ఆక్సిజన్‌ అందకే..!

ABN , First Publish Date - 2020-05-29T07:45:01+05:30 IST

ఆక్సిజన్‌ అందకే..!

ఆక్సిజన్‌ అందకే..!

  • పాలిమర్స్‌ బాధిత గ్రామాల్లో పశువుల మృతిపై
  • వెటర్నరీ బయోలాజికల్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ నివేదిక

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఎల్జీ పాలిమర్స్‌ చుట్టుపక్కల గ్రామాల్లో పశువులు ఆక్సిజన్‌ అందకపోవడం వల్లనే మృతిచెందాయని విజయవాడలోని వెటర్నరీ బయోలాజికల్‌ రిసెర్చి ఇనిస్టిట్యూట్‌ (వీబీఆర్‌ఐ) నిర్ధారించింది. ఈ నెల ఏడో తేదీ తెల్లవారుజామున ఎల్జీ పాలిమర్స్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ కావడంతో 25 పశువులు మృతిచెందాయి. ఆ పశువుల శాంపిల్స్‌ సేకరించి వీబీఆర్‌ఐకు పంపారు. వాటిని పరీక్షించిన ఈ సంస్థ వెంకటాపురం, వెంకటాద్రినగర్‌ ప్రాంతాల్లో 25 పశువులు ఆక్సిజన్‌ అందక (ఊపిరాడక) మృతి చెందినట్టు జిల్లా పశు సంవర్ధకశాఖకు నివేదిక పంపింది. కాగా వెంకటాపురంతోపాటు పరిసర గ్రామాల్లో గేదెలు, ఆవుల పాలల్లో స్టైరిన్‌ ప్రభావం లేదని, ఎటువంటి అవశేషాలు కనిపించలేదని చెన్నైలోని తమిళనాడు రాష్ట్ర పశువుల దాణా, మూత్రం, పాలు తనిఖీ కేంద్రం నిర్ధారించింది.


అయితే వారం, పది రోజుల వ్యవధిలో మూడు పర్యాయాలు పాలు, మూత్రం పరీక్షించాల్సి ఉందని తెలిపింది. మొదటి రిపోర్టు ఇప్పటికే జిల్లా పశు సంవర్ధక శాఖకు చేరింది. రెండో రిపోర్టు ఒకటి, రెండు రోజుల్లో, చివరి నివేదిక జూన్‌ తొలి వారంలో వచ్చే అవకాశం ఉంది. వాటి ఆధారంగా పాల వినియోగంపై ఒక నిర్ణయం తీసుకుంటామని పశు సంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రామకృష్ణ తెలిపారు.

Updated Date - 2020-05-29T07:45:01+05:30 IST