సామాన్యులను హడలెత్తిస్తున్న కూరగాయల ధరలు

ABN , First Publish Date - 2021-11-19T21:44:45+05:30 IST

గత కొన్ని రోజులుగా సామన్యులకు అందనంత ఎత్తులో కూరగాయలు పెరిగిపోతున్నాయి. రోజుకో రీతిలో పలుకుతున్న ధరలు చూసి సామాన్య ప్రజలు హడలెత్తి పోతున్నారు

సామాన్యులను హడలెత్తిస్తున్న కూరగాయల ధరలు

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా సామన్యులకు అందనంత ఎత్తులో కూరగాయలు పెరిగిపోతున్నాయి. రోజుకో రీతిలో పలుకుతున్న ధరలు చూసి సామాన్య ప్రజలు హడలెత్తి పోతున్నారు. నెల రోజుల క్రితం ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు రెట్టింపు పెరిగాయి. పెరిగిన ధరలను చూపి వ్యాపారులు కొనుగోలు దారులను నిలువుదోపిడీ చేస్తున్నారు. నెల రోజుల క్రితం కిలో 10 నుంచి 20 రూపాయలు పలికిన టమాటా ధరలు ఒక్కసారిగా మండిపోతున్నాయి. 


రిటైల్ మార్కెట్లో కిలో 60 నుంచి 80 రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. మిగిలిన కూరగాయల విషయానికి వస్తే బీర కాయ కిలో 50 రూపాయలు, దొండ 50 నుంచి 60రూపాయలు, చిక్కుడు 50 నుంచి 60 రూపాయలు, పచ్చిమిర్చి కిలో 50 రూపాయలు, ఆలుగడ్డ 50 రూపాయలు, బెండకాయ 60 రూపాయలు, గోకర కాయ 50 నుంచి 60 రూపాయలు పలుకుతున్నాయి. కూరగాయల ధరలు పెరగడానికి వ్యాపారులు రక రకాల కారణాలు చెబుతున్నారు. కార్తీక మాసం కావడంతో చాలా మంది కూరగాయల వైపు మొగ్గు చూపడంతో ధరలు పెంచి అమ్ముతున్నారు. 


గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా కూరగాయల దిగుబడి బాగా తగ్గిందని కూడా వ్యాపారులు వెల్లడించారు. పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక నుంచి కూడా దిగుమతులు బాగా తగ్గాయి. ఈ కారణంగా హైదరాబాద్ మార్కెట్ కు సాధారణ రోజుల్లో వచ్చే దిగుమతుల కంటే సగానికి సగం పడిపోయినట్టు వ్యాపారులు తెలిపారు. కొత్త పంట చేతికొచ్చే వరకూ పరిస్ధితి ఇలాగే ఉంటుందని అధికారులు, వ్యపారులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2021-11-19T21:44:45+05:30 IST