించేవారంతా చిన్నరైతులే. పోలీసుల వేధింపులతో మార్కెట్‌కు రాలేక పోతున్నారు. మా వద్ద కొనుగోలు చేసే చిరు వ్యాపారులు కూడా రాలేక పోతున్నారు. వీటిని తట్టుకోలేకే వ్యాపారాలు ఆపేశాం. మన్సిపల్‌ అధికారులు హామీ ఇచ్చాకే ప్రారంభించినా పోలీసులు కేసులు పెడుతూనే ఉన్నారు.   ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి. లేదంటే మళ్ళీ నిలిపి వేయడం తప్ప మార్గం లేదు.

-చిమటా వెంకటశివరావు, హోల్‌సేల్‌ ఆకుకూరల వ్యాపారుల సంఘం అధ్యక్షుడు 

Advertisement
Advertisement
Advertisement