తిరుమలలో ముగిసిన ధన్వంతరి మహాయాగం

ABN , First Publish Date - 2020-03-29T11:18:39+05:30 IST

విశ్వమానవ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ తిరుమలలోని ధర్మగిరి వేదవిజ్ఞానపీఠంలో మార్చి 26వ తేదీ నుంచి నిర్వహిస్తున్న శ్రీనివాస శాంతోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం శనివారం పూర్ణహుతితో ముగిసింది.

తిరుమలలో ముగిసిన ధన్వంతరి మహాయాగం

తిరుమల, మార్చి 28 (ఆంధ్రజ్యోతి):విశ్వమానవ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ తిరుమలలోని ధర్మగిరి వేదవిజ్ఞానపీఠంలో మార్చి 26వ తేదీ నుంచి నిర్వహిస్తున్న శ్రీనివాస శాంతోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం శనివారం పూర్ణహుతితో ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు.పూర్ణహుతి అనంతరం ఈవో  మీడియాతో మాట్లాడుతూ విశాఖ శారదపీఠాధిపతి  స్వరూపానందేంద్ర స్వామి, మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి మఠాధిపతి సుబుదేంద్రతీర్థస్వామి ఆశీస్సులతో ఈ యాగాన్ని నిర్వహించినట్టు చెప్పారు. ధర్మారెడ్డి మాట్లాడుతూ క్షీరసాగర మథనంలో అమృత కళశంతో ఉద్భవించిన ధన్వంతరి స్వామి  ఆయుర్వేద విద్యకు ప్రసిద్ధితో పాటు మహావిష్ణువు అవతారమన్నారు. ఇందులో భాగంగానే మూడురోజుల పాటు దేశంలోని ప్రముఖ రుత్వికులతో ఈ యాగాన్ని నిర్వహించామన్నారు. ఈ యాగానికి ముందు మార్చి 16 నుంచి 25వ తేదీ వరకు 30 మంది పండితులు వేద పారాయణం చేశారన్నారు. వైఖానస ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు మాట్లాడుతూ ఈ యాగంలో ప్రధానంగా ఆరోగ్య ప్రదాతైన ధన్వంతరి స్వామిని ఆరాధించినట్టు వివరించారు. ప్రజలు ధన్వంతరి మహా మంత్రాన్ని జపించడం వల్ల సమస్త వ్యాధులు నయమవుతాయన్నారు. ఆగమ పండితుడు సీతారామాచార్యులు మాట్లాడుతూ ధన్వంతరి మహాయాగంలో భాగంగా 7 హోమ గుండాల్లో హోమాలు నిర్వహించడం ద్వారా 14 లోకాల్లోని దేవతల ఆశీస్సులు మానవులకు లభిస్తాయన్నారు.టీటీడీ జీయర్లు, సీవీఎస్వో గోపినాథ్‌జెట్టి తదితరులు పాల్గొన్నారు. కాగా ధన్వంతరి మహాయాగం ద్వారా జీవకోటి ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉంటారని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి అభిప్రాయపడ్డారు. యాగం పూర్తయిన సందర్భంగా యాగఫలం గురించి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. 

Updated Date - 2020-03-29T11:18:39+05:30 IST