వైసీపీలో వాసుపల్లి చేరిక అనైతికం

ABN , First Publish Date - 2020-09-24T08:17:56+05:30 IST

విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ పార్టీ మారుతూ తీసుకున్న నిర్ణయం అనైతికమని టీడీపీ పొలిట్‌బ్యూరో

వైసీపీలో వాసుపల్లి చేరిక అనైతికం

సామర్లకోట, సెప్టెంబరు 23: విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ పార్టీ మారుతూ తీసుకున్న నిర్ణయం అనైతికమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. సామర్లకోట మండలం అచ్చంపేటలోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రెండు సార్లు గెలిపించిన క్యాడర్‌ కష్టాన్ని కాలరాశారన్నారు.  పార్టీ అర్బన్‌ అధ్యక్షుడిగా పార్టీ ప్రతిష్టను మంట కలిపి చరిత్రహీనుడిగా మిగిలారన్నారు. నేత పార్టీ మారాడే కానీ క్యాడర్‌ ఏ మాత్రం చెక్కు చెదరలేదన్నారు. పార్టీ నుంచి వాసుపల్లి నిష్క్రమణతో పార్టీకి వచ్చిన నష్టం ఏ మాత్రం లేదన్నారు. వైసీపీ ఇచ్చే ప్యాకేజీ కోసం కుమారుడి విద్యా సంస్థలు కాపాడుకోవడం కోసం, రాయితీల కోసం ఎమ్మెల్యే వాసుపల్లి పార్టీ మారాడని ఆరోపించారు.  విద్యా సంస్థలకు కరప్షన్‌ అకాడమీగా పేరు మార్చుకుంటే మంచిదని ఎమ్మెల్యే చినరాజప్ప ఎద్దేవా చేశారు.


హుద్‌హుద్‌ తుఫాన్‌ సమయంలో నగరవాసులకు అప్పట్లో చంద్రబాబు నాయుడు అండగా నిలిచారని పేద మధ్య తరగతి వారికి ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరించి పట్టాలు అందజేశారని అన్నారు. ఆ కృతజ్ఞతతోనే నగర వాసులు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి అండగా నిలిచారని ఎమ్మెల్యే చినరాజప్ప గుర్తు చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎవరినీ పార్టీలో చేర్చుకోనని ప్రకటించారన్నారు. ఎవరైనా పార్టీలోకి రావాలంటే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రావాలి అని చెప్పి ఇప్పుడు ప్రలోభాలతో వైసీపీ పార్టీలోకి తీసుకుంటున్నారని ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపించారు.

Updated Date - 2020-09-24T08:17:56+05:30 IST