Advertisement
Advertisement
Abn logo
Advertisement

వాహన‘దారులు’ బెంబేలు!

ప్రమాదకరంగా ప్రధాన మార్గాలు

ఎక్కడికక్కడ గోతులు, రంధ్రాలు

చినపాచిల, కానాడ రోడ్లలో నిలిచిన ప్రయాణాలు


రావికమతం, అక్టోబరు 22: మండలంలోని ప్రధాన రోడ్లు ప్రమాదకరంగా మారాయి. రహదారులు ఆద్యంతం గోతులు ఏర్పడ్డాయి. వీటికితోడు ఎక్కడికక్కడ పెద్ద పెద్ద రంధ్రాలు పడ్డాయి. దీంతో ప్రయాణం ప్రమాదకరంగా పరిణమించింది. 

చినపాచిల-కింతలి, మేడివాడ-కానాడ రహదారులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. మేడివాడ-కానాడ రోడ్డులోని మేడివాడ పెద్ద చెరువు కాలువు నీరు వెళ్లేందుకు శివాలయం సమీపంలో నిర్మించిన వంతెన రోడ్డు మధ్యలో భారీ రంధ్రం పడింది. దీంతో మేడివాడ, కానాడ గ్రామాలకు చెందిన వాహన చోదకుల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే చినపాచిల-కింతలి వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డులో మత్స్యపురం ఎర్ర చెరువు వద్ద నాగుల కొండ గెడ్డ ఉదృతికి రోడ్డు సగానికిపైగా కోతకు గురైంది. దీంతో నిత్యం వాహనాలతో రాకపోకలు జరిగే ఈ రోడ్డులో ప్రయాణం ప్రమాదభరితంగా మారింది. రాత్రి వేళల్లో కోతకు గురైన రోడ్డు కనిపంచక వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ద్విచక్ర వాహనదారులు గోతుల్లో పడి గాయపడ్డారు. కనీసం గోతులు పడిన చోట్ల సంబంధిత అధికారులు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణమని ఆయా గ్రామాల ప్రజలు, వాహన చోదకులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా రహదారుల్లో ప్రమాదకరంగా మారిన గోతులు, రంధ్రాలను పూడ్చాలని వారు కోరుతున్నారు.

Advertisement
Advertisement