రేషన్‌ పంపిణీ చేయలేమంటున్నారు..!

ABN , First Publish Date - 2021-03-02T06:07:46+05:30 IST

మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 9 మంది టక్కు ఆపరేటర్లు ట్రక్కులతో సహా రేషన్‌ పంపిణీ చేయలేమంటూ సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు వచ్చారు.

రేషన్‌ పంపిణీ చేయలేమంటున్నారు..!
తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకొచ్చిన రేషన్‌ ట్రక్కులు

రుద్రవరం, మార్చి 1: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 9 మంది టక్కు ఆపరేటర్లు ట్రక్కులతో సహా రేషన్‌ పంపిణీ చేయలేమంటూ సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు వచ్చారు. వారు తహసీల్దార్‌ వెంకటశివతో మాట్లాడుతూ ఉదయం 5.30 గంటలకు రేషన్‌ పంపిణీ ప్రారంభిస్తే రాత్రి 10 గంటలు అవుతోందని వివరించారు. మధ్యలో భోజనానికి కూడా వెళ్లలేక పోతున్నామని ట్రక్కు ఆపరేటర్లు ప్రసాద్‌, మహమ్మద్‌రఫి, సుధాకర్‌రెడ్డి, నరసింహ తదితరులు అన్నారు. ఈ-పోసు యంత్రం ఆపరేటింగ్‌ పనితోపాటు ప్రతి రోజూ చౌక దుకాణాల వద్ద రేషన్‌ తూకం వేసుకొని వెళ్లడం దగ్గరి నుంచి ఏ రోజుకు ఆ రోజు డబ్బులు చౌక దుకాణల డీలర్లకు చెల్లించడం దాకా అనేక పనులు చేయడం కష్టతరంగా ఉందని అన్నారు. ఈ మేరకు సమస్యలతో కూడిన వినతి పత్రం తహసీల్దార్‌కు అందజేశారు. ఎవరికైనా పని చేయడం ఇష్టం లేక పోతే రాజీనామా చేస్తే వెంటనే కొత్తవారిని నియమిస్తామని ఆపరేటర్లకు సూచించారు. రేషన్‌ పంపిణీ ఆపవద్దని తహసీల్దార్‌ ట్రక్కు ఆపరేటర్లకు సూచించారు. ఇది ప్రభుత్వ పథకం కాబట్టి ఆపేస్తే కేసులు నమోదు చేయడమే కాకుండా ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాలు అందకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తామని తహసీల్దార్‌ తెలిపారు. తహసీల్దార్‌ హామీతో ట్రక్కు ఆపరేటర్లు గ్రామాలకు వెళ్లిపోయారు.


Updated Date - 2021-03-02T06:07:46+05:30 IST