వ్యాపారులపై వీర బాదుడు

ABN , First Publish Date - 2022-08-18T09:12:09+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో ‘ప్రజలకు బాదుడే బాదుడు. వ్యాపారులకు వీర బాదుడు’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

వ్యాపారులపై వీర బాదుడు

  • గుడ్‌బై చెప్పేస్తున్న రాష్ట్రంలోని కంపెనీలు
  • ఏ రంగాన్నీ మిగల్చకుండా మూడేళ్లలో ధ్వంసం
  • బూమ్‌బూమ్‌ వంటి మద్యం జగన్‌ బ్రాండ్లు
  • ఐటీ, ఆటోమొబైల్‌ కంపెనీలు బాబు బ్రాండ్లు
  • వ్యాపారుల ఆత్మీయభేటీలో లోకేశ్‌ వ్యాఖ్యలు 
  • ఆవేదనను వెళ్లగక్కిన పలువురు వ్యాపారులు

విజయవాడ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి జగన్‌  పాలనలో ‘ప్రజలకు బాదుడే బాదుడు. వ్యాపారులకు వీర బాదుడు’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వ్యాఖ్యానించారు. టీడీపీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో వ్యాపారుల ఆత్మీయ సమావేశం బుధవారం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా వ్యాపారులు తరలివచ్చారు. ఈ సమావేశంలో లోకేశ్‌ మాట్లాడుతూ.. వ్యాపారులు కరోనాను తట్టుకుని నిలబడ్డారని, కానీ జగరోనాకు దొరికిపోయారన్నారు. జగరోనా వైర్‌సకు త్వరలోనే సీబీఎన్‌ (చంద్రబాబు నాయుడు) వ్యాక్సిన్‌ వస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘టీడీపీ పాలనలో 39,450 పరిశ్రమలు, వాటి ద్వారా 5,13,352 ఉద్యోగాలు ఐటీశాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు వచ్చాయి. అడ్వాన్డ్స్‌ స్టేజీలో ఉన్న 137 కంపెనీల ద్వారా 2,78,586 ఉద్యోగాలు రాబోతున్నాయి అని వైసీపీ ప్రభుత్వమే శాసనమండలిలో అధికారికంగా చెప్పింది. జగన్‌రెడ్డి పాలనలో ప్రెసిడెంట్‌ మెడల్‌, బూమ్‌ బూమ్‌, గోల్డ్‌ మెడల్‌ (మద్యం బ్రాండ్లు) ఇవీ రాష్ట్రానికి వచ్చినవి. ఇవన్నీ జగన్‌ రెడ్డి బ్రాండ్లు.


 ఐటీ కంపెనీలు, ఆటో మొబైల్‌ కంపెనీలు చంద్రబాబు బ్రాండ్లు’’ అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. జగన్‌ టెన్త్‌ పాస్‌, డిగ్రీ ఫెయిల్‌ తెలివితేటలు తట్టుకోలేక కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయన్నారు. ‘‘వైసీపీ నేతల బెదిరింపులు, వేధింపులు, వాటాల దెబ్బకు వ్యాపారులు అందరూ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నారు.  జగన్‌ రెడ్డి మొహం చూసి రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదు. ఇప్పుడు ఆయన రిబ్బన్‌ కటింగ్‌ చేస్తున్నవన్నీ టీడీపీ హయాంలో వచ్చినవే. వైసీపీ పాలనలో అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. చిరువ్యాపారులు ఆక్వా, పౌలీ్ట్ర, బెల్లం వ్యాపారులు, నిర్మాణ రంగం... ఇలా చెప్పుకొంటూపోతే ఎవరూ మిగల్లేదు. అందరూ జగన్‌ రెడ్డి బాధితులే. ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ఆక్వారైతులకు యూనిట్‌ విద్యుత్‌ను రూ.1.50 పైసలకే ఇస్తానని హమీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. దానిని 0.50పైసలు తగ్గించి మళ్లీ రూ.2.36పైసలు పెంచి దారుణంగా మోసగించారు. ఆక్వా జోన్‌ పరిధిలోని రైతులకు మాత్రమే సబ్సిడీ అంటూ 80 శాతం మందికి సబ్సిడీలు ఎత్తివేశారు’’ అన్నారు. ఆక్వాజోన్‌.. నాన్‌ ఆక్వాజోన్‌తో సంబంధం లేకుండా విద్యుత్‌ యూనిట్‌కి రూ.1.50నే కొనసాగించాలని, క్వాలిటీ సీడ్‌ సరఫరా చేయాలని, విపరీతంగా పెంచిన ఫీడ్‌ ధరలు తగ్గించాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

 

ఆటోనగర్లు కొట్టేసే కుట్ర

పెంచిన అగ్రికల్చర్‌ మార్కెట్‌ సెస్‌ని తగ్గించాలని, ధరలు పడిపోతే ప్రభుత్వం నుంచి మద్దతు అందించాలని లోకేశ్‌ కోరారు.  ‘‘వేలాది మందికి ఉపాధి కల్పించే ఆటోనగర్లను కొట్టేయడానికి వైసీపీ నాయకులు స్కెచ్‌ వేశారు. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్‌ ఎస్టేట్స్‌, ఆటోనగర్లు ప్రస్తుతం జనావాసాల మధ్యలోకి వచ్చి కాలుష్య కారకాలుగా మారాయని, వాటిని ఊరికి దూరంగా తరలిస్తామనడంలో పెద్ద కుట్ర దాగి ఉంది. ఆ భూములను ఉడా పరిధిలోకి తెచ్చి ఆవాస ప్రాంతాలుగా, వాణిజ్య సముదాయాలుగా అభివృద్ధి చేస్తామని, అందులో సగం తమకివ్వాలని ప్రభుత్వం ఏకంగా జీవో నంబరు 5 జారీ చేసింది. కో-ఆర్డినేటెడ్‌ గ్రోత్‌ పాలసీ పేరుతో ఆటోమొబైల్‌, అనుబంధ పరిశ్రమలకు చెందిన భూముల్ని రియల్‌ ఎస్టేట్‌ పేరుతో దోచుకునేందుకు ప్లాన్‌ చేశారు. 


ఇటువంటి చెత్త నిర్ణయాలను వెనక్కి తీసుకునే వరకు పోరాడతాం’’ అని లోకేశ్‌ హెచ్చరించారు. బెల్లం వ్యాపారులపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలన్నారు. ‘‘విద్యుత్‌ చార్జీలు పెంచేసి పౌలీ్ట్ర పరిశ్రమపై భారం మోపారు. కోళ్ల దాణా ధరలనూ పెంచేశారు. ఇసుకను బంగారం చేసి నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారు. దీంతో లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని దెబ్బతీయడానికే ఇంపాక్ట్‌ ఫీజు విధించారు. జగన్‌ పాలనలో చిన్న, మధ్యతరహా  పరిశ్రమలు నరకయాతన పడుతున్నాయి. రాష్ట్రంలో అనేక ఎంఎ్‌సఎంఈలు మూతపడ్డాయి. రేషన్‌ డీలర్ల వ్యవస్థను నాశనం చేశారు. ‘చేదోడు’, తోడు’ పేరుతో జగన్‌ చిరువ్యాపారులను దగా చేస్తున్నారు. రూ.10వేలు చేతిలో పెట్టి ఏడాదికి లక్ష రూపాయలు దోచేస్తున్నారు.  జగన్‌ పాలనలో అంతా హాలిడేనే.. క్రాప్‌ హాలిడే, పవర్‌ హాలిడే, ఆక్వా హాలిడే, ఆఖరికి జగన్‌ రెడ్డి హాలిడే తీసుకునే రోజు దగ్గరపడింది’’ అని విమర్శించారు. 


ఒక్కరికీ రుణం ఇవ్వలేదు


పర్చూరు నియోజకవర్గం

‘‘టీడీపీ హయాంలో ఇచ్చిన రుణంతో లైటింగ్‌, సౌండ్‌ సిస్టమ్‌ వ్యాపారం ప్రారంభించాను. కరోనా కారణంగా వ్యాపారంలో నష్టం వచ్చింది. మళ్లీ రుణం కోసం ప్రయత్నించాను. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఒక్కరికి కూడా రుణం ఇవ్వడం లేదు. నా దగ్గర పనిచేసే 15 మంది కుర్రాళ్లు రోడ్డున పడ్డారు’’.

- రాజేశ్‌, వ్యాపారి, 


డబ్బులు ఇచ్చి చచ్చిపో అన్నారు

‘‘చెరుకు రసం వ్యాపారం చేసుకునే నన్ను వైసీపీ నేతలు వేధించారు. వ్యాపారం చేసుకోవాలంటే వైసీపీ నేతలకు డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటా అన్నా కూడా వదల్లేదు. డబ్బులు ఇచ్చి చచ్చిపో అన్నారు’’

- వీరారెడ్డి, చెరుకురసం బండి వ్యాపారం. విజయవాడ


రేషన్‌ వ్యవస్థ నాశనం 

‘‘రేషన్‌ డీలర్ల వ్యవస్థని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. గతంలో రేషన్‌ డీలర్లు నిర్దేశిత సమయానికి సరుకులు అందించేవారు. ఇప్పుడు డోర్‌ డెలివరీ వాహనం ఎప్పు డు వస్తుందో తెలియదు! ‘చంద్రన్నబీమా’తో సహా అనేక సంక్షేమ కార్యక్రమాలు టీడీపీ హయాంలో అమలయ్యాయి. ఇప్పుడవన్నీ రద్దయ్యాయి.’’

-శివరాం రెడ్డి, పెద్దకూరపాడు 


నా షాపు కూల్చేశారు..

‘‘ముప్పై ఏళ్ల నుండి టెక్స్‌టైల్‌ వ్యాపారంలో ఉన్నాను. వైసీపీ నాయకుడి ఇంటికి రోడ్డు వేసుకోవడానికి నా షాపు కూలగొట్టారు. అన్ని అనుమతులు ఉన్నా పాత భవనం అని మున్సిపల్‌ అధికారులు కూల్చేశారు. టీడీపీ నాయకులు నాకు అండగా నిలిచారు. న్యాయపోరాటం చేస్తున్న నన్ను పోలీసులు, మున్సిపల్‌ అధికారులు వేధిస్తున్నారు. ఒక్క తెనాలిలోనే ఇలాంటి సంఘటనలు 8 వరకు జరిగాయి’’

- నూనె రామకృష్ణ, వ్యాపారి, తెనాలి


మా బాబాయ్‌ని చంపేశారు..

‘‘మా బాబాయ్‌ బెల్లం వ్యాపారం చేస్తారు. బెల్లం వ్యాపారం చేస్తున్నందుకు మా బాబాయ్‌ని ఎస్‌ఈబీ అధికారులు అరెస్టు చేశారు. తెల్లవారుజామున మీ బాబాయ్‌ పారిపోయారని మాకు పోలీసులు కబురు చేశారు. మూడు రోజుల తర్వాత మా బాబాయ్‌ మృతదేహం రైల్వే ట్రాక్‌పై దొరికింది. పోలీసులు హడావిడిగా అంత్యక్రియలు పూర్తి చేయాలని మాపై ఒ్తతడి తెచ్చారు. ఎస్‌ఈబీ అధికారులే మా బాబాయ్‌ని వేధించి చంపేశారు’’

-బాలాజీ, బెల్లం వ్యాపారి, పోలవరం నియోజకవర్గం


రియల్‌ రంగం ఇబ్బందులు 

‘‘ప్రభుత్వం మారిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నిర్మాణ రంగం అనేక ఒడిదుడుకులను చవి చూస్తోంది.  ఇసుక దొరక్క, సిమెంటు, ఐరన్‌ రేట్లు పెరిగి ఇబ్బంది పడుతున్నాం. రిజిస్ట్రేషన్‌ ఫీజులు పెరిగాయి. జీఎస్టీ కూడా పెనుభారంగా మారింది. దేశాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న నిర్మాణ రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.’’

- మల్లికార్జునరావు, నరెడ్కో ప్రతినిధి 

Updated Date - 2022-08-18T09:12:09+05:30 IST