బత్తాయికేదీ భరోసా!?

ABN , First Publish Date - 2022-01-25T05:26:10+05:30 IST

పదేళ్ల క్రితం ఉదయగిరి నియోజకవర్గంలో 35 వేల ఎకరాల్లో బత్తాయి సాగు ఉండేది.

బత్తాయికేదీ  భరోసా!?
దాసరిపల్లిలో బత్తాయి చెట్లు ఎండిపోవడంతో బీడుగా వదిలేసిన పొలం

వర్షాభావ పరిస్థితులతో తోటలన్నీ కనుమరుగు

నాడు 35వేల ఎకరాల్లో సాగు.. నేడు 3 వేలకు 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం కరువు

ఇప్పుడేసిన అరకొర తోటలకూ అందని ‘ఉపాధి’ నగదు

సూక్ష్మ సేద్యానికి మంగళం.. సాగుపై రైతుల అనాసక్తి


బత్తాయి సాగులో ఉదయగిరి నియోజకవర్గానికి  ప్రత్యేక స్థానం ఉంది. వరికుంటపాడు మండలం రామాపురం, ఉదయగిరి మండలం దాసరిపల్లి గ్రామాలు బత్తాయి సాగులో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉండేవి. వేల ఎకరాల్లో తోటలు ఉండటంతో లక్షల టన్నుల దిగుబడి సాధించి దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఎగుమతి చేసి రైతులు అధిక లాభాలు గడించేవారు. ఇదంతా ఒకప్పటి మాట. నాటి తోటలు, లక్షల దిగుబడులు నేడు కనుమరుగయ్యాయి. 2014 నుంచి 2019 వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గ్రామాల్లో కరువు కోరలు చాచింది. దీంతో కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకొన్న చెట్లు ఎండిపోవడంతో రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. ఎండిన చెట్లు వంట చెరకుగా ఉపయోగపడ్డాయే తప్ప ప్రభుత్వం ఆదుకొన్న దాఖలాల్లేవు. రెండు పర్యాయాలు కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసినా రైతులకు ప్రయోజనం శూన్యం. 


ఉదయగిరి రూరల్‌, జనవరి 24 : పదేళ్ల క్రితం ఉదయగిరి నియోజకవర్గంలో 35 వేల ఎకరాల్లో బత్తాయి సాగు ఉండేది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏడాదికేడాది చెట్లు ఎండిపోవడంతో సాగు విస్తీర్ణం దిగజారిపోయింది. చెట్లను రక్షించుకొనేందుకు రూ.లక్షలు వెచ్చించి బోర్లు వేయించినా చుక్క నీరు పడకపోగా రైతులకు అప్పులే మిగిలాయి. రూ.లక్షలు వెచ్చించి సాగు చేసిన బత్తాయి తోటలు కళ్లెదుటే ఎండిపోవడంతో కొందరు రైతులు తోటల్లోనే ప్రాణాలు వదిలిన సంఘటనలు సైతం చోటుచేసుకొన్నాయి. బత్తాయి సాగు చేసిన భూములన్నీ బీడుగా మారి చిట్టడవిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం లేత, ముదురు తోటలు కలిపి నియోజకవర్గంలో 3 వేల ఎకరాల్లోపు బత్తాయి సాగులో ఉన్నాయి.


కేంద్రం బృందం వచ్చినా..

కరువు పరిస్థితిని అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం రెండు పర్యాయాలు నియోజకవర్గంలో పర్యటించి బత్తాయి పంటలను పరిశీలించింది. క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్లి ఎండిన తోటలను కళ్లారా చూడటంతోపాటు రైతుల గోడు వినింది. బృందం తమ కన్నీటి కష్టాలు వినడంతోపాట స్వయంగా ఎండిన తోటలను చూశారులే.. ఎంతోకొంతమేర సాయం అందుతుందిలే అనుకొన్న రైతులకు నిరాశే మిగింది. 


ప్రభుత్వాల ప్రోత్సాహం కరువు

పండ్ల తోటల రైతులకు ప్రభుత్వాల ప్రోత్సాహం కరువైంది. ఉపాధి హామీ పథకం కింద గుంత తవ్వే దగ్గర నుంచి మొక్క నాటి, మూడేళ్లు మొక్కలకు నీరు పట్టేంత వరకు నగదు చెల్లిస్తుంది. జిల్లాలో ఎండిన బత్తాయి చెట్ల స్థానంలో రైతులు మరలా బత్తాయి సాగు చేపట్టారు. అయితే వారికి  రెండేళ్లుగా నగదు అందలేదు. జిల్లాలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1205 రైతులకు మెటిరియల్‌ పేమెంట్‌ కింద రూ.38.23 లక్షలు  చెల్లించాల్సి ఉంది. అందులో బత్తాయి సాగు సుమారు 700 ఎకరాల్లో ఉంది. నగదు సకాలంలో అందకపోవడంతో చెట్లను రక్షించుకొనేందుకు రైతులు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. కొందరు రైతులు నగదు కోసం ఉపాధి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి సూక్ష్మ సేద్యానికి (డ్రిప్‌) మంగళం పాడింది. దీంతో పండ్లతోటల సాగుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. ప్రధానంగా బత్తాయి సాగుకు సూక్ష్మసేద్యం ఎంతో ఉపయోకరంగా ఉంటుంది.  రెండేళ్లు నుంచి పుష్కలంగా వర్షాలు కురుస్తుండటంతో  బత్తాయి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే డ్రిప్‌, ఉపాధి నగదు అందించకపోవడంతో పలువురు ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సాగుకు వెనుకంజ వేస్తున్నారు. 


జిల్లాలో ద్వితీయస్థానం

బత్తాయి సాగులో మా గ్రామం జిల్లాలో ద్వితీయస్థానంలో ఉండేది. 3 వేల ఎకరాల్లో సాగు.. లక్షల టన్నుల దిగుబడి.. అన్ని ప్రదేశాలకు ఎగుమతి చేసి ఆర్థికంగా లాభాలు గడించేవారం. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా తోటలన్నీ ఎండిపోవడంతో రైతులు కోట్లలో నష్టపోయారు. ప్రస్తుతం గ్రామంలో లేత, ముదురు తోటలు 300 ఎకరాల్లో ఉన్నాయి. 

- సయ్యద్‌ గౌస్‌మొహీద్దీన్‌, రైతు, దాసరిపల్లి


ప్రభుత్వాల ప్రోత్సాహం ఏదీ?

బత్తాయి రైతులకు ప్రభుత్వాల ప్రోత్సాహం కరువైంది. ఉపాధి హామీ కింద సాగు చేసిన బత్తాయి చెట్లకు రెండేళ్లుగా నిధులు అందడంలేదు. దీంతోపాటు సూక్ష్మసేద్యం పరికరాలు ఆపేయడంతోపాటు మిగిలిన రైతులు బత్తాయి సాగు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ప్రభుత్వాల ప్రోత్సాహం ఉంటే బత్తాయి సాగులో రాణించి రైతులు ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంది.  

- నారపరెడ్డి, రైతు, యర్రబల్లిగుంట


 



Updated Date - 2022-01-25T05:26:10+05:30 IST