నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులడిగితే చెప్పు తీసుకుని కొట్టండి

ABN , First Publish Date - 2020-05-20T23:38:48+05:30 IST

బిజినెస్‌మ్యాన్‌ డైట్‌ ఎక్స్‌పర్ట్‌గా ఎలా మారారు? డాక్టర్లు ఆయనతో ఎందుకు విభేదిస్తున్నారు? మధుమేహాన్ని మందులు లేకుండా తగ్గిస్తానంటూ ‘వీరమాచనేని డైట్‌’తో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వీరమాచనేని రామకృష్ణారావుతో

నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులడిగితే చెప్పు తీసుకుని కొట్టండి

సుబ్బరంగా తినమని చెబుతున్నా!

ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా డైట్ ప్రచారం చేస్తున్నా

నూనె తాగితే ఏమౌతుంది.. ఇవి తినొద్దని చెప్పడానికి మీరెవరు..

స్కెచ్‌లు వేసి నన్ను రెచ్చగొట్టారు.. టీవీల్లో చర్చలకు రావడం మానేశా

ఇప్పుడు వైద్య వ్యవస్థను శాసించేది మందుల కంపెనీలే..

నా డైట్‌తో షుగుర్ పోగొట్టా.. మరి మీరెందుకు తగ్గించలేకపోయారు

ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో వీరమాచినేని రామకృష్ణ


బిజినెస్‌మ్యాన్‌ డైట్‌ ఎక్స్‌పర్ట్‌గా ఎలా మారారు? డాక్టర్లు ఆయనతో ఎందుకు విభేదిస్తున్నారు? మధుమేహాన్ని మందులు లేకుండా తగ్గిస్తానంటూ ‘వీరమాచనేని డైట్‌’తో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వీరమాచనేని రామకృష్ణారావుతో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’...

 

ఆర్కే: అసలు మీరు ఈ ‘డైట్‌’ వైపు ఎందుకు వచ్చారు? అంతకు ముందు ఏం చేసేవారు?

వీరమాచనేని రామకృష్ణారావు: కృష్ణా జిల్లా ఘంటసాల మండలం తూర్పు లంకపల్లి మా గ్రామం. అక్కడ చిన్నప్పుడు వ్యవసాయం చేసేవాడిని. సీఏ, ఐసీడబ్ల్యూఏ ఇంటర్‌ అయిపోయింది. ఆ తరువాత విజయవాడలో ప్రింటింగ్‌ బిజినెస్‌లో సెటిలయ్యాను. నిజానికి నాకూ... మెడికల్‌ ఫీల్డ్‌కూ అసలు సంబంధం లేదు. నా మిత్రులు చాలా మంది డాక్లర్లు ఉన్నారు. వైద్యుల్లో శత్రువులెవరూ లేరు. ఎందుకంటే నేను కమర్షియల్‌ కాదు. ప్రపంచానికి ఇంతకంటే చేయడానికి ఏమీ ఉండదని నేను బలంగా నమ్ముతున్నా.


ఆర్కే: మీరు చేసేది నిజంగా అంత గొప్ప సేవైతే భవిష్యత్తులో నోబెల్‌ ప్రైజ్‌ రావాలి!

వీరమాచనేని రామకృష్ణారావు: ప్రైజ్‌ల గురించి కాదండీ... మన పని మనం చేయాలి కదా! నేను మళ్లీ చెబుతున్నా... నా డైట్‌ ప్లాన్‌లో లక్షల పర్సెంట్‌ జెన్యూనిటీ ఉంది. ప్రపంచానికి ఇదొక్కటే మార్గం. డయాబెటిస్‌ ఒక వ్యాధి అని, అది తగ్గదనీ అబద్ధాల ప్రచారం జరుగుతోంది.


ఆర్కే: మీరు డయాబెటిస్‌ గురించే ఎందుకు కేర్‌ తీసుకుంటున్నారు? మీకేమన్నా ఉండేదా?

వీరమాచనేని రామకృష్ణారావు: హ్హహ్హ... నాకు లేదండి! మా ఇంట్లో కూడా ఎవరికీ లేదు. నేను నిజంగా ధన్యవాదాలు చెప్పాల్సింది నా స్నేహితుడు రావుకు. ఇంజినీర్‌. ఆయనకు డయాబెటిస్‌ ఉండేది. తను డయాబెటిస్‌ తగ్గడానికీ, నేను లావు తగ్గడానికీ గత ఏడాది మేలో ఓ ప్రోగ్రామ్‌ మొదలుపెట్టాం. ఇందులో నాకంటే ఆయన కంట్రిబ్యూషనే ఎక్కువ. వాస్తవానికి నేనూ నమ్మలా! ఆయన నమ్మారు. అయితే ఫలితాలు చూసిన తరువాత తన కంటే నేనే ఎక్కువగా నమ్మడం మొదలుపెట్టాను. ఈ క్రమంలో నాకు కాన్సెప్ట్‌ అర్థమయ్యి అందరి మీదా ప్రయోగించి సత్ఫలితాలు వచ్చిన తరువాత ప్రపంచాన్ని మార్చవచ్చనే నమ్మకం కలిగింది. నేను రెండు నెలల్లో 30 కిలోలు తగ్గాను. ఆయనకు డయాబెటిస్‌ పోయింది. మధుమేహానికి చికిత్స ఒక ట్యాబ్‌లెట్‌తో మొదలవుతుంది. దాన్ని అలా అలా పైకి ట్యాబ్‌లెట్‌ తీసుకెళ్లిపోతుంది. అమెరికా నుంచి అనకాపల్లి వరకు ఒకటే వ్యవస్థ. కానీ ఎవరూ మూలాలకు వెళ్లడం లేదు. అలా వెళితే చిటికెలో షుగర్‌ తగ్గిపోతుంది. మందులు వద్దని చెప్పినా ప్రజలు నన్ను విశ్వసిస్తున్నారంటే ఫలితాలు రాకుండానే సాధ్యమా?


ఆర్కే: మీరు కీటో డైట్‌ నుంచి తీసుకుని మోడిఫై చేశారా?

వీరమాచనేని రామకృష్ణారావు: లేదండీ! ఇవాళ అందరికీ ఇంటర్నెట్‌ ఉంది. ‘కీటో’ అని కొడితే వస్తుంది. అయినా సమాజంలో డయాబెటిస్‌ ఇంకా ఎందుకు ఉంది? నా డైట్‌ ప్రోగ్రామ్‌ వేరు. నాకు మంచి జరిగితే దాన్ని సమాజానికి అందించాలనే తపన.


ఆర్కే: 2017 మేలో డైట్‌ స్టార్ట్‌ చేసినప్పుడు ఏం తిన్నారు?

వీరమాచనేని రామకృష్ణారావు: నేను కొబ్బరి నూనెకు ప్రత్యామ్నాయంగా రోజుకు 70 నుంచి 90 గ్రాములు పెరుగు మీద మీగడ తినేవాడిని. ‘పొద్దున్నే, లేవగానే’ అనే మాటలు నా దగ్గర ఉండవు. మీకు ఆకలి వేసినప్పుడు తినండి. అది ఆరింటికి కావచ్చు... పదింటికి కావచ్చు. కోడి గుడ్లు ఎలాగైనా తినచ్చు. నేనెక్కువ వంటలు నెయ్యితో తినేవాడిని. ఆలివ్‌ ఆయిల్‌, నెయ్యి, వెన్నపూస, పెరుగు మీద మీగడ, కొబ్బరి నూనె... వీటిల్లో ఏవైనా రెగ్యులర్‌ ఆయిల్‌కు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. అన్నింటి కంటే బెస్ట్‌ కొబ్బరి నూనె. ముప్ఫై ఏళ్ల కిందట కొలెస్ట్రాల్‌ భూతం వచ్చినప్పటి నుంచీ రిఫైన్డ్‌ ఆయిల్‌ మొదలైంది. ఎంత మోసమండీ! ఇన్ని అసోసియేషన్లు, ఆర్గనైజేషన్లు ఉన్నాయి. ఎవరైనా దీని గురించి చెప్పారా? వేరుసెనగ పప్పు కిలో డెబ్భై-ఎనభై రూపాయలు పడిందనుకోండి... దాని నుంచి 300 గ్రాముల ఆయిల్‌ వస్తుంది. కిలో ఆయిల్‌ రావాలంటే రైతుకు 250-300 రూపాయలు పడుతుంది. మరి డబుల్‌ రిఫైన్డ్‌ ఆయిల్‌ రూ.80-రూ.90కి ఎలా వస్తుందండీ? అందులో మళ్లీ మ్యానుఫ్యాక్చరింగ్‌ కాస్ట్‌, డిస్ర్టిబ్యూషన్‌ వంటివన్నీ పోతే వాడికి ఇరవై రూపాయలు కూడా పడదు. ఆ రేటుకు ఏం ఆయిల్‌ వస్తుంది? ఈ లెక్కన మనమేం తింటున్నాం చెప్పండి?


ఆర్కే: సో ఆకలేసినప్పుడు ఏ ఆమ్లెట్టో తినేవారు. మళ్లీ ఆకలేస్తే?

వీరమాచనేని రామకృష్ణారావు: ఆకలి పుట్టదండీ. అదే మ్యాజిక్‌. మనం కార్బోహైడ్రేట్స్‌ తిన్నామనుకోండి... త్వరగా అరిగిపోయి త్వరగా శక్తి కోల్పోయి తొందరగా తింటాం. ప్రొటీన్‌ దాని కంటే తక్కువ. అదే ఫ్యాట్‌ అయితే... ఒక్కసారి తింటే చాలాసేపు ఉంటుంది. తొందరగా ఆకలి వేయదు. నా నిబంధన... ఆకలేసినప్పడే తినాలనేది! మీరన్నట్టు ఒకవేళ ఏ సాయంత్రానికో ఆకలేస్తే అన్ని రకాల వెజ్‌, నాన్‌వెజ్‌ కూరలూ తినచ్చు. మ్యాగ్జిమమ్‌ డైట్‌ పీరియడ్‌ మూడు నెలలు. ఈ లోపు అంతా సెట్‌ అయిపోతుంది. ఆ తరువాత మీరు బిర్యానీలు, స్వీట్స్‌ సహా తినవచ్చు. కానీ... ఓ పద్ధతి ప్రకారం! మందు, సిగరెట్ల వంటివి ముట్టకూడదు. సమస్య అంతా పద్ధతి తప్పడంతోటే వచ్చింది.

 

ఆర్కే: అంటే ఒక డయాబెటిక్‌ బాధితుడు మీరు చెప్పినట్టు మూడు నెలలు డైట్‌ పాటించిన తరువాత బయటపడవచ్చు! తర్వాత ఏదైనా తినేయవచ్చు!

వీరమాచనేని రామకృష్ణారావు: యస్‌... కానీ... మూడు నెలల తరువాత మరో మూడు నెలలు సెమీ డైట్‌ పాటించమని చెబుతున్నా. మామిడి పండ్లు తప్ప! అడ్డగోలుగా తిన్నప్పుడు షుగర్‌ లెవెల్‌ పెరుగుతుంది. రెండో రోజు ఆపేయండి... నార్మల్‌కు వస్తుంది. వ్యాధి మొదలై మందులు వేసుకొనే వాళ్లకు సకాలంలో ఆహారం పడకపోతే షుగర్‌ లెవెల్స్‌ పడిపోతాయి. కానీ నేను చెప్పే డైట్‌ ఫాలో అయ్యే రెగ్యులర్‌ టైప్‌ డయాబెటిక్స్‌కు అలాంటివి ఉండవు. ఇన్నాళ్ల ప్రస్థానంలో అన్ని వేల మంది ఆచరించి సత్ఫలితాలు సాధించారు. ఆ మాట రిపోర్టులే చెబుతున్నాయి.


ఆర్కే: కొంత కాలం మంతెన సత్యనారాయణరాజు సీజన్‌ నడిచింది. ఇప్పుడు ‘వీరమాచనేని డైట్‌’! ఇది ఎంత కాలం?

వీరమాచనేని రామకృష్ణారావు: తప్పకుండా ఉంటుంది. ప్రపంచానికి ఇదే మార్గదర్శకం అవుతుంది.


ఆర్కే: కేన్సర్‌ను తగ్గించగలిగే పరిస్థితి ఉందా?

వీరమాచనేని రామకృష్ణారావు: ఇది టూ ఎర్లీ అవుతుందండీ! కానీ... ఈ విధానంలో కేన్సర్‌ అదుపులో ఉంటుందని నా నమ్మకం. ఇది నా సబ్జెక్ట్‌కు కొంచెం పరిధి దాటుతుంది కనుక డిబేట్‌కు దిగను. కాకపోతే తొందర్లోనే ఒక సైంటిస్టుల టీమ్‌ విదేశాల నుంచి వస్తుంది. ఆ మంచి రోజులూ వస్తాయి. నాకు ఆ మధ్య అమెరికా నుంచి ఓ డాక్టర్‌ పంపించారు... ‘కొబ్బరి నూనెలోని లారిక్‌ యాసిడ్‌ కారణంగా రెండు రోజులు వాడితే కోలన్‌ కేన్సర్‌ 90 శాతం తగ్గుతుందని అడిలైడ్‌ యూనివర్సిటీ నిరూపించింది’ అని! మరి దీనికేమంటారు?

 

ఆర్కే: జిహ్వచాపల్యాన్ని తీర్చుకుంటూ... దేహాన్ని ప్రక్షాళన చేయగలిగే మార్గం మీ దగ్గర ఏదైనా ఉందా?

వీరమాచనేని రామకృష్ణారావు: నా డైట్‌ ప్లాన్‌ అదేనండీ! ప్రస్తుతం కిడ్నీల సమస్య విపరీతంగా ఉంది కదా! కిడ్నీలు పోవడానికి 60 శాతం డయాబెటిస్‌, బీపీ కారణం. తరువాత కొన్ని పెయిన్‌ కిల్లర్స్‌ వాడకం వల్ల పాడవుతున్నాయి. వీళ్లు రక్తంలో మాత్రమే అదుపు చేసుకుంటూ పోతున్నారు. ఒంట్లో ఉన్నది తీయడం లేదు. ప్యాంక్రియాస్‌ పనిచేయకపోతే వచ్చేది టైప్‌1. కానీ ఆహారపు అలవాట్లలో చిన్న పొరపాటు చేస్తే టైప్‌2 వస్తుంది. ఎలా వచ్చిందో అలా సరిచేస్తే పోతుంది. నేనొక్కటి చెప్పగలను... ‘ఒకప్పుడు కిడ్నీలు మార్చేవారు’ అని చెప్పుకొనే రోజులు వస్తాయి!


నిమ్స్‌ నెఫ్రాలజీ విభాగం డాక్టర్‌ భూషణ్‌రాజు: వేలాది మంది వైద్యులు, శాస్త్రవేత్తలు చెప్పలేని దాన్ని ఒక చిన్న చిట్కా వైద్యం ద్వారా బాగు చేసుకోవచ్చనడం అశాస్త్రీయంగా కనిపిస్తోంది. క్రమం తప్పిన జీవన శైలిలో మీరు చెప్పిన పద్ధతిలో తింటే కొంచెం బరువు తగ్గి ఉండవచ్చు. కానీ జబ్బులు పోయాయని చెప్పడం కష్టం. కనుక మీ డైట్‌ను శాస్త్రీయంగా చెబితే మంచిది.


వీరమాచనేని రామకృష్ణారావు: ‘వీడు చెప్పింది మేం చదవాలా’ అనే ఇగో ప్రాబ్లమ్‌ సార్‌ వీళ్లందరికీ! భూషణ్‌ గారే చెప్పారు... ‘అవి చదవాల్సిన ఖర్మ నాకు పట్టలేదు’ అని! ఒక పుస్తకం చదవకుండా రివ్యూ ఎలా రాస్తారండీ! నాది పకడ్బందీ సైన్స్‌. ఇన్సులిన్‌ మేనేజ్‌మెంట్‌ అనే సైన్స్‌. ఆయన్నొక మాట అడుగుతా... రామకృష్ణ అనే అనామకుడు రాక ముందే మీరు ఒక అద్భుతమైన డైట్‌ డిజైన్‌ చేసి ఎందుకు చెప్పలేకపోయారు? నేను కొంతమందికైనా పోగొట్టానని ఒప్పుకుంటున్నారుగా! మరి ఆ కొంత మందికైనా మీరెందుకు పోగొట్టలేకపోయారు? ఆహారం వల్ల కాకపోతే మందులకు వెళ్లమని వైద్య శాస్త్రం చెబుతుంది. హెచ్‌బీఏ1సీని 10.5 నుంచి మీ వైద్య శాస్త్రం ద్వారా తగ్గించమనండి చూస్తా! మందులిచ్చి పెంచడం తప్ప ప్రపంచంలో ఒక్కరికన్నా తగ్గించారా? నేను మందులివ్వకుండా ఆహారంతో తగ్గిస్తున్నా. ప్రజలు మిమ్మల్ని కాకుండా ఒక సామాన్యుడినైన నన్ను నమ్ముతున్నారంటే... మీ వ్యవస్థ మీద ఎంతలా విసిగిపోయారో అర్థం చేసుకోండి.

 

మా గురువు, గొప్ప నెఫ్రాలజిస్టు జేసన్‌ ఫంగ్‌... ఈ డైట్‌ను వేల మంది మీద ప్రూవ్‌ చేశారు. ఆయనదే కాన్సెప్ట్‌. అందుకు తగిన ఆధారాలున్నాయి. ఎందుకండీ... డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు గారు నా పుస్తకం ఆవిష్కరించినప్పుడు ‘ఇది ఒక అద్భుతం’ అన్నారు. అలా వందల మంది డాక్టర్లు ఈ డైట్‌ ఫాలో అవుతున్నారండీ. అంతెందుకండీ... మీ ఆధ్వర్యంలో ఓపెన్‌ డిబేట్‌ పెట్టండి. ఒన్స్‌ ఫర్‌ ఆల్‌... విమర్శలన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెడదాం.

 

ఆర్కే: మీరు ఇంత అనర్గళంగా మాట్లాడటం ఎక్కడ నేర్చుకున్నారు?

వీరమాచనేని రామకృష్ణారావు: నేను పుస్తకాల పురుగుని. అన్ని పేపర్లు, పుస్తకాలు విస్తృతంగా చదువుతాను. చిన్నప్పుడే మా అమ్మ నాకు అలవాటు చేసింది. దాంతో పాటు నేను అన్నింట్లో లాజిక్‌ చూస్తాను. మా అమ్మలానే నేనూ హేతువాదిని. మా నాన్న కరుడుగట్టిన ఆస్థికుడు. కానీ కుల మతాలపై ఆయనకు విశ్వాసం లేదు. ఆయన భావాలే నాకూ వచ్చాయి.

 

ఆర్కే: జీవితంలో మీరెప్పుడూ డాక్టర్‌ దగ్గరికి వెళ్లలేదా?

వీరమాచనేని రామకృష్ణారావు: ఒకసారి కింద పడితే ఆపరేషన్‌ చేయించుకున్నా. నా దృష్టిలో అందరూ మంచి డాక్టర్లే. నేను చెప్పేది డయాబెటిస్‌ గురించేనండీ! డాక్టర్లు దేవుడి లాంటివాళ్లు. అయితే చర్చల్లో నేనెప్పుడూ ఫెయిర్‌ గేమ్‌ ఆడతా! కానీ కొంత మంది ఉద్దేశపూర్వకంగా వాదిస్తారు. అలాంటప్పుడు నేను గట్టిగా సమాథానం చెప్పాల్సి వస్తుంది.


డాక్టర్‌ భక్తియార్‌ చౌదరి: మీ డైట్‌ ఫాలో అయిన చాలా మందికి ప్రాబ్లమ్స్‌ కూడా వచ్చాయి. నా దగ్గరికి ఎంతో మంది పేషెంట్స్‌ వచ్చారు. ఎవరికైనా సరే సలహాలు ఇవ్వడానికి అసలు మీరెవరు? డాక్టరా? సైంటిస్టా? మరేమన్నానా?

వీరమాచనేని రామకృష్ణారావు: ఈయన క్వాలిఫికేషన్‌ ఏంటండీ? స్పోర్ట్స్‌ మెడిసిన్‌. మందులేసేవాడి దగ్గరికి షుగర్‌ పేషెంట్టు ఎందుకు వెళతారు? అది పచ్చి అబద్ధం. అసలు వచ్చినా మీరెందుకు చూస్తున్నారు? మీకు ఆ అర్హత ఎక్కడుంది? ఆయన స్టూడియోలో ఒకటి మాట్లాడతారు. బయటకు వచ్చాక ‘రామకృష్ణ గారు మీరు సూపరండీ’ అంటారు. నేను చెప్పేది ఆహారం గురించి. అది తగ్గించకూడదని మీరు చెప్పేదేంటి? నేను ఇచ్చే డైట్‌లో ఏది తింటే తప్పో ఈ రోజుకూ మీరెవరూ చెప్పలేకపోయారు. సంవత్సరం నుంచి కూర్చుంది ఒక గ్యాంగ్‌... నా మీద ఇలా దాడి చేయడానికి! ఇగో సమస్యలతో ఇలాంటి వాళ్లు ఒకళ్లిద్దరు తప్ప రాష్ట్రమంతా నాకు సపోర్ట్‌. మిమ్మల్నేముంది... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మీ గైడ్‌లైన్స్‌ను నేను చాలెంజ్‌ చేస్తున్నా. మీ దిక్కుమాలిన దొంగల దోపిడీ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా. డయాబెటిస్‌తో కుళ్లబెడుతున్నారు. ఒక మనిషి మీ దగ్గరికి వస్తే ఏం చేయకూడదో అది చేసి పదేళ్లలో వాడి కన్ను, కాలు పోగొట్టే నీచమైన వ్యవస్థకి మద్దతు ఇస్తున్న వ్యవస్థపై పోరాడుతున్నా.


ఆర్కే: మరి మీ మీద కేసులు పెట్టారుగా!

వీరమాచనేని రామకృష్ణారావు: అవి ప్రూవ్‌ చేయమనండి! ఎందుకు సార్‌... మీ ఎదురుగా భక్తియార్‌చౌదరి గారు, భూషణ్‌ గారితో పాటు వంద మంది టైప్‌2 పేషెంట్స్‌ను కూర్చోబెడదాం. ఈ వంద మందిలో ఒక్కరికి డయాబెటిస్‌ తగ్గించమనండి... నేను ఆపేస్తాను. ఛాలెంజ్‌! ఇవాళ మార్కెట్‌లో ఉన్న డయాబెటిస్‌ మందుల్లో ఒక్కటి వాడినా మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే. మీరు ఏ ఊరుకు వచ్చినా రిపోర్ట్స్‌ చూపిస్తా. వరంగల్‌ మానుకోటలో మీటింగ్‌ పెట్టారు. ఆ రోజు విపరీతమైన వర్షం. కరెంటు పోయింది. అంతా చీకటి. ఎమ్మెల్యే గారు, నేను క్యాన్సిల్‌ చేసి వెళ్లిపోదామనుకుంటుంటే జనం ఒక్కరు కూడా కదల్లేదు. అది చూసి ఆశ్చర్యపోయాం. దాంతో ఓ చిన్న డొక్కు మైకు తీసుకుని గంటన్నర చెప్పాను. జనం పెరిగారు కానీ... తగ్గలేదు. ఆ మధ్య జర్మనీలో ఓ మీటింగ్‌ జరుగుతుంటే ఓ డాక్టర్‌ గారు మన సమావేశం షో వేశారు. ‘ఇదెందుకు ప్లే చేశారని’ అడిగితే... ‘ఫుడ్‌ ఐటెమ్స్‌ విధానం గురించిన మీటింగ్‌’ అని బదులిచ్చారు. ‘దానికి అంత మంది ఎందుకు వస్తారు... ఊరుకోండి’ అంటూ వాళ్లు నమ్మలేదు.


వైజాగ్‌ నుంచి ఒక డాక్టర్‌: కీటో డైట్‌ సిస్టంలో నూనె వాడటం అనేది మీరు తీసుకున్న ఒక నిర్ణయం. ఆయిల్‌ను ఎక్కువగా వాడటం వల్ల గ్యాస్ట్రయిటిస్‌లాంటివి రావడం.. ఒక్కోసారి బ్లడ్‌ వామిటింగ్స్‌ అవడం... ఈ ఇబ్బందుల గురించి ఏం చేస్తే బాగుంటుంది. రెండోది... మీరు సలహా ఇస్తున్న ప్రొటీన్‌ను ఇండియనైజ్‌ చేసుంటే బాగుండేది కదా. మీ డైట్‌ తీసుకున్నవారు చాలామంది మా దగ్గరికి వచ్చి అనారోగ్యంతో అడ్మిట్‌ అయిన పరిస్థితి కూడా ఉంది. దీనికి మీరేమంటారు..?


వీరమాచనేని రామకృష్ణారావు: కొబ్బరి నూనె, నెయ్యి కాకపోతే, మీగడ తీసుకోండి. అందరం మీగడ తిన్నవాళ్లమే కదా... ఒకప్పుడు ఇడ్లీలను నెయ్యిలో ముంచుకుని తినలేదా... ఆయన అడిగిన దానికి సమాధానం ఏమిటంటే... రోజూ మనం వేసుకునే రిఫైండ్‌, కెమికల్‌ ఆయిల్స్‌ మనిషి ఆరోగ్యాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. పిజ్జాలు, బర్గర్లతో పోలిస్తే 70 గ్రాముల కొబ్బరినూనె ఎంత చెప్పండి. పెరుగు, మీగడ తినకపోవడం వల్లే ఈ చావంతా.


ఆర్కే: కానీ ఆయన అనేది ఏంటంటే... గ్యాస్ట్రిక్‌ సమస్యలు వస్తున్నాయని...

వీరమాచనేని రామకృష్ణారావు: నేను చెబుతున్న డైట్‌తో గ్యాస్‌ సమస్య ఇలా (చిటికేస్తూ) పోతుంది. లక్షలో ఒకరికి తప్ప అందరికీ పోతుంది. కడుపులో అల్సర్లుండే ఒకరిద్దరికి తప్ప... గ్యాస్ట్రిక్‌ సమస్య పోయి తీరుతుంది. నా డైట్‌లో టీ కూడా తాగొద్దు.

 

ఆర్కే: మిమ్మల్ని తిట్టి చివరికి దోస్త్‌ అయిన డాక్టర్లెవరు?

వీరమాచనేని రామకృష్ణారావు: చాలామంది ఉన్నారండీ.. గోపాలం శివన్నారాయణగారు. ‘ఈడెవడో వచ్చాడు కొబ్బరినూనె తాగమంటున్నాడు. వీళ్లంతా వేలం వెర్రిగా వెళ్తున్నారు’ అన్నారు. ఆయన గొప్ప మానవతావాది, న్యూరోస్పెషలిస్టు. చాలచోట్ల క్యాంపులు నిర్వహిస్తుంటారాయన. మందులు కూడా ఫ్రీగా ఇస్తారు. క్యాంపులకు వెళ్తుంటే పేషెంట్లు రావట్లేదు. పదేళ్లనుంచి ఈయన ఇంజక్షన్లు ఇచ్చే పేషంట్లు కూడా మీ మందులొద్దు అంటున్నారట. రామకృష్ణ డైట్‌ పాటిస్తున్నాం అంటున్నారట. దాంతో ఆయన ‘ఎవడ్రా ఈ రామకృష్ణ...’ అని తోటి డాక్టర్లను అడిగితే... ‘మేమే పదేళ్ల నుంచి పాటిస్తున్నాం’ అన్నారట. దాంతో ఆయన ఆశ్చర్యపోయి ముందు పిలిపించండి అన్నారు. నాకు ఫోన్‌ చేస్తే వెళ్లి నాలుగ్గంటలు మాట్లాడా. వందరెట్లు దీని మీది గౌరవం పెరిగిందన్నారు. ఈ విధానమే దేశానికి అవసరం. ఇది బయో కెమిస్టు సబ్జెక్టు. ఆయన బయో కెమిస్ట్రీలో గోల్డ్‌ మెడలిస్టు. ఆయన మొదలెట్టి సంవత్సరం దాటింది. 14 కిలోలు తగ్గారు.


ఆర్కే: ఇప్పుడు మిమ్మల్ని డాక్టర్లు అనుసరిస్తున్నారంటారు...

వీరమాచనేని రామకృష్ణారావు: నన్ను కాదండీ... ఆల్రెడీ ఉన్న విధానాన్ని చెబుతున్నా.


ఆర్కే: తెలిసో తెలియకో మూణ్ణెళ్లకు బదులు ఆర్నెల్లు మీ డైట్‌ పాటిస్తే ఏంటి పరిస్థితి?

వీరమాచనేని రామకృష్ణారావు: చాలా మంచి ప్రశ్న అడిగారు. నా డైట్‌లో వస్తవో రావో మీకు తెలియదు. కానీ మీ మందులకు (డాక్టర్లనుద్దేశించి) వచ్చి తీరుతాయి. మీరిచ్చిన ట్యాబ్లెట్ల వల్ల కిడ్నీలకో దేనికో ప్రమాదం వచ్చి తీరుతుంది. ప్రకృతికి ఎలా వస్తుందండీ..

 

ఆర్కే: అంటే... వేరే సమస్యలొస్తాయని వాళ్లంటున్నారు?

వీరమాచనేని రామకృష్ణారావు: ఆహారంతో ఏం సమస్యలొస్తాయండీ. సుబ్బరంగా తినమని చెబుతున్నాను కదండీ. నా డైట్‌ను రెండేళ్లుగా కంటిన్యూ చేస్తున్నవారున్నారు. ఏమీ కాదండీ. ఇట్స్‌ ప్రూవ్డ్‌. అమెరికాలో చాలామంది ఫాలో అవుతున్నారు. అదిగదిగో బూచీ అంటున్నారు కానీ ఒక్కర్నైనా చూపించారా?

 

ఆర్కే: అమెరికాలో తెలుగువాళ్లంతా భోజనాలకు కలిస్తే వీరమాచనేని బంతి అని పెడుతున్నారట కదా...

వీరమాచనేని రామకృష్ణారావు: అవునండీ. మొన్న మండలి బుద్ధప్రసాద్‌గారు చెప్పారండీ. ‘వెయ్యి మందికి భోజనాలు పెడితే ఎనిమిది వందల మందికి నీ డైట్‌ పెట్టి రెండు వందల మందికి మామూలు భోజనం పెడుతున్నారు రామకృష్ణ’ అని అన్నారాయన. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఎఎస్‌లు, ఐపీఎస్‌లు, సెలబ్రిటీలు కూడా ఎంతోమంది నా డైట్‌ ఫాలో అవుతున్నారు. ఉదాహరణకు బాబూమోహన్‌గారున్నారు. ఆయన విజయనగరంలో నా మీటింగ్‌కు వచ్చారు. ఏడుగంటల నలభై నిమిషాలకు పైగా కూర్చున్నారు. ‘అన్నా! ఈ జనం ఏందీ... ఇన్ని గంటలు ఇలా కూర్చోవడమేంటీ... ఎవరైనా చెబితే నేను నమ్మేవాణ్ణికాదు కానీ నేనిక్కడ కూర్చున్నా కాబట్టి నమ్ముతున్నా’ అన్నారు. ఆయనకు షుగర్‌ పోయింది. 12 కిలోలు తగ్గారు. 20 ఏళ్లుగా వేసుకుంటున్న టాబ్లెట్లు మానేశారు. అలాగే శాంతా బయోటిక్‌ వరప్రసాద్‌గారు ఇన్సులిన్‌ పక్కన పడేశారు. కాకర్ల సుబ్బారావుగారిని కన్విన్స్‌ చేయగలరు మీరు. వీళ్లందరు చాలదా...

 

ఆర్కే: కొలెస్ట్రాల్‌ అనేది పెద్ద సమస్య. మీరేమో వెన్న, నెయ్యిలాంటివి తినేయమంటున్నారు. హార్ట్‌ పేషెంట్‌ ఉన్నాడనుకోండి. కొలెస్ట్రాల్‌ ఎక్కువైనప్పుడు వాల్వులు బ్లాక్‌ అవుతాయని కదా సైన్స్‌ చెబుతోంది.

వీరమాచనేని రామకృష్ణారావు: సైన్స్‌ చెప్పలేదండీ. మందుల కంపెనీలు తోకాడించమంటే అలా తోకాడించాయి గైడ్‌లైన్స్‌. ‘నెయ్యి వేసుకోకండి, గుడ్డు తినకండి, రిఫైన్డ్‌ ఆయిల్‌ మాత్రమే తీసుకుని చావండి’ అని 30 ఏళ్లు చెప్పి ప్రపంచాన్ని ఆరోగ్యపరంగా సర్వనాశనం చేసి ఇప్పుడు సుబ్బరంగా వేసుకోండి. ఏం కాదు.. ఇప్పుడు కనిపెట్టాం అంటున్నారు. కొలెస్ట్రాల్‌ అంటే వీళ్ల (అలోపతి) భాషలో చెప్పాలంటే ఎల్‌డిఎల్‌ ఎక్కువుండటం, హెచ్‌డిఎల్‌ తక్కువ ఉండటం లాంటివి. ఈ ప్రోగ్రామ్‌లో ఒకాయన కిలారు శ్రీనివాసరావు రిపోర్టులు ఉన్నాయి కాబట్టి వెరిఫై చేసుకోండి.


ఆర్కే: హార్ట్‌ పేషెంట్‌కు కొలెస్ట్రాల్‌ ఉంటే ప్రమాదం లేదా?

వీరమాచనేని రామకృష్ణారావు: కొలెస్ట్రాల్‌ అంటే వీళ్ల (అలోపతి) భాషలో చెప్పాలంటే ఎల్‌డిఎల్‌ ఎక్కువుండటం, హెచ్‌డిఎల్‌ తక్కువ ఉండటం లాంటివి. ఈ ప్రోగ్రామ్‌లో ఒకాయన కిలారు శ్రీనివాసరావు రిపోర్టులు ఉన్నాయి కాబట్టి వెరిఫై చేసుకోండి. ఆయనకు 1200 చిల్లర కొలెస్ట్రాల్‌ ఉండేది. రక్తం నల్లగా ఉండేది. ఆయనకు డైట్‌ చెప్పగానే భయమేసింది. డయాబెటిస్‌, బీపీ కూడా ఉన్నాయి. నేను మందులు డ్రైనేజీలో పారేయమని చెప్పాను. ఆయన పారేయడానికి జడిసాడు. ఆ తర్వాత అన్ని తగ్గిపోయాయి. రక్తం నల్లగా ఉండటం మాత్రం తగ్గలేదు. మీరేదో తేడా చేశారు కాబట్టి తగ్గలేదు అన్నాను. ‘మీరు చెప్పినా జడిసి కొలెస్ట్రాల్‌ టాబ్లెట్లు వేసుకున్నా’ అన్నారాయన. అప్పుడు ఒక లీడింగ్‌ కార్డియాలజిస్టుకు ఫోన్‌ చేశా. ‘మీరు రామకృష్ణగారు చెప్పినట్లు చేయండి. వారం తర్వాత తేడా వస్తే నేను చూసుకుంటా’ అన్నారాయన. దాంతో ఆయన ధైర్యంగా మొదలెట్టాడు. ఆరో రోజు నా దగ్గరకు పరుగెత్తుకొచ్చి ‘నాకు బాగా నెయ్యి పెడుతున్నారు. నేను చచ్చిపోతాననే భయపడుతున్నా’ అన్నారు కానీ కొలెస్ట్రాల్‌ 200కు వచ్చింది. అలాంటి రిపోర్టులు నేను లక్ష ఇస్తా. అందుకే నేను ఆన్‌ రికార్డు చెబుతున్నా మీ మందులు చేయలేని పని ఒక నెలలో చేసి చూపిస్తా.


ఆర్కే: శాకాహారులకు ఏం చెబుతారు?

వీరమాచనేని రామకృష్ణారావు: శాకాహారులు నాలుగు దుంపలు మినహా ఏవైనా తినొచ్చు. కూర అరటికాయ, బీట్‌రూట్‌ కూడా తాత్కాలికంగా (మూడునెలలు) తినకూడదు. నేను ఒకటే చెబుతున్నా. తిండికి తిండికి గ్యాప్‌ ఇవ్వండి. ప్రపంచంలో ఉన్న జంతువుల్లో రుచిగా తినేది ఒక్క మనిషే. నేనైతే తినటానికే పుట్టానని చెబుతాను. నాన్‌వెజ్‌ తినేవారు 99 శాతం ఉంటారు. దానికి ఒక లిమిట్‌ ఉండాలి అంతే. తెల్లన్నం చాలా హాని చేస్తుంది. తెల్లన్నం తినకుండా చాలామందిని మార్చాను. కొర్రలు, సామలు, జొన్నలు, అరికెలు తినండి. పిట్టలకు పెట్టేవి మనం తింటే చాలు.


ఆర్కే: రాజకీయాల్లోకి వస్తారా?

వీరమాచనేని రామకృష్ణారావు: లేదండీ. అస్సలు రాను. నా ముందు లక్ష్యం పెద్దది ఉంది. నేను ఏడుగంటల పాటు మాట్లాడుతూ అందర్నీ కూర్చోబెట్టగలుగుతున్నా. ఆ స్కిల్‌ను సమాజహితానికి వాడితే ఎంతో మేలు జరుగుతుంది.


ఆర్కే: డయాబెటిస్‌ తర్వాత దేనిమీదికి వెళ్తారు?

వీరమాచనేని రామకృష్ణారావు: డయాబెటిస్‌ పోతే సమాజంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో చూడండి. ఒబేసిటీ తగ్గి ప్రజల్లో మంచి ఆహారపు అలవాట్లు వస్తే చాలు నెక్ట్స్‌ జనరేషన్‌కు మేలు చేసినవాళ్లమవుతాం. అప్పట్లో కుర్రాళ్లు హీరోల్లా ఉండేవాళ్లు. ఎవరికీ బొజ్జలు ఉండేవి కాదు. కానీ ఈ జనరేషన్‌ను చూడండి. వందకిలోలుంటున్నారు. పెళ్లయ్యేసరికి బట్టతల. అమ్మాయిలకు పిలక జడలు. ఎందుకొచ్చాయండీ... మీ (డాక్టర్లు) కారణంగానే వచ్చాయి కదా. అందుకే నేను పాత వ్యవస్థకు తీసుకెళ్తున్నా. నేను డాక్టర్లకు మాత్రం వ్యతిరేకం కాదు.


ఆర్కే: మీకు ఆదాయం ఎట్లా?

వీరమాచనేని రామకృష్ణారావు: నేను అకస్మాత్తుగా పుట్టుకొచ్చినవాణ్ణి కాదు. 25 ఏళ్ల క్రితం నా విజిటింగ్‌ కార్డు డిజైన్‌ మీద ‘బీ పాజిటివ్‌’ అని ఉంటుంది. నాకు కులం, మతం లేదు. నా పెళ్లి వంద రూపాయల్లో చేసుకున్నా. అప్పట్లో మా బంధువుల్లో పెళ్లిళ్లు ఆడంబరంగా చేసి ఆరిపోయేవారు. కొంతమందైనా నన్ను చూసి మారతారనే పాత బట్టలేసుకుని, తాళి కట్టకుండా, దండలేసుకోకుండా పెళ్లి చేసుకున్నా. నేను 69సార్లు రక్తదానం చేశా. ఇక్కడ డాక్టర్లకు చాలామందికి తెలుసు. నా పేరు ‘బ్లడ్‌ రామకృష్ణ’. కళ్ళ ఆపరేషన్‌ క్యాంపులు చేయడంలో ప్రపంచ రికార్డు క్యాంపులు చేశా. నా క్యాంపులకు అమెరికా నుంచి డాక్టర్లు వచ్చేవారు.


ఆర్కే: మీరు చెబుతున్నది కరెక్టే కానీ వీటికి నిధులెట్లా...?

వీరమాచనేని రామకృష్ణారావు: నేను ఎవరినీ డబ్బు అడగలేదు. నా ఖర్చులు నేనే భరిస్తా. బొకేలు, దండలు కూడా యాక్సెప్ట్‌ చేయను. ఇంతమంది ఆర్గనైజ్‌ చేస్తున్నారు కదా. ఒక్కర్ని చెప్పమనండి. నా స్నేహితులతో నాకొక బృందం ఉంది. నాకోసం వాళ్లు అన్నీ వదిలేశారు. నా ఆస్తులు కూడా అమ్ముకుంటున్నా.


ఆర్కే: ఇంట్లోవాళ్లు ఏమనట్లేదా...?

వీరమాచనేని రామకృష్ణారావు: అందరూ సహకరిస్తున్నారు. మా నాన్నగారు పదేళ్ల క్రితం చనిపోతే ఆయన కళ్లను, దేహాన్ని హాస్పిటల్‌కు ఇచ్చేశా. మా అమ్మ దేహాన్ని కూడా అంతే.

 

ఆర్కే: వీరమాచనేని డైట్‌ పేటెంట్‌గా తెచ్చే ఆలోచనుందా?

వీరమాచనేని రామకృష్ణారావు: నేనేమీ చేయను. కమర్షియల్‌గా అస్సలు ఆలోచించను. నేను ఏ ప్రొడక్ట్‌నూ సజెస్ట్‌ కూడా చేయను. నా ఇమేజ్‌ను అడ్డం పెట్టుకుని ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే చెప్పుతో కొట్టి తర్వాత మాట్లాడండి. నాకు నేనే ప్రతినిధిని.

Updated Date - 2020-05-20T23:38:48+05:30 IST