Advertisement
Advertisement
Abn logo
Advertisement

వాహనం బోల్తా.. బాలిక మృతి

  1. 15 మందికి గాయాలు 
  2.  దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం


వెల్దుర్తి, డిసెంబరు 4: వెల్దుర్తి మండలంలోని శ్రీరంగాపురం కొండలో వెలసిన పాలుట్ల రంగస్వామి దైవదర్శనానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. కోడుమూరు పట్టణం కొండపేటకు చెందిన పెద్దయ్య కుటుంబంతో పాటు వారి సమీప బంధువులు అందరూ కలిసి కార్తీక మాసంలోని చివరి అమావాస్య కావడంతో శ్రీరంగాపురం సమీపంలోని కొండపై వెలసిన పాలుట్ల రంగస్వామి దర్శనానికి ఓ వాహనంలో బయలుదేరారు. వీరితో పాటు సమీప బంధువులు వెల్దుర్తి మండల పరిధిలోని మల్లెపల్లె, చెరుకులపాడు గ్రామాలకు చెందిన వారు సైతం వారి వెంట బయలుదేరారు. అలాగే డోన్‌ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వారి బంధువులు రంగడు, భార్య రంగమ్మ, కూతురు రాధ మదార్‌పురం గ్రామం వద్ద వాహనంలో ఎక్కారు. అక్కడి నుంచి స్వామి వారి దర్శనానికి బయలుదేరి శ్రీరంగాపురం దాటిన అనంతరం కొండపైకి వెళ్లే ఘాట్‌ పైకి చేరుకుంది. కిలోమీటర్‌ ఘాట్‌ ఎక్కిన అనంతరం వాహనం వెనక్కి వస్తున్న సమయంలో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వెంకటాపురానికి చెందిన రాధ (14) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. 108 సిబ్బంది, వెల్దుర్తి, డోన్‌, ప్యాపిలి 108 వాహనాలు అక్కడికి బయల్దేరి గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తీవ్ర గాయాలైన 15 మందిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరి కొందరు డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్‌ఐ రామ్మోహన్‌ రెడ్డి తెలిపారు. మృతి చెందిన బాలిక రాధ డోన్‌ జడ్పీహెచ్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నట్లు తెలిపారు. 

బోల్తా పడిన వాహనం


Advertisement
Advertisement