కిషన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలపై కేసు

ABN , First Publish Date - 2021-04-15T09:16:48+05:30 IST

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన మూడు ప్రధాన పార్టీల ముఖ్య నేతలపై కేసులు నమోదు చేశామని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్‌ తెలిపారు.

కిషన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలపై కేసు

నల్లగొండ క్రైం, ఏప్రిల్‌ 14: నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన మూడు ప్రధాన పార్టీల ముఖ్య నేతలపై కేసులు నమోదు చేశామని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్‌ తెలిపారు. ఈ నెల 10వ తేదీన నిడమనూరు మండలంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, తిరుమలగిరి మండలంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి, విద్యుత్తు శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి తమ ప్రచారంలో పరిమితికి మించి వాహనాలు వినియోగించారన్నారు. హాలియాలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌తో కలిసి బుధవారం రంగనాథ్‌ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కాన్వాయ్‌లో 5 వాహనాలకే అనుమతి ఉందని, వీరి ప్రచారంలో 15-20 వాహనాలు ఉండటంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌, బీజేపీ అభ్యర్థి రవినాయక్‌పై కేసులు పెట్టామన్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారానికి గడువు ఈ నెల 15వ తేదీ సాయంత్రం ముగియనున్నందున ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా వెళ్లిపోవాలని ఎస్పీ రంగనాథ్‌ సూచించారు. సాగర్‌లోనే ఉంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2021-04-15T09:16:48+05:30 IST