Abn logo
Oct 28 2020 @ 00:21AM

వీరతాడు

దేశాల ఆర్థికస్థితిగతులను, ఆరోగ్యాన్ని, పారిశుద్ధ్యాన్ని, అక్షరాస్యతను, శాంతిభద్రతలను, స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను తులనాత్మకంగా పరిశీలించి, అనేక అంతర్జాతీయ సంస్థలు తారతమ్యాలను గుర్తిస్తాయి. వాణిజ్య సంబంధాలు పెట్టుకోవాలనుకునేవారు, అప్పులిచ్చేవారు, గ్రాంట్లిచ్చేవారు, పౌరసంఘాలతో పనిచేయాలనుకునేవారు ఆ సంస్థల పరిశీలనలను పరిగణనలోకి తీసుకుంటారు. అట్లాగే, ఒక దేశంలోని ప్రజాస్వామ్యం నాణ్యత ఏ పాటి ఉన్నదో పరిశీలించే ప్రయత్నం కూడా జరుగుతోంది. స్వీడన్‌కు చెందిన వి–డెమ్‌ అనే స్వతంత్ర పరిశోధనా సంస్థ 2017 నుంచి ఈ మదింపు వేస్తోంది. గోథెన్‌బెర్గ్‌ విశ్వవిద్యాలయం కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ, ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకు సంబంధించిన రకరకాల కొలమానాల సమాచారాన్ని భారీగా సేకరిస్తుంది. ప్రజాస్వామ్యం గురించి అంతటి సమాచారం మరే సంస్థా సేకరించదు. ఈ సంస్థ భారతదేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం అణగారిపోతున్నదని, ఏకస్వామ్య నియంతృత్వం వైపు వేగంగా ప్రయాణిస్తున్నదని అభిప్రాయపడింది. 


అన్ని అంతర్జాతీయ రేటింగుల మాదిరిగానే దీన్ని కూడా పరిగణించాలి కానీ, మన సమాచార సాధనాలు పెద్దగా ఖాతరు చేయలేదు. అందరికీ తెలిసిన విషయమే కదా, కొత్తగా చెప్పిందేముంది?– అని అయినా అనుకుని ఉండాలి, లేదా, మెచ్చి కిరీటం తొడిగే గుర్తింపులకు సంబరపడి చాటింపులు వేసుకోవాలి కానీ, ఈ ప్రతికూల ప్రతిష్ఠను విస్మరిస్తేనే మేలు అని అయినా భావించి ఉండాలి. వి–డెమ్‌ ఈ ప్రజాస్వామ్య మదింపు కార్యక్రమం ప్రారంభించి మూడేళ్లే అయింది కానీ, అది అనుసరించే ప్రమాణాలు, పరిశీలించే సమాచారం దానికి తొందరగానే ప్రతిష్ఠాత్మక గుర్తింపును ఇచ్చాయి. భారతదేశంలో పెరుగుతున్న అసహన, అప్రజాస్వామిక ధోరణుల గురించి ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ సంస్థలు కానీ, విదేశీ నేతలు కానీ వ్యాఖ్యానించడం పెరిగింది. భారతదేశం తన ఉదారసరళిని కోల్పోతుండడంతో, పశ్చిమదేశాలకు దానిపై ఆసక్తి కొరవడుతుందని ఏషియా వ్యవహారాల నిపుణుడు, డెమొక్రటిక్‌ పార్టీకి సన్నిహితంగా ఉండే మేధావి , భారతీయ సంతతి వ్యక్తి అయిన ఆశ్లే జె. టెల్లిస్‌ ఈ మధ్య ఒక వ్యాసంలో హెచ్చరించారు. 


ప్రజాస్వామ్య ప్రమాణాల విషయంలో వెనుకపట్టు పట్టిన దేశాల జాబితా వి–డెమ్‌ తయారుచేసింది. అందులో శీఘ్రంగా పతనమవుతున్న పది దేశాలలో భారత్‌ కూడా ఉన్నది. 2009, 2019 పరిస్థితులను పోల్చి లెక్కలు వేసిన పట్టికలో, భారతదేశం –0.19 పాయింట్ల మేరకు ప్రజాస్వామ్య పతనాన్ని చవిచూసింది. అన్ని దేశాల కంటె అధిక అప్రజాస్వామికంగా మారిన దేశంగా హంగరీని చూపింది. అది పదేళ్ల కిందట ఉదార ప్రజాస్వామ్యదేశంగా ఉన్నది, ఇప్పుడు ఎన్నికల ఏకస్వామ్య దేశంగా పరిణమించింది. భారత్‌ను అప్పుడు, ఇప్పుడు కూడా ఎన్నికల ప్రజాస్వామ్య దేశంగా పేర్కొన్నప్పటికీ, క్షీణతను ప్రముఖంగా ప్రస్తావించింది. పత్రికాస్వేచ్ఛపై దాడి, పాత్రికేయులపై పరువునష్టం మొదలుకొని రాజద్రోహం దాకా కేసులు మోపడం, పౌరసమాజంపై అణచివేత మొదలైన అంశాలను వి–డెమ్‌ నివేదిక పేర్కొన్నది. 


మత ప్రాతిపదికన పౌరసత్వ ప్రదాన చట్టం చేయడం, దానికి నిరసన తెలిపిన ఉద్యమకారులపై కేసులు పెట్టడం, కశ్మీర్‌ ప్రతిపత్తిని ఏకపక్షంగా మార్చివేసిన పరిణామం, దేశవ్యాప్తంగా ఆదివాసీలు, దళితులు, ఇతర అణగారిన శ్రేణుల పక్షాన నిలచి, పోరాడుతున్న న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు, అధ్యాపకులు, మేధావులను నిరవధికంగా తీవ్రమైన చట్టాలలో నిర్బంధించడం వంటి పరిణామాలు ఇటీవలి కాలంలో ప్రపంచం దృష్టిలో దేశాన్ని అప్రతిష్ఠ్ఠ పాలుచేశాయి. విదేశీ విరాళాల నియంత్రణ పేరుతో దేశంలో స్వచ్ఛందసంస్థలపై తీవ్రమైన ఆంక్షలు విధించారు. ఆ క్రమంలోనే అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ను కట్టడి చేయాలని చూశారు. భారతదేశంలో ఐటీరంగంలో దిగ్గజం ఇన్‌ఫోసిస్‌ విరాళాలతో ప్రధానంగా నడిచే ఇన్‌ఫోసిస్‌ ఫౌండేషన్‌ను కూడా లక్ష్యం చేసుకున్నారు. కూతురుని, అల్లుడిని చూడడానికి సుధామూర్తి లండన్‌ వెళ్లినప్పుడు, తమ ఫౌండేషన్‌కు ప్రభుత్వం నోటీసు ఇచ్చిన సమాచారం తెలిసింది. సుధ, నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్‌ బ్రిటిష్‌ ప్రభుత్వంలో ఆర్థికమంత్రి, జనాకర్షణ కలిగిన నాయకుడు, కాబోయే ప్రధానిగా ప్రచారంలో ఉన్నవాడు. భారత్‌లో మారుతున్న పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉన్నాయా అని ఆయన ఆశ్చర్యపోయారట. 


ఈ నివేదిక వెల్లడించిన మరికొన్ని అంశాలు కొంత ఊరట కలిగించవచ్చు. భారతదేశమే కాదు, ప్రపంచమే ఏకస్వామ్యం వైపు, నియంతృత్వం వైపు ప్రయాణిస్తోంది. ప్రపంచ జనాభాలో 54 శాతం ప్రజలు అటువంటి ప్రభుత్వాల కిందనే జీవిస్తున్నారట. ఇప్పుడు మూడో విడత నియంతృత్వ వెల్లువ నడుస్తోందట. అమెరికా, టర్కీ, బ్రెజిల్‌, భారత్‌– ఈ నాలుగూ మితవాద నియంతృత్వ జైత్రయాత్రలో ముందు వరుసలో ఉన్నాయి. ఎక్కువ జనాభా కలిగి, అప్రజాస్వామికమయిన పాలనలోకి ప్రయాణిస్తున్న దేశం మాత్రం భారతదేశమే.

Advertisement
Advertisement