చుక్కల్లోకెక్కినాయి!

ABN , First Publish Date - 2020-11-02T05:48:59+05:30 IST

మరో పక్షం రోజుల్లో దీపావళి. కానీ, సామాన్యుల ఇళ్లలో ఆ వెలుగులు కనిపించే పరిస్థితి లేకుండా పోయింది. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగాయి

చుక్కల్లోకెక్కినాయి!

నింగినంటిన నిత్యావసర ధరలు

ఉట్టెక్కిన ఉల్లి... రూ.100కు చేరిన కిలో ధర

ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన

కూరగాయల ధరలూ భగ్గు..భగ్గే

ఏ కూరగాయైునా కిలో రూ.80కి పైమాటే

ఆందోళనలో పేద, మధ్యతరగతి కుటుంబాలు


పప్పులు నిప్పులు చెరుగుతున్నాయి. నూనెలు సలసల కాగుతున్నాయి. మిర్చి మంటెక్కిస్తోంది. టమాటా ఠారెత్తిస్తోంది. ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. పండగ మాట పక్కన పెడితే సామాన్యులు రోజువారీ తిండి కూడా తినే పరిస్థితులూ లేకుండా పోయాయి. నిత్యావసర వస్తువుల ధరలు రెండింతలు పెరిగాయి. సామాన్యుల ఇంట్లో కూరలు వండే పరిస్థితి లేకుండా పోయింది. కారం మెతుకులే దిక్కవుతున్నాయి.


పరిగి: మరో పక్షం రోజుల్లో దీపావళి. కానీ, సామాన్యుల ఇళ్లలో ఆ వెలుగులు కనిపించే పరిస్థితి లేకుండా పోయింది. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు ఉన్న ధరలు ఒక్కసారిగా రెండింతలయ్యాయి. మార్కెట్లలో ఉల్లితోపాటే  కూరగాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. పెరుగుతున్న కూరగాయల ధరలతో పేద ప్రజలకు భారంగా పరిణమిస్తోంది. నిత్యం అవసరమయ్యే కూరగాయల ధరలు.. నేడు చుక్కలనంటడంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు బావురుమంటున్నాయి. కూరగాయల ధరలు అసాధారణ రీతిలో పెరగడంతో జీవనం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూపాయికిచ్చే కొత్తిమీర పది రూపాయలకు చేరుకుంది. ధరలను నియంత్రిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా దానికి భిన్నంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి.


ఇటీవల బాగా పెరిగిన కూరగాయల ధరలు సామాన్యుడికి పోషకాహారాన్ని దూరం చేస్తున్నాయి. రైతుల నుంచి వచ్చిన కూరగాయలను నేరుగా దళారులు వేలం లెక్కన తక్కువ ధరకు తీసుకుని.. అధిక ధరలకు విక్రయించడంతో రోజురోజుకూ కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఇక, ఉల్లి ధర కన్నీళ్లు తెప్పి స్తోంది. ఆకాశన్నంటిన ఉల్లిగడ్డల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉల్లి ధర కిలో నిన్నమొన్నటి వరకు రూ.20 నుంచి రూ.30ల వరకు పలికింది. ఇప్పుడు అది ఏకంగా 100 రూపా యలకు పైగానే పలుకుతోంది. రెండు, మూడు వారాల నుంచి వికారా బాద్‌ జిల్లాలోని పరిగి, వికారాబాద్‌, తాండూరు, కొడంగల్‌ మార్కెట్లలో ఉల్లిధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇలా శనివారం పరిగిలో కిలో ఉల్లి రూ.100 పలికింది. మిగతా కూరగాయలను కూడా రూ.80కు కిలో చొప్పున అమ్మారు. 


పంట దళారుల చేతికి రాగానే..

కూరగాయల ధరలు ఇంతగా పెరిగినా రైతులకు మాత్రం లాభాలు రావడం లేదు. మధ్య దళారులు రైతుల వద్ద తక్కువకు కొని వినియోగదారులకు ఎక్కువకు అమ్ముతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా రైతుల నుంచి వ్యాపారుల చేతికి చేరగానే ఒక్కసారిగా ఆకాశాన్నంటుతు న్నాయి. ఉల్లి పంట రైతుల నుంచి వ్యాపారుల చేతికి వచ్చిన వెంటనే దాని ధరలు అమాంతంగా పెరిగాయి. సెప్టెంబర్‌లో రైతుల నుంచి వ్యాపారులు క్వింటా ఉల్లిని రూ.800 నుంచి రూ.1600కు కొన్నారు.


దానిని స్టాక్‌చేసి కృత్రిమ కొరత సృష్టించి ఇప్పుడు 8వేల రూపాయలకు పైగా అమ్ము తున్నారు. చిల్లర ధర ఇప్పుడు కిలో వంద రూపాయలకు పైగా పలుకుతోంది. ఇంకా దీని ధర పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. వ్యాపారులు తక్కువ ధరకు కొని రైతులను, ఎక్కువకు అమ్మి వినియోగదారులను పీడిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని రైతులు, వినియోగదారులు వాపోతు న్నారు. ప్రభుత్వం వెంటనే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.


దళారుల దోపిడీ ఇలా (కిలోకు రూపాయల్లో)

కూరగాయ రైతుకిచ్చేది మార్కెట్‌లో అమ్మేది

పచ్చిమిర్చి 45 80

బీరకాయ 45 100

బెండకాయ 25 60

వంకాయ 25 60

ఉల్లి 12 100

టమాట 15 50


ఇంత ధరా..?  జోళ్లు అనురాధ, మందిపల్‌

కేవలం రెండు నెలల్లోనే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఇంత పెద్దమొత్తంలో ధరలు పెరగడం నేను ఎన్నడూ చూడలేదు. ఉల్లి ధర అయితే వినడానికే భయమేస్తోంది. కూరగాయల ధరలు కూడా కొనేలా లేవు. కూరగాయలు కొనలేక పచ్చడి, కారం వెసుకొని తినాల్సి వస్తుంది. ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి.


ధరల పెరుగుదల ఇలా.. (కిలోకు రూపాయల్లో)

కూరగాయ 2నెలల క్రితం ప్రస్తుతం

పచ్చిమిర్చి 40 80

బీరకాయ 40 100

బెండకాయ 30 60

ఆలుగడ్డ 20 50

దొండకాయ40 60

వంకాయ 30 60

ఉల్లి 20 100

టమాట 30 50

కందిపప్పు 90 120

పెసరపప్పు 90 110

పంచదార 35 40

ఆయిల్‌పాకెట్‌(లీ)105 120

Updated Date - 2020-11-02T05:48:59+05:30 IST