Abn logo
Jun 11 2021 @ 00:24AM

‘వాత’ వైద్యం వదిలేశారేం!

ఈప్రాణాంతక కరోనా ప్రళయ కాలంలో ప్రస్తుతం వైద్య విధానాల్లో ఏది ఉత్తమం, ఏది సర్వోత్తమం, ఏది మనది, ఏది పరాయిది అన్న వాదోపవాదాలూ, సమర భేరులూ విజృంభించాయి గనుక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నేనూ నా వంతు జ్ఞానగర్జన చేస్తాను. నా చిన్నప్పుడు ఎవరికి ఏ అనారోగ్యం వచ్చినా మా ఊళ్ళో ఓ తాతగారు - ‘భూత వైద్యం దెబ్బకి దెయ్యమూ, వాత వైద్యం దెబ్బకి రోగమూ ‘అబ్బా’ అనాల్సిందే!’ అనేవారు. ఆయన వాత వైద్య విద్వాన్! కర్రు కాల్చి పిర్రల మీద వాత పెట్టారంటే మూలశంక ‘మొర్రో’మంటూ దౌడు తీసేదనేవారు. ఆయన వాతల మీద మా ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లోని వారికీ గురి ఉండేదట. వంశానుగతంగా వాత వైద్యంలో ప్రావీణ్యం గడించినట్టు చెప్పేవారు. మరెందుకో ఆయన సంతానం ఇంగ్లీష్ వైద్యంలో పెద్ద డిగ్రీలు సాధించి, పాశ్చాత్య దేశాలు పట్టిపోయారే తప్ప ఆ వంశానుగత దివ్య విద్యను అంది పుచ్చుకుని ఈ గడ్డ సేవలో తరించలేదు. ఆ తాతగారు ఆ విద్యను తన వారసులకు గానీ, ఇతరులకు గానీ బోధించకుండానే- విషజ్వరం సోకి, రాయవెల్లూరు ఆస్పత్రికి తీసుకు వెళుతుండగా దారిలోనే తుది ఊపిరి విడిచారు.


ఇంతకీ నా జ్ఞాన గర్జన ఏమిటంటే- మహత్తరమైన వాత వైద్యంలో కూడా కరోనాకి చికిత్స నిశ్చయంగా ఉండే ఉంటుంది. మా ఊరి తాతగారు ఆ వాత వైద్య విద్యను ఇంకొకరికి నేర్పకుండానే మృత్యువాత పడినా, అలాంటి పురాతన ప్రాణ రక్షక విద్యా పారంగతులు ఏ బ్రహ్మపురిలోనో, ఏ శివనగరిలోనో ఇప్పటికీ ఉండే ఉంటారు. అలాంటి వారిని గుర్తించేందుకు ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన అన్వేషణ చేపట్టాలి. ఈ కృషిలో సీబీసీఐడీ, సీబీఐ, రా, ఎన్ఐఏ వంటి సంస్థల సేవలనూ వాడుకోవచ్చు. వారిని గుర్తించాకా వారికి మేలురకం ఉక్కు కర్రులు పుష్కలంగా, ఉచితంగా సరఫరా చెయ్యాలి. వాటిని కాల్చేందుకు అవసరమైన కట్టెల ఖర్చును ప్రభుత్వమే భరించాలి. కొవిడ్ నిబంధనలు అంగుళం బెసక్కుండా అమలు చేస్తూ వాత వైద్యాన్ని అశేష కరోనా వ్యాధి పీడితులకు అన్ని జిల్లాల్లోనూ అందుబాటులోకి తేవాలి. అందుకోసం ప్రత్యేకాధికారులను నియమించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే వాత వైద్య యజ్ఞ నిర్వహణకు పూనకం లెవెల్లో పూనుకోవాలి.  


ప్రజలు వాత వైద్యాన్ని నమ్ముతారా, కోరుతారా అన్న కుశంకలకు ఆస్కారమే లేదు. వరదలో కొట్టుకుపోయేవారికి నురుగు బుడగలు కూడా ఓడల్లా కనిపిస్తాయి. అలాంటప్పుడు ఈ ప్రాణాపాయ వేళ మహత్తర వాత వైద్యాన్ని వారు నమ్మకపోవడం అన్న ప్రసక్తే లేదు. వారికి ఈ వైద్యం గురించి కర్రంత కాదు, సూది మొనంత కూడా తెలియదు కదా అంటారా? దాందేముంది- సా‘మాజిక్’ మాధ్యమాల ద్వారా తెల్లారేసరికల్లా వాత వైద్య అభిమాన సేనల్ని సందుసందునా తయారు చేసి, కవాతు చేయించొచ్చు. కరోనా వైరస్ కర్ణభేరి బద్దలయ్యేలా ‘వాత వైద్యానికీ జై!’ అంటూ నినాదాలు చేయించొచ్చు. నానా వైద్యాలూ వర్ధిల్లాలి! నా జాతి కీర్తి మరణ మృదంగంలా మార్మోగాలి!

వి–రాగి

ప్రత్యేకంమరిన్ని...