వైసీపీ కార్యకర్తల వీరంగం

ABN , First Publish Date - 2022-05-21T05:32:32+05:30 IST

చాగలమర్రి గ్రామంలోని కేజీఎన్‌ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం అర్ధరాత్రి ఓ వివాహ కార్యక్రమం జరుగుతుండగా వైసీపీ కార్యకర్తల వీరంగం సంచలనం రేపింది.

వైసీపీ కార్యకర్తల వీరంగం
బాధితులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

టీడీపీ కార్యకర్తలు, మహిళలపై దాడి 

10 మందికి తీవ్ర గాయాలు 

న్యాయం చేయాలంటూ మహిళల ఆందోళన 


చాగలమర్రి, మే 20: చాగలమర్రి గ్రామంలోని కేజీఎన్‌ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం అర్ధరాత్రి ఓ వివాహ కార్యక్రమం జరుగుతుండగా వైసీపీ కార్యకర్తల వీరంగం సంచలనం రేపింది. చాగలమర్రి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఉసేన్‌సాహెబ్‌ అలియాస్‌ బారిక్‌చామల్‌ తనయుడు మహబూబ్‌బాషా వివాహ వేడుకల్లో ఈ ఘటన జరిగింది. పెళ్లి   వేడుకల్లో భాగంగా డీజే ఏర్పాటు చేసుకొని ఊరేగింపు చేస్తుండగా కొందరు యువకులు ఘర్షణకు పాల్పడ్డారు. అదే అదునుగా చూసుకొని వైసీపీ నాయకులు ఫయాజ్‌, బాషా, మహమ్మద్‌, రఫి, కరిముల్లాతో పాటు మరో 20 మంది పాత కక్షలు మనసులో పెట్టుకొని పెళ్లి జరుగుతున్న కేజీఎన్‌ ఫంక్షన్‌ హాల్‌లోకి వెళ్లి టీడీపీ నాయకులు, మహిళలపై దాడి చేశారు. అర్ధరాత్రి   నిద్రిస్తున్న మహిళలపై కుర్చీలు, కాళ్లు, చెప్పులతో దాడి చేశారు. ఈ దాడిలో పెళ్లి కుమారుడి పెద్దమ్మ జమాల్‌బీ తీవ్రంగా గాయపడగా, బంధువులు గఫార్‌, మాబుపీర్‌, ఆశ, కమాల్‌సా, జిలాన్‌బాషాలతో పాటు మరి కొందరు గాయపడ్డారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు దిశ యాప్‌ ద్వారా ఉన్నతాధికారులతో మొరపెట్టుకున్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. 


మా కార్యకర్తల జోలికి వస్తే సహించం 


దిశ యాప్‌ ద్వారా న్యాయం జరగాలి

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

భూమా అఖిలప్రియ 


ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ అన్నారు. చాగలమర్రి కేజీఎన్‌ ఫంక్షన్‌ హాల్‌లో టీడీపీ నాయకుడు తనయుడి వివాహ వేడుకల్లో వైసీపీ నాయకులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండించారు. మహిళలను, టీడీపీ కార్యకర్తలను శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై  దాడులను నివారించేందుకు దిశ యాప్‌ను తీసుకొచ్చామని చెప్పుకునే ప్రభుత్వం దాని ద్వారా సరైన న్యాయం చేయడం లేదని ఆరోపించారు. చాగలమర్రిలో మాజీ సీఎం చంద్రబాబునాయుడు పర్యటన విజయవంతం కావడాన్ని చూసి వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ విజయం తఽథ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీసెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్సర్‌బాషా, టీఎన్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి గుత్తి నరసింహులు, బీసీసెల్‌ నంద్యాల లోక్‌సభ స్పోక్‌ పర్సన్‌ సల్లా నాగరాజు, ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ కార్యదర్శి జెట్టి సుధాకర్‌, చాగలమర్రి టీడీపీ ప్రధాన కార్యదర్శి కొలిమిసోను, టీడీపీ నాయకులు కొలిమి ఉసేన్‌వలి, కొలిమి షరిఫ్‌, హనిఫ్‌, జెట్టి నాగరాజు, గఫార్‌, మాబులాల్‌, బషీర్‌, కింగ్‌హుసేన్‌, భాస్కర్‌రెడ్డి, జోసఫ్‌, రాజేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T05:32:32+05:30 IST