‘నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా.. మూడు రాజధానులపై స్పందించలేను’

ABN , First Publish Date - 2020-02-25T10:59:33+05:30 IST

మూడు రాజధానులకు తాము సహకరిస్తున్నామంటూ..

‘నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా.. మూడు రాజధానులపై స్పందించలేను’

విజయవాడ(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో వ్యాపారాల కోసమే మూడు రాజధానులకు తాము సహకరిస్తున్నామంటూ మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. స్థానిక విలేకరులతో సోమవారం ఆయన మాట్లాడారు. ఐదు ఎన్నికల్లో పోటీ చేసిన దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. తాను, తన కుమారుడు వసంత కృష్ణప్రసాద్‌ రాజకీయాల్లో నీతి, నిజాయితీలతో పని చేస్తున్నామన్నారు. మూడు రాజధానుల ప్రస్తావన వచ్చినపుడు కృష్ణప్రసాద్‌ నేరుగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ఈ ప్రతిపాదన తనకు ఇష్టం లేదని, తమ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారని నిర్భయంగా చెప్పారన్నారు. వైసీపీ ఎమ్మెల్యే చేస్తున్న పాదయాత్రను ప్రారంభించడం తనకు గౌరవమన్నారు.


ప్రజలెవరూ వసంత కుటుంబాన్ని శుభకార్యాలకు పిలవొద్దని చెప్పడం ఉమా దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఎంపీ నందిగం సురేష్‌ ఘటనలో కేసులు తాము పెట్టించామని ఉమా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఉమా తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, మూడు రాజధానులపై తాను స్పందించలేనని వసంత నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తునికిపాటి సాయి, వెంకట్రావు పాల్గొన్నారు. 


Updated Date - 2020-02-25T10:59:33+05:30 IST