మండిపోతున్న కూరగాయల ధరలు

ABN , First Publish Date - 2021-10-10T20:21:07+05:30 IST

గత కొంత కాలంగా నిలకడగా ఉన్న కూరగాయల ధరలు నాలుగు రోజులుగా మండిపోతున్నాయి.పెరిగిన ధరలు చూసి సామాన్య ప్రజలు కంగుతింటున్నారు.

మండిపోతున్న కూరగాయల ధరలు

హైదరాబాద్‌: గత కొంత కాలంగా నిలకడగా ఉన్న కూరగాయల ధరలు నాలుగు రోజులుగా మండిపోతున్నాయి.పెరిగిన ధరలు చూసి సామాన్య ప్రజలు కంగుతింటున్నారు. ఒక పక్క భారీ వర్షాల కారణంగా పంట నష్టం వల్ల కూరగాయల దిగుబడి తగ్గి, మార్కెట్‌కు సరఫరా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. మరో పక్క దసరా నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం కావడంతో నాన్‌వెజ్‌ తినే వారి సంఖ్య తగ్గడం కూడా కారణమని అంటున్నారు. సాధారణంగా ఏ పండగలు వచ్చినా వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. కానీ దసరా నవరాత్రులు, బతుకమ్మ పండగ నేపధ్యంలో ఈసారి మాత్రం సామాన్యులకు ధరలు దడపుట్టిస్తున్నాయి. 


హైదరాబాద్ నగరంలోని పలు మార్కెట్లలో వారం రోజుల క్రితం కిలో ట మాటా 20 రూపాయలలోపే పలికింది. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో అయితే కిలో 40 నుంచి 50 రూపాయలు అమ్ముతున్నారు. కాలనీలు, బండ్లపై అమ్మేవారు మాత్రం కిలో 60 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కాయగూరల విషయానికి వస్తే పాలకూర పది రూపాయలకు 3 నుంచి 4 కట్టలు అమ్మేవారు. కానీ ప్రస్తుతం 20 రూపాయలకు 3కట్టలే వస్తున్నాయి. ఇక వంకాయలు కిలో 40 నుంచి 50రూపాయలు, చిక్కుడు కాయ కిలో 40 నుంచి 50 రూపాయలు, బిన్నీసు 60 నుంచి 70 రూపాయలు, బుడమ కాయలు కిలో 40 రూపాయలు, గోకర కాయ 40 నుంచి 50రూపాయలు పలుకుతున్నాయి. 


దాదాపు అన్నిరకాల కూరగాయల ధరలు ప్రస్తుతం రెట్టింపు అయ్యాయి. వర్షాల కారణంగా పంట నష్టం జరిగిందని, అందుకే మార్కెట్‌కు దిగుమతులు తగ్గడం వల్ల ధరలు పెరిగాయని కొందరు వ్యాపారులు చెబుతున్నారు. అంతే కాకుండా నవరాత్రులు పూర్తయ్యే వరకూ చాలా మంది నాన్‌వెజ్‌ ప్రియులు కూడా కూరగాయల పైనే ఆధారపడుతుంటారు. ఈ కారణంగానే కొందరు వ్యాపారులు పెంచి అమ్ముతున్నారన్న వాదన కూడా వుంది. మొత్తానికి పండగలు, వర్షాల కారణంగా సామాన్య ప్రజలపై ధర భారం పడుతోందని సామాన్యులు వాపోతున్నారు. 

Updated Date - 2021-10-10T20:21:07+05:30 IST