Abn logo
Sep 20 2020 @ 10:32AM

డిఫెన్స్‌లో వాసుపల్లి

Kaakateeya

రక్షణ రంగంలో పనిచేశానంటూ గొప్పలు చెప్పుకుంటావు

అక్కడ నేర్పిన క్రమశిక్షణ ఇదేనా... అంటూ సౌత్‌ టీడీపీ కేడర్‌ దాడి

ఎమ్మెల్యేగా ఎన్నికైన పార్టీని కాదని మరో పార్టీకి మద్దతివ్వడమేనా నైతికత?.. అంటూ ప్రశ్నలు

ఎమ్మెల్యే పదవి చంద్రబాబు పెట్టిన భిక్ష అంటూ ధ్వజం

కేడర్‌ కష్టాన్ని కాలరాశారని మాజీ కార్పొరేటర్‌ వానపల్లి విమర్శ


(విశాఖపట్నం, వన్‌టౌన్‌-ఆంధ్రజ్యోతి):

‘‘తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం...నాయకులు వస్తుంటారు, పదవులు అనుభవించి పోతుంటారు. కానీ జెండా పట్టుకునే కార్యకర్తలు మాత్రం పార్టీలోనే ఉంటారు. వాసుపల్లి వెళ్లినంత మాత్రాన పార్టీకి నష్టమేమీలేదు. అవకాశవాదంతో ఫిరాయించిన వారిని ప్రజలు మర్చిపోవడం ఖాయం. ఇది ప్రతి ఒక్కరికీ తెలుసు.. వాసుపల్లికి కూడా ఒకరోజున తెలిసివస్తుంది.’’

- విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ సీనియర్‌ నేత


దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేశ్‌కుమార్‌ తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. గణేశ్‌కుమార్‌ శనివారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తనయులతోపాటు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి, వారసుల మెడలో వైసీపీ కండువా వేయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ...ఇన్నాళ్లూ పార్టీపై అభిమానంతో తామంతా వాసుపల్లికి అండగా నిలిచామని, అటువంటి తమకు మాటమాత్రమైనా చెప్పకుండా...రాత్రికి రాత్రి  నిర్ణయం తీసేసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.


అయినా వాసుపల్లి వెళ్లడం వల్ల పార్టీకి వచ్చిన నష్టమంటూ ఏమీలేదని, ఏదైనా వుంటే పార్టీ శ్రేణుల విశ్వాసాన్ని దెబ్బతీసిన ఆయనకేనని వ్యాఖ్యానించారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఇంకా రెండు పర్యాయాలు అర్బన్‌ జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన తల్లిలాంటి పార్టీని వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీస్తే విశాఖ నగరంలో నాలుగు సీట్లు మాత్రం తెలుగుదేశం కైవసం చేసుకుంది. ఆ నలుగురిలో వాసుపల్లి ఒకరు. అయితే అది ఆయన గొప్పతనం కాదనే విషయం వాసుపల్లి తెలుసుకోవాలని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.


హుద్‌హుద్‌ తుఫాన్‌ సమయంలో నగరవాసులకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అండగా నిలిచారని, ఇంకా వేలాది మంది పేద, మధ్య తరగతి వారికి ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరించి పట్టాలు అందజేశారని... అందుకు కృతజ్ఞతగానే నగరవాసులు గత ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేశారని వన్‌టౌన్‌కు చెందిన ఒక ద్వితీయ శ్రేణి నేత అన్నారు. రక్షణ రంగంలో పనిచేశానని గొప్పగా చెప్పుకునే వాసుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన పార్టీని కాదని మరో పార్టీలో చేరడం... నైతికంగా ఎంతవరకు సమంజసమని జగదాంబ ప్రాంతానికి చెందిన సీనియర్‌ కార్యకర్త ప్రశ్నించారు. రక్షణ రంగంలో నేర్చుకున్న క్రమశిక్షణ, నైతికత ఇదేనా...అని వ్యాఖ్యానించారు.


కాగా శుక్రవారం సాయంత్రం వరకు పార్టీ మారేది లేదని నాయకులకు చెబుతూ వచ్చిన వాసుపల్లి, వైసీపీ ఇచ్చే సొమ్ములకు కక్కుర్తిపడి పార్టీ ఫిరాయించారని అల్లిపురం ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు ఆరోపించారు. కాగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించిన కేడర్‌ కష్టాన్ని కాలరాశారని మాజీ కార్పొరేటర్‌ వానపల్లి రవికుమార్‌ ఆరోపించారు. అర్బన్‌ జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినా ఆ గౌరవాన్ని నిలుపుకోలేకపోయిన వ్యక్తిగా చరిత్రహీనుడవుతారని విమర్శించారు. ‘నేతలు మారడమే తప్ప కేడర్‌ చెక్కు చెదరదని, అందువల్ల వాసుపల్లి నిష్క్రమణ వల్ల పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదు’ అని సీహెచ్‌ వెంకటఅప్పారావు, దువ్వి కాళీప్రసాద్‌ అనే సీనియర్‌ కార్యకర్తలు వ్యాఖ్యానించారు. 


పార్టీకి నష్టమేమీ లేదు: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

ఎమ్మెల్యే వాసుపల్లి గణే్‌షకుమార్‌ వైసీపీలో చేరినంత మాత్రాన తెలుగుదేశానికి నష్టమేమీలేదు. తెలుగుదేశం పార్టీ విశ్వవిద్యాలయం వంటిది. ఎందరో చదువుకుని బయటకు వెళుతుంటారు. మళ్లీ కొత్త విద్యార్థులు చేరుతుంటారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం. పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి, అధికారం అనుభవించి వెళ్లిపోవడం నైతికత కోల్పోవడమే. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు అర్బన్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కల్పించిన పార్టీ నుంచి ఏ కారణం లేకుండా వెళ్లిపోవడం బాధాకరం. అయితే వాసుపల్లి వెళ్లినంత మాత్రాన టీడీపీకి నష్టం ఏమీ లేదు.


నియోజకవర్గ అభివృద్ధి కోసమే: ఎమ్మెల్యే వాసుపల్లి గణే్‌షకుమార్‌

దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి కోసమే నేను ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నా. నియోజకవర్గంలో అనేక పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా పనులు పూర్తిచేసేలా ముఖ్యమంత్రి దగ్గర నుంచి హామీ తీసుకున్నా. నన్ను గెలిపించిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నా.


నేడు దక్షిణ నియోజకవర్గ కేడర్‌తో సమావేశం

ఆదివారం ఉదయం పది గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో విశాఖ దక్షిణ నియోజవర్గం నాయకులు, కేడర్‌తో సమావేశం ఏర్పాటుచేసినట్టు అర్బన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టాభి తెలిపారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు హాజరవుతున్నారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement