‘వసూల్‌ రాజా’ వింటున్నాడు!

ABN , First Publish Date - 2022-08-04T08:12:56+05:30 IST

‘వసూల్‌ రాజా’ వింటున్నాడు!

‘వసూల్‌ రాజా’ వింటున్నాడు!

ఇతర అధికారుల ఫోన్లపై నిఘా!

దీనికోసం ప్రత్యేకంగా బృందం

సీనియర్లను పిలిచి హెచ్చరికలు

ఫోన్‌ అంటే వణుకుతున్న అధికారులు

రాజకీయాల్లోనూ ఆయన జోక్యం

ఎమ్మెల్యేలకూ పొలిటికల్‌ క్లాసులు


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ధనాధన్‌ దందాలతో ‘వసూల్‌ రాజా’గా మారిన ఆ ఐఏఎస్‌ అధికారి ఇతర అధికారులపై నిఘా పెట్టారా? ఇందుకు ప్రత్యేకంగా ‘టీమ్‌’ను ఏర్పాటు చేసుకున్నారా? ముఖ్యనేత అండతో, ముఖ్య నేత పేరిట ఇతరుల ఫోన్లను ‘దొంగ చెవుల’తో వింటున్నారా? ఈ ప్రశ్నలకు అధికార వర్గాలు ‘ఔను’ అనే సమాధానం ఇస్తున్నాయి. విశ్వసనీయవర్గాల ప్రకారం... ఈ  వసూల్‌ రాజా అధికారవర్గాలతోపాటు వైసీపీ ప్రజా ప్రతినిధులపైనా పెత్తనం చలాయిస్తున్నారు. ఇటీవల ఇలాంటి  ఉదంతాలు వరుసగా బయటపడ్డాయి. ఒక సీనియర్‌ అధికారిని పిలిపించిన ఈ వసూల్‌ రాజా... ‘‘ఫలానా వారికి ఎందుకు టచ్‌లో ఉన్నారు? వారితో రెగ్యులర్‌గా ఏం మాట్లాడుతున్నారు? మీకు  ఇక్కడి సిస్టం గురించి తెలియదా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఆ అధికారి కంగారుపడిపోయారు. తాను ఎవరితోనూ ఫోన్‌లో మాట్లాడటం లేదని తేల్చిచెప్పారు. ఆ జూనియర్‌ అధికారి తన టేబుల్‌ సొరుగు నుంచి ఓ ఫైలు తీసి ఇదిగో ‘సాక్ష్యం’ అంటూ కాల్‌డేటాను బయటపెట్టారు. అంతే! ఆ సీనియర్‌ అధికారి షాక్‌కు గురయ్యారు. ‘నా కాల్‌డేటా ఎందుకు తెప్పించుకున్నారు? ఇదెక్కడి పద్ధతి?’ అని గగ్గోలు పెట్టారు. ఆ తర్వాత ఈ అంశం అఖిల భారత సర్వీసు అధికారుల్లో తీవ్ర అలజడి రేపింది. సోషల్‌ మీడియా గ్రూపుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ‘ఇలా కూడా చేస్తారా?’ అంటూ కొందరు ఆక్రోశించారు. ఈ కీలక అధికారి అంటేనే ఇతరులు భయపడటానికి,  సైడ్‌ అవ్వడానికి ప్రధాన కారణాల్లో ఇదొక అంశం. గడిచిన రెండేళ్లకాలంలో అతి ముఖ్యమైన అధికారులు సైతం ఫోన్‌కాల్స్‌ విషయమై ఆయన ముందు నిల్చున్నారని తెలిసింది. ఓ మహిళా అధికారిని కూడా పిలిచి ఇలాగే వార్నింగ్‌ ఇవ్వబోతే... సీన్‌ రివర్స్‌ అయినట్లు తెలిసింది. దీంతో ఆమెను కీలక పోస్టు నుంచి తప్పించి అప్రాధాన్యమైన శాఖకు మార్చినట్లు అధికారవర్గాల్లో  చర్చ జరుగుతోంది. 


అత్యాధునిక టెక్నాలజీతో... 

సాధారణంగా ప్రభుత్వాలు రాజకీయ ప్రత్యర్థులు, వర్గ శత్రువులు, ఉగ్రవాదులు, నేరస్తుల అనుపానులు కనిపెట్టేందుకు ట్యాపింగ్‌, స్కానింగ్‌ చేస్తుంటాయి. ఇందుకు అనేక అనుమతులు, విధానాలను పాటించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆధునిక యుగంలో ఏం మాట్లాడుకుంటున్నారో సులువుగా తెలుసుకునేందుకు ‘ఇమ్‌జీ క్యాచర్స్‌’ వచ్చాయి. చిన్నపాటి సూట్‌కేసులో ఇమిడిపోయే ఇమ్‌జీ క్యాచర్‌ను పక్కనపెట్టుకుంటే చాలు... ఎవరు ఎవరికి ఫోన్‌ చేస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారో గుట్టుగా వినేయవచ్చు. డేటా స్ర్కీనింగ్‌ చేయవచ్చు. అక్రమంగా, చట్టవ్యతిరేకంగా ఈ టెక్నాలజీని వాడేస్తున్నారు. స్వామికార్యంతోపాటు స్వకార్యం కోసం ‘వసూల్‌ రాజా’ ఈ టెక్నాలజీనే వినియోగిస్తున్నారని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకోసం సొంతంగా ఓ టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారని తెలిసింది. ఇప్పటి వరకు ఎనిమిది మంది సీనియర్‌, జూనియర్‌ అధికారులపై స్ర్కీనింగ్‌ ప్రయోగం చేశారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు మొత్తం అధికారులు ఎవరితో ఫోన్లో మాట్లాడాలన్నా వణికిపోయే పరిస్థితి వచ్చింది. 


ప్రజా ప్రతినిధులకూ కౌన్సెలింగ్‌

ముఖ్యనేత దగ్గర పని చేసే అధికారికి ప్రభుత్వ వ్యవహారాలు చూడటమే పరమావధిగా ఉండాలి. కానీ... ఈ వసూళ్ల రాజు అధికార పార్టీ వ్యవహారాల్లో కూడా వేలు పెడుతున్నారని తెలుస్తోంది. ఇటీవల ఆయన ఉత్తరాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులను తన కార్యాలయానికి పిలిపించి... పొలిటికల్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు తెలిసింది. ‘‘బాస్‌కు ప్రజల్లో పట్టుంది. మీకు ఏమాత్రం ప్రజల్లో గ్రిప్‌లేదు. మీ తీరు మారాలి. లేదంటే ఈ సారి గెలవరు. అంతదాకా ఎందుకు టికెట్‌ కూడా ఇవ్వరు’’ అని హెచ్చరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయా నేతలు చేస్తున్న వ్యాపారాల చిట్టా కూడా విప్పినట్లు తెలిసింది. ఇటీవల ఓ ప్రముఖ ప్రజాప్రతినిధిని కూడా పిలిచి ఇదే అంశంపై మాట్లాడగా... ‘‘ఏం చేయాల్నో? ఏం చేయకూడదో మాకు తెలుసులే! ఇవన్నీ చెప్పడానికి మీరెవరు?’’ అంటూ ఆ భేటీ నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.

Updated Date - 2022-08-04T08:12:56+05:30 IST