వెజ్‌తో వెరైటీగా...

ABN , First Publish Date - 2020-05-16T05:30:00+05:30 IST

రంజాన్‌ మాసంలో నాన్‌ వెజ్‌ రుచులే ఎందుకు? పనీర్‌ నిహారి, జీడిపప్పు పులావ్‌, మఖానా కర్రీ వంటి వెజిటేరియన్‌ రుచులను సైతం వండుకోవచ్చు. ఉదయం సహర్‌ వేళ మరింత పసందుగా ఉండాలంటే ఈ వంటకాలను...

వెజ్‌తో వెరైటీగా...

రంజాన్‌ మాసంలో నాన్‌ వెజ్‌ రుచులే ఎందుకు? పనీర్‌ నిహారి, జీడిపప్పు పులావ్‌, మఖానా కర్రీ వంటి వెజిటేరియన్‌ రుచులను సైతం వండుకోవచ్చు. ఉదయం సహర్‌ వేళ మరింత పసందుగా ఉండాలంటే ఈ వంటకాలను ట్రై చేయండి.



మఖానా కర్రీ

కావలసినవి: మఖానా (తామర గింజలు) - కప్పు, పచ్చి బఠాణీ - అరకప్పు, ఉల్లిపాయ - ఒకటి, టొమాటో ప్యూరీ - కప్పు, కారం - రెండు టీస్పూన్లు, ధనియాల పొడి - టేబుల్‌స్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, గరంమసాలా - టీస్పూన్‌, జీలకర్ర - పావు టీస్పూన్‌, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత, కొత్తిమీర - గార్నిష్‌ కోసం. 

పేస్టు కోసం : ఉల్లిపాయ - ఒకటి, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి - ఐదు రెబ్బలు, గసగసాలు - ఒక టీస్పూన్‌, జీడిపప్పు - ఐదు పలుకులు, నూనె - సరిపడా.

తయారీ: ముందుగా పేస్టు తయారీ కోసం పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి.

  1. అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. బాగా వేగిన తరువాత స్టవ్‌ పైనుంచి దింపాలి. గసగసాలు, జీడిపప్పు వేసి కలియబెట్టాలి. 
  2. చల్లారిన తరువాత మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పొసి మెత్తటి పేస్టులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు అదే పాన్‌లో తామరగింజలు వేసి చిన్నమంటపై వేగించాలి. కాసేపు వేగిన తరువాత ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టాలి.
  4. అదే పాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత రెడీ చేసి పెట్టుకున్న పేస్టు వేసి చిన్నమంటపై రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. కొద్దిసేపటికి టొమాటో ప్యూరీ, కారం, ధనియాలపొడి, పసుపు వేసి కలియబెట్టాలి. మూతపెట్టి చిన్నమంటపై ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. 
  5. బఠాణీలు వేసి తగినంత ఉప్పు చల్లుకుని కాసిన్ని నీళ్లు పోసి మరో మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి.
  6. ఇప్పుడు వేగించి పెట్టుకున్న తామర గింజలు వేయాలి. చిన్నమంటపై మరికాసేపు ఉడకనివ్వాలి. చిక్కటి గ్రేవీ తయారవుతుంది. 
  7. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని దింపాలి. ఈ కూరచపాతీలోకి లేదా పులావ్‌లోకి రుచిగా ఉంటుంది.




పనీర్‌ నిహారి

కావలసినవి: పనీర్‌ - 150 గ్రాములు, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, కారం - రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు - ఒక టేబుల్‌స్పూన్‌, ధనియాల పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, యాలకుల పొడి - ఒక టీస్పూన్‌, దాల్చిన చెక్క - చిన్నముక్క, సోంపు - రెండు టేబుల్‌స్పూన్లు, జాజికాయ పొడి - చిటికెడు, జాపత్రి - చిటికెడు, ఉప్పు - తగినంత, మైదా - మూడు టేబుల్‌స్పూన్లు, నూనె - సరిపడా. 

తయారీ: పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక పనీర్‌ ముక్కలు వేసి వేగించాలి. ముదురు గోధుమరంగులోకి మారే వరకు వేగించుకున్న తరువాత ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 

  1. అదే పాన్‌లో అల్లం వెల్లుల్లి, కారం, పసుపు, ధనియాలపొడి, జీలకర్రపొడి, యాలకుల పొడి, దాల్చిన చెక్క, సోంపు, జాజికాయపొడి, జాపత్రి వేసి వేగించాలి. తరువాత ఒక కప్పు నీళ్లు పోయాలి.
  2. మరొక పాత్రలో మైదా పిండిని తీసుకుని అరకప్పు నీళ్లు పోసి మెత్తగా కలపాలి. తరువాత మసాల మిశ్రమంలో పోసి మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. తగినంత ఉప్పు వేయాలి. 
  3. ఇప్పుడు వేగించి పెట్టుకున్న పనీర్‌ ముక్కలు వేయాలి. చిన్నమంటపై కాసేపు ఉడికించుకొని దింపుకోవాలి.
  4. ఈ కర్రీ రోటీలోకి లేదా అన్నంలోకి రుచిగా ఉంటుంది. 







జీడిపప్పు పులావ్‌

కావలసినవి:  బాస్మతి బియ్యం - ఒక కప్పు, నెయ్యి - మూడు టేబుల్‌స్పూన్లు, జీడిపప్పు - యాభైగ్రాములు, లవంగాలు - రెండు, బిర్యానీ ఆకు - ఒకటి, దాల్చిన చెక్క -చిన్నముక్క, ఉల్లిపాయ  - ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, పచ్చిమిర్చి - రెండు,  కారం - అర టీస్పూన్‌, పుదీనా కొత్తిమీర పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిబఠాణీ - పావు కప్పు, క్యారట్‌ - ఒకటి, ఉప్పు - తగినంత

తయారీ:  బియ్యంను శుభ్రంగా కడిగి పావుగంట పాటు నానబెట్టాలి.

  1. పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక జీడిపప్పు వేసి వేగించుకుని పక్కన పెట్టుకోవాలి.
  2. అలాగే పచ్చిమిర్చిని వేగించి పక్కన పెట్టాలి.
  3. ఇప్పుడు పాన్‌లో మరికాస్త నెయ్యి వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేగించాలి.
  4. తరువాత ఉల్లిపాయలు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా కొత్తిమీర పేస్టు వేసి కలపాలి.
  5. కారం వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి.
  6. పచ్చిబఠాణీ, క్యారెట్‌ ముక్కలు వేసి రెండు మూడు నిమిషాలు వేగించాలి.
  7. మూత పెట్టి చిన్నమంటపై కాసేపు వేగించుకున్న తరువాత బియ్యం వేయాలి. 
  8. తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించాలి.
  9. అన్నం ఉడికిన తరువాత వేగించి పెట్టుకున్న జీడిపప్పు, పచ్చిమిర్చి వేసి, వేడి వేడిగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2020-05-16T05:30:00+05:30 IST