మళ్లీ వాయు‘గండాలు’

ABN , First Publish Date - 2020-11-30T05:38:14+05:30 IST

జిల్లాకు మళ్లీ తుఫాన్‌ల ముప్పు పొంచి ఉంది. రానున్న పది రోజుల వ్యవధిలో రెండు తుఫాన్లు వచ్చే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

మళ్లీ వాయు‘గండాలు’
వరదనీటిలో చిక్కుకున్న నెల్లూరు పరమేశ్వరీ నగర్‌ వాసులకు భోజనం ప్యాకెట్లు అందచేస్తున్న దాతలు

పొంచి ఉన్న మరో రెండు తుఫాన్లు

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

తుఫాన్‌గా మారే అవకాశం

వెంటనే మరో సైక్లోన్‌ వచ్చే అవకాశం

జిల్లాలో మళ్లీ మొదలైన వర్షాలు

నివర్‌ దెబ్బకు ఇప్పటికీ కోలుకోని జిల్లా


నెల్లూరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకు మళ్లీ తుఫాన్‌ల ముప్పు పొంచి ఉంది. రానున్న పది రోజుల వ్యవధిలో రెండు తుఫాన్లు వచ్చే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది సోమవారం వాయుగుండంగా మారి ఆ వెంటనే తుఫాన్‌గా రూపాంతం రం చెంది తమిళనాడు - పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశముందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీని ప్రభావంతో మంగళవారం నుంచి జిల్లాలో వర్షం కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ వెంటనే డిసెంబరు 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి తర్వాత అది తుఫాన్‌గా మారే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలు వణుకుతున్నారు. ఇప్పటికే నివర్‌ తుఫాన్‌ మిగిల్చిన నష్టం నుంచి జిల్లా కోలుకోలేదు. ఈ సమయంలో మళ్లీ తుఫాన్లు సంభవిస్తే తట్టుకోవడం చాలా కష్టం. కాగా జిల్లాలో ఆదివారం నుంచి మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనప డింది. ఈ కారణంగా వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో సోమవారం కూడా జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశముంది. మంగళవారం నుంచి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు న్నాయి. దీంతో జిల్లా ప్రజలకు మరికొన్ని రోజులు వర్షం ముప్పు తప్పేలా కనిపించడం లేదు. 


ఇప్పటికే అపార నష్టం

నివర్‌ తుఫాన్‌ దెబ్బకు ఇప్పటికే జిల్లాలో అపారనష్టం సంభవించింది. ముఖ్యంగా రైతులు, లోతట్టు ప్రాంత ప్రజలకు కన్నీళ్లే మిగిలాయి. రబీ సీజన్‌ కావడంతో రైతులు ఓ వైపు నారుమళ్లు సిద్ధం చేసుకుంటుండగా, మరోవైపు నాట్లు వేసుకుంటున్నారు. గడిచిన మూడు వారాలుగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో చాలా మంది రైతులు విత్తనాలు పోసి నష్టపోయారు. కొన్ని చోట్ల రైతులు రెండుసార్లు దెబ్బతిన్నారు. ఇక నారుమళ్లను ఎలాగోలా కాపాడుకొని వచ్చి నాట్లు వేస్తే నివర్‌ తుఫాన్‌ దెబ్బకు ఆ నాట్లన్నీ నీట మునిగాయి. చాలా వరకు నాట్లు పనికిరాకుండా పోయాయి. ఇప్పుడు మళ్లీ నారుమళ్లు సిద్ధం చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఇది రైతులను ఆర్థికంగా దెబ్బతీసింది. పంట వేయడం కూడా ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా మరింత ఆలస్యం జరిగితే ఆ ప్రభావం దిగుబడితో పాటు మార్కెట్‌ పైనా పడే ప్రమాదముంది. కాగా అతి భారీ వర్షాలతో నదు లు, వాగులు, వంకలకు వరద పోటెత్తింది. అనేక చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు  ఆగిపోగా, రోజు ల తరబడి విద్యుత్‌ సరఫరా లేక అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పెన్నానదికి ఎన్నడూ లేనంతగా వరద పోటెత్తింది. దీంతో నదీ తీర ప్రాంత గ్రామాలు, కాలనీలు నీట మునిగాయి. ఇక్కడ నివసిస్తున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ ఇళ్లల్లోని వస్తువులు దెబ్బతిన్నాయి. ఇంకా కూడా ఈ మునక ప్రాంతా లు కోలుకోలేదు. ఇటువంటి సమయంలో మళ్లీ తుఫాన్లు వస్తే జరిగే నష్టం ఊహించడం కూడా కష్టం. జిల్లాలోని చెరువుల న్నీ నిండుగా ఉన్నాయి. ఇప్పటికే పలు చెరువులకు గండ్లు పడ్డాయి. ఇక మళ్లీ భారీ వర్షం కురిస్తే చాలా వరకు చెరువులు తెగిపోయే ప్రమాద ముంది. అలానే కండలేరు డ్యాం కూడా ప్రమాదకరస్థాయిలో ఉంది. 


జిల్లాలో 17.4 మి.మీ వర్షం

ఆదివారం జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. సరాసరి 17.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అత్యధికంగా బోగోలు మండలంలో 98 మి.మీ, కావలిలో 60.8 మి.మీ, జలదంకిలో 49 మి.మీ, వర్షపాతం నమోదైంది. కాగా సోమశిలకు వరద ప్రవాహం తగ్గింది. ఆదివారం ఇన్‌ఫ్లో 71,400 వేల క్యూసెక్కులు వస్తుండగా 78,900 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సోమశిలలో 71.44 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 

Updated Date - 2020-11-30T05:38:14+05:30 IST