‘వసతి’లో బిక్కు బిక్కు

ABN , First Publish Date - 2022-04-20T05:10:42+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు భయం భయంగా కాలం గడుపుతున్నారు. తరచూ విషసర్పాలు హాస్టళ్లలో చొరబడి విద్యార్థులను కాటేస్తున్నాయి.

‘వసతి’లో బిక్కు బిక్కు
ముళ్ల పొదలతో దుత్తలూరు మండలం నందిపాడులోని బీసీ వసతిగృహ ప్రాంగణం

తరచూ విషసర్పాల సంచారం

తూ.గో. జిల్లాలో ఒకరి మృతి

కొండాపురంలోనూ విద్యార్థికి పాముకాటు

సంగం బాలికల గురుకులంలో ఇద్దరికి తేలుకాటు

తాజాగా సోమశిలలో నాగుపాము హల్‌చల్‌

పత్తా లేని సహాయ సంక్షేమాధికారులు


నెల్లూరు(వీఆర్సీ) ఏప్రిల్‌ 19 : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు భయం భయంగా కాలం గడుపుతున్నారు. తరచూ విషసర్పాలు హాస్టళ్లలో చొరబడి విద్యార్థులను కాటేస్తున్నాయి.  తాజాగా  సోమశిల గిరిజన గురుకుల పాఠశాలలో సోమవారం అర్ధరాత్రి నాగుపాము  హల్‌చల్‌ చేసింది. సకాలంలో విద్యార్థులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో  విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. మార్చినెల రెండవవారంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఓ హాస్టల్‌లోని  నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్థులను విషసర్పం కాటేసింది. వీరిలో ఒకరు చనిపోగా, ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కాగా మార్చి 24వతేదీన సంగం అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో ఇద్దరు బాలికలు తేలుకాటుకు గురయ్యారు. వెంటనే వైద్య చికిత్స అందడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈనెల 14వ తేదీన కొండాపురం మండలంలోని బీసీ వసతిగృహంలో విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో ప్రైవేటు వైద్యశాలలో సకాలంలో వైద్యం అందించి విద్యార్ది ప్రాణాలు కాపాడగలిగారు.ఈ రెండు సంఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. 


అధికారుల జాడేది?


జిల్లాలో ఎస్సీ సంక్షేమ వసతిగృహాలు 65 ఉన్నాయి. బీసీ 89, గిరిజన సంక్షేమ వసతి గృహాలు 32 ఉన్నాయి.  రెండేళ్లుగా కొవిడ్‌తో చాలా హాస్టళ్లు ప్రారంభం కాలేదు. కొన్ని వసతిగృహాల్లో పదుల సంఖ్యలోనే విద్యార్థులు ఉంటున్నారు. వీరికి సంరక్షణగా ఉండాల్సిన అధికారులు చాలామంది చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారు. మరి కొంతమంది వాచమెనలకు, లేదా అక్కడ సీనియర్‌ విద్యార్థులకు బాధ్యత లు అప్పగించి సొంతపనుల్లో నిమగ్నమైపోతున్నారు. తనిఖీలకు వెళ్లాల్సిన సహాయ సంక్షేమ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటంలేదు. పలు హాస్టళ్ల పరిసర ప్రాంతాలు ముళ్లపొదలతో నిండి ఉంటున్నాయి. వాటి  నుంచి విషపురుగులు వచ్చి హాస్టళ్లలో సంచరిస్తున్నాయి. ఇకనైనా సహాయ సంక్షేమ అధికారులు సక్రమంగా హాస్టళ్లను తనిఖీలు నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అలాగే విద్యార్థులకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.


 నాగుపాము హల్‌చల్‌


అనంతసాగరం, ఏప్రిల్‌ 19: సోమశిలలోని గిరిజన గురకుల పాఠశాల ఆవరణంలో సోమవారం రాత్రి నాగుపాము హల్‌చల్‌ చేయడంతో విద్యార్ధులు భయాందోళనకు గురయ్యారు. పాఠశాల భవనం ముందు మెట్లవద్ద నాగుపామును గుర్తించిన విద్యార్ధులు కేకలు వేయడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఆ పాము బుసలు కొడుతుండగా విద్యార్థులే దాన్ని హతమార్చారు. . పాఠశాలకు ప్రహారీ లేక పోవడం, చుట్టుఉన్నా ముళ్లపొదలతో ఆప్రాంతం అడవిని తలపి స్తుండడంతో విషసర్పాలు పాఠశాలలోకి ప్రవేశిస్తున్నట్లు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2022-04-20T05:10:42+05:30 IST