Abn logo
Jun 10 2021 @ 10:09AM

రాజస్థాన్ బీజేపీ హోర్డింగ్‌లో కనిపించని వసుంధర రాజే ఫొటో

జైపూర్ : రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింథియా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫొటోలు లేవు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీశ్ పూనియా, శాసన సభలో ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా ఫొటోలు మాత్రమే ఈ హోర్డింగ్‌లో ఉన్నాయి. 


బీజేపీ రాష్ట్ర  ప్రధాన కార్యాలయంలో గతంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లో వసుంధర రాజే సింథియాతోపాటు శాసన సభాపక్ష ఉప నేత రాజేంద్ర రాథోడ్, సతీశ్ పూనియా, గులాబ్ చంద్ కటారియా, నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ఫొటోలు ఉండేవి. 


తాజాగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లో వసుంధర రాజే సింథియా ఫొటో లేకపోవడంతో బీజేపీలో అంతర్గత పోరు జరుగుతున్నదేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


రాజస్థాన్‌లో ఉప ఎన్నికల ప్రచారంలో గులాబ్ చంద్ కటారియా మాట్లాడుతూ మహారాణా ప్రతాప్‌పై చేసిన వ్యాఖ్యలు కర్ణి సేనకు ఆగ్రహం తెప్పించాయి. ఏప్రిల్ 13న కొందరు కర్ణి సేన కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోని కటారియా ఫొటోపై సిరా జల్లారు.