పోలీసు క్రౌర్యం!

ABN , First Publish Date - 2020-05-26T17:54:04+05:30 IST

పోలీసులు అనగానే కఠినంగా వ్యవహరిస్తారని ప్రజల్లో నాటుకుపోయిన భావనకు..

పోలీసు క్రౌర్యం!

యువకుడికి ఎస్‌ఐ బూటుకాలితో దెబ్బలు

అనారోగ్యంతో ఆసుపత్రికి తరలింపు

అన్యాయంగా కొట్టారు : తల్లి ఆవేదన


నెల్లూరు(ఆంధ్రజ్యోతి): పోలీసులు అనగానే కఠినంగా వ్యవహరిస్తారని ప్రజల్లో నాటుకుపోయిన భావనకు బలం చేకూర్చేలా నెల్లూరులో ఓ సంఘటన చోటుచేసుకుంది. నగరంలోని వేదాయపాళెం పోలీసు స్టేషన్‌లో ఓ ఎస్‌ఐ తన కొడుకును అన్యాయంగా స్టేషన్‌కు తీసుకువచ్చి బూటు కాళ్లతో తన్ని తీవ్రంగా గాయపరిచాడని, ఆ ఎస్‌ఐ కొట్టిన దెబ్బలతో తన కుమారుడి ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చేర్పించానని ఓ తల్లి రోదిస్తూ సోమవారం ఆ పోలీసు స్టేషన్‌ ఎదుట నిరసన తెలిపింది. తన బిడ్డను బూటు కాళ్లతో కర్కశంగా కొట్టిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఆ తల్లి ఇచ్చిన, సేకరించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.


నెల్లూరులోని గాంధీ నగర్‌ ప్రాంతానికి చెందిన పవన్‌ కుమార్‌ అనే యువకుడు టైల్స్‌ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 21వ తేదీ ఎవరో యువకుడు స్కూటీపై వెళుతూ ఓ యువతి చున్నీ లాగాడన్న అనుమానంతో వేదాయపాళెం పోలీసులు ఆదివారం రాత్రి పవన్‌ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో పవన్‌ ఇంట్లో లేకపోవడంతో అతని తల్లి చంద్రకళతో ఫోన్‌ చేయించి ఇంటికి పిలిపించారు. అనంతరం పోలీసులు ఆ యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. తనకు ఏమీ తెలియదని, ఎవరి చున్నీ లాగలేదని చెబుతున్నా వినకుండా ఓ ఎస్‌ఐ ఆ యువకుడిని చితకబాదాడు. కింద పడేసి బూటు కాళ్లతో కొట్టాడు.


అసలే మూర్చ వ్యాధిగ్రస్థుడైన పవన్‌ ఎస్‌ఐ కొట్టిన దెబ్బలకు అస్వస్థతకు గురయ్యాడు. అప్పటికే స్టేషన్‌కు చేరుకుని ఉన్న కుటుంబ సభ్యులకు యువకుడిని పోలీసులు అప్పగించారు. కుటుంబ సభ్యులు వెంటనే పవన్‌ను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తన కొడుకు తప్పు చేయలేదని, ఈ నెల 21వ తేదీ టైల్స్‌ పనిలో ఉన్నాడని ఎంత చెప్పినా పోలీసులు వినలేదని, అన్యాయంగా కొట్టారంటూ తల్లి కన్నీరు మున్నీరయ్యింది. దీనిపై స్టేషన్‌ సీఐని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా అసలు అటువంటిది ఏమీ జరగలేదని చెప్పారు. మరి ఈ విషయంలో ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Updated Date - 2020-05-26T17:54:04+05:30 IST