వంట గదిలో ధరల మంట

ABN , First Publish Date - 2020-10-28T04:45:39+05:30 IST

కూరగాయల అధిక ధరతో వంట గది మండిపోతోంది. కూరలు ఉడకడం లేదు. సామాన్యులు పప్పు రసంతో కడుపు నింపుకుంటున్నారు.

వంట గదిలో ధరల మంట

నరసాపురం/పాలకొల్లు అర్బన్‌, అక్టోబరు 27: కూరగాయల అధిక ధరతో వంట గది మండిపోతోంది. కూరలు ఉడకడం లేదు. సామాన్యులు పప్పు రసంతో కడుపు నింపుకుంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అరకొర పని తో అంతంతమాత్రం సంపాదన తిండికి కూడా చాలని పరిస్థితి నెలకొంది. ఉల్లి ధర కంట కన్నీరు పెట్టిస్తుంటే కూరగాయల ధరలు కంగారు పెడు తున్నాయి. జేబులో రూ.500 నోటుతో మార్కెట్‌కు వెళితే ఇంటికి వచ్చి జేబు చూస్తే డబ్బు మాయం.. చేతిలో సంచి చూస్తే సగం కూడా నిండదు.


మార్కెట్‌లో కూరగాయల కనీస ధర కేజీ రూ.60 పైమాటే. రకాన్ని బట్టి కిలో రూ.80 నుంచి రూ.వంద ధర పలుకుతున్నాయి. అత్యధికంగా చిక్కుడు ధర కేజీ రూ 120 చేరింది. క్యాప్సికం కిలో రూ.వంద. నిన్నటి వరకు కేజీ రూ 30 నుంచి రూ 40 మధ్య ఉన్న వంకాయల ధర ఒక్కసారిగా రూ.80 చేరింది. బెండ, బీర కాకర, క్యారెట్‌, గోరుచిక్కుడు, బీట్‌రూట్‌, దొండ కాయ  ధరలు కేజీ రూ.60పైనే  పలుకుతున్నాయి. బీన్స్‌ రూ 80, ఫ్రెంచ్‌ బీన్స్‌ రూ 60, టమాట రూ.60, మిర్చి రూ.60, ఆనపకాయ సైజ్‌ను బట్టి రూ.25 నుంచి రూ.30, పొట్లకాయ రూ.25 ఉంది. బంగాళా దుంపలు కిలో రూ. 65, చిలగడదుంపలు రూ.55, క్యాబేజీ రూ.60, అరటి కాయలు జత 15, అల్లం పావుకిలో రూ.20, కొత్తిమీర కట్ట రూ. 25, తోటకూర, గోంగూర, పాలకూర కట్ట రూ 10 చొప్పున విక్రయిస్తున్నారు.

వరుస తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా జిల్లాలో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల రైతులు చేతికొచ్చిన పంట కోల్పోయారు. పొరుగన కృష్ణా, తూర్పులో కూడా ఇదే పరిస్థితి. కర్ణాటక, ఒడిశా, బెంగాల్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సి పరస్థితి ఏర్పడింది.  చిత్తూరు జిల్లా మదనపల్లి, బెంగుళూరు నుంచి టమాటా, ఒడిశా, బెంగాల్‌ నుంచి ఆనపకాయ, వంకాయ, దొండకాయలు, తెలంగాణ నుంచి క్యారెట్‌, బీర్‌ రూట్‌ వస్తున్నాయి. పంటలు చేతికొచ్చి, దిగుబడి వచ్చే వరకు ధరలు దిగే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు పప్పు, రసం, ఆకుకూరలతో సరిపుచ్చుకుంటున్నారు.


ఉల్లిపాయలు రూ.120

ఆచంట: ఉల్లి కోయనవసరం లేదు ధర చూస్తే కన్నీళ్లు వస్తాయి. ఉల్లి ధర మండిపోవడం ఒకెత్తు అయితే దిగుమతి, డిమాండ్‌ను బట్టి ఉల్లి కిలో రూ.60 నుంచి రూ.120 ధర పలుకుతోంది. సాధారణ రకం ఉల్లి రూ.60 ఉండగా మార్కెట్‌లో సరుకు సరఫరా లేకుంటే తక్షణం ధర ఎగబాకుతోంది. గ్రామీణ మార్కెట్‌లో ధర మరీ మండుతోంది. ప్రస్తుతం రూ.100 నుంచి రూ.120 మధ్య విక్రయాలు సాగుతున్నాయి. .ప్రతి ఇంట్లో ఉల్లిపాయలు నిత్యావసరం. అధిక ధరతో కొంతమంది ఉల్లి కొనుగోలు చేయడం లేదు. వర్షాల కారణంగా ఒక్కసారిగా ధరలు పెరిగాయని, దీనికితోడు మార్కెట్‌ మాయాజాలంతో మరింత అధిక ధర పలుకుతోంది. ప్రభుత్వ అధికారులు స్పందించి ఉల్లి ధర నియంత్రించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2020-10-28T04:45:39+05:30 IST