సింగపూర్‌లో వైభవంగా వాసవి జయంతి వేడుకలు నిర్వహించిన ప్రవాసులు

ABN , First Publish Date - 2021-05-22T21:38:39+05:30 IST

పుట్టిన గడ్డను వదిలి ఉన్నతోద్యోగాల కోసం విదేశాలకు వెళ్లినా.. తెలుగు వారు తమ సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోవడం లేదు. విదేశీ గడ్డపై పుట్టిన తమ బిడ్డలకు తెలుగు భాషను నేర్పిస్తున్నారు.

సింగపూర్‌లో వైభవంగా వాసవి జయంతి వేడుకలు నిర్వహించిన ప్రవాసులు

పుట్టిన గడ్డను వదిలి ఉన్నతోద్యోగాల కోసం విదేశాలకు వెళ్లినా.. తెలుగు వారు తమ సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోవడం లేదు. విదేశీ గడ్డపై పుట్టిన తమ బిడ్డలకు తెలుగు భాషను నేర్పిస్తున్నారు. పండుగలు పబ్బాల గురించి వివరిస్తున్నారు. తెలుగు సంప్రదాయాలను తర్వాతి తరానికి అందజేస్తున్నారు. తాజాగా సింగపూర్ దేశంలో నివసిస్తున్న తెలుగు వారు ‘వాసవి జయంతి’ ని ఆన్‌లైన్‌లోనే నిర్వహించుకున్నారు. సింగపూర్ లో నివసిస్తున్న ఆర్యవైశ్యులు వాసవి క్లబ్ సింగపూర్ సంస్థ ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనల కారణంగా వర్చువల్ పద్దతిలో జూమ్ కాల్ ద్వారా వాసవి జయంతిని నిర్వహించుకున్నారు. కామారెడ్డి జిల్లాలో సిద్ది వినాయక ఆలయ పురోహితులైన ఆంజనేయ శర్మ.. వారి ఇంటినందు ప్రత్యేక అలంకరణతో అమ్మవారి మంటపాన్ని అలంకరించి భక్తులందరిచేత గణపతి పూజ, ఆదిత్యహృదయము, చంద్రశేఖరాష్టకం, వాసవి కుంకుమార్చన, అమ్మవారి జన్మవృత్తాంతముతో కూడిన చక్కని వర్ణనతో ఆహుతులను భక్తి శ్రద్దలతో వ్రతమాచరింపజేశారు. అదే సమయంలో సింగపూర్ నందలి శ్రీ మారియమ్మన్ ఆలయం నందు అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి ఏక కాలంలో అన్ని కార్యక్రమాలు జూమ్ నందు భక్తులు వారి వారి ఇంటినుండి దేవాలయ దర్శనము, అమ్మవారి పూజ కార్యక్రమాలతో ఆనందంగా జరుపుకోవడం విశేషం. కార్యక్రమానికి హాజరైన మహిళలు, పిల్లలు అమ్మవారి మణిదీప వర్ణన, అమ్మవారి భక్తిగీతాలాపనలతో కార్యక్రమాన్ని కొనసాగించారు.


కార్యక్రమానికి అతిధులుగా హాజరైన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ పూర్వ అధ్యక్షులు, ప్రస్తుత పెనుగొండ వాసవి నిత్యాన్నదాన ట్రస్ట్ ప్రెసిడెంట్ అయిన నూలి వెంకట రమణ మూర్తి సభ్యులందరికి అమ్మవారు చెప్పిన ధర్మ సూత్రములను చక్కగా వివరించి అందరిలో గొప్ప స్ఫూర్తిని నింపారు. చివరిగా క్లబ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ గొట్లూరు మాట్లాడుతూ కార్యక్రమాన్ని కోవిడ్ పరిస్థితుల్లో కూడా చక్కగా జరిగేందుకు సహకరించిన కమిటీ సభ్యులకు ధన్యవాదములు తెలియజేశారు, కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ అయిన నరేంద్ర కుమార్ నారంశెట్టి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో పేద ఆర్యవైశ్యులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం చక్కగా సుజావుగా సాగడంలో కీలక పాత్రపోషించిన కమిటీ సభ్యులైన కిషోర్ ముక్కా, ముకేశ్ భూపతి, మురళి కృష్ణ పబ్బతి, రాజా విశ్వనాథుల తదితరులకు అభినందనలు తెలిపారు.

Updated Date - 2021-05-22T21:38:39+05:30 IST