వీర జవాన్‌.. నీకు జోహార్‌

ABN , First Publish Date - 2022-08-19T04:33:49+05:30 IST

దేవపట్ల గ్రామం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన వీర జవాను దేవరింటి రాజశేఖర్‌ నీకు జోహార్‌ అంటూ ఆయన మృతదేహానికి కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా, ఎస్పీ హర్షవర్థన్‌రాజులు గురువారం శ్రద్ధాంజలి ఘటించారు.

వీర జవాన్‌.. నీకు జోహార్‌
జవాన్‌ రాజశేఖర్‌ మృతదేహానికి అంతిమవీడ్కోలు

సైనిక లాంఛనాల మధ్య అంతిమ వీడ్కోలు

కలెక్టర్‌, ఎస్పీ శ్రద్ధాంజలి


సంబేపల్లె, ఆగస్టు 18: దేవపట్ల గ్రామం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన వీర జవాను దేవరింటి రాజశేఖర్‌ నీకు జోహార్‌ అంటూ ఆయన మృతదేహానికి కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా, ఎస్పీ హర్షవర్థన్‌రాజులు గురువారం శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జవాన్‌ కుటుంబానికి త్వరలో ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌లో ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీ్‌సగా 12 సంవత్సరాలు పనిచేసి మంగళవారం విధి నిర్వహణలో ఉంటూ బస్సు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. గురువారం ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి బెటాలియన్‌ డిప్యూటీ కమాండ్‌ ఆయుష్‌ దీపక్‌, అన్నమయ్య జిల్లా పోలీస్‌ డిప్యూటీ కమాండర్‌ వెంకటేశ్వరరెడ్డి, అధికారులు తరలించారు. రాయచోటి డీఎస్పీ శ్రీధర్‌, రూరల్‌ సీఐ లింగప్ప, స్థానిక ఎస్‌ఐ ఎస్‌ఎండీ షరీ్‌ఫలు జవాన్‌ మృతదేహాన్ని సంబేపల్లె మండల కేంద్రం నుంచి దేవపట్ల మీదుగా అంబేడ్కర్‌ నగర్‌ వరకు వాహనంలో ర్యాలీగా తీసుకెళ్లారు. బాణాసంచా కాలుస్తూ దారి పొడవునా విద్యార్థులు, ప్రజలు వీర జవాను నీకు జోహార్‌, రాజశేఖర్‌ అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టారు. బెటాలియన్‌ అధికారులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి వందనం సమర్పించారు. స్థానిక నాయకులు డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ ఆవుల విష్ణువర్థన్‌రెడ్డి, దేవపట్ల సర్పంచ్‌ వేణుగోపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ వెంకటరామిరెడ్డి, నాగిరెడ్డిగారిపల్లె సర్పంచ్‌ ఉదయ్‌కుమార్‌రెడ్డి, గున్నికుంట్ల ఎంపీటీసీ శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్‌ నాగభూషణ్‌రెడ్డి, సర్పంచ్‌ అంచల రామచంద్ర, జవాన్‌ మృతదేహంతో ర్యాలీగా వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జవాన్‌ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు. అశ్రునయనాల మధ్య జవాన్‌ రాజశేఖర్‌ కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అంతిమ వీడ్కోలు పలికారు. 





Updated Date - 2022-08-19T04:33:49+05:30 IST