టీమిండియాలోకి మిస్టరీ స్పిన్నర్‌

ABN , First Publish Date - 2020-10-28T09:22:40+05:30 IST

వికెట్‌ కీపర్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టినా.. ఇతరులతో పోటీపడేంత ప్రతిభ లేక దండం పెట్టేశాడు. పుస్తకాలతో కుస్తీపట్టి.

టీమిండియాలోకి మిస్టరీ స్పిన్నర్‌

వికెట్‌ కీపర్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టినా.. ఇతరులతో పోటీపడేంత ప్రతిభ లేక దండం పెట్టేశాడు. పుస్తకాలతో కుస్తీపట్టి.. ఆర్కిటెక్ట్‌ అయ్యాడు. కానీ, నిరాశ, నిస్పృహ మాటున బందీ అయిన ఆ క్రికెటర్‌.. తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యాడు. ఎట్టకేలకు తన జీవిత లక్ష్యాన్ని గుర్తించాడు. ఆట కోసం అన్నీ వదిలేశాడు.  పడిలేచిన ప్రతిచోటా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. తన జీవితానికి తానే ఆర్చిటెక్చర్‌ అయ్యాడు. అనూహ్యంగా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడే మిస్టీరియస్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి.


వరుణ్‌ చక్రవర్తి.. నిన్నటిదాకా ఓ అనామక ఆటగాడు. అయితే, ఐపీఎల్‌ పుణ్యమా అని కొంత గుర్తింపు తెచ్చుకొన్న వరుణ్‌.. ఇప్పుడు ఏకంగా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికై ఔరా అనిపించాడు. కోల్‌కతా మిస్టీరియస్‌ స్పిన్నర్‌గా రాణిస్తున్న 29 ఏళ్ల చక్రవర్తి.. ఢిల్లీతో పోరులో ఏకంగా ఐదు వికెట్లతో మ్యాచ్‌ విన్నర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శన సెలెక్టర్లను ఆకర్షించిందేమో కానీ.. ఆసీస్‌ పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో వరుణ్‌ చాన్స్‌ కొట్టేశాడు. 


వికెట్‌ కీపర్‌.. సీమర్‌.. స్పిన్నర్‌

తమిళనాడుకు చెందిన వరుణ్‌.. 13వ ఏట నుంచి క్రికెట్‌ ఆడుతున్నాడు. 17వ ఏటా వరకు వికెట్‌ కీపర్‌గా ఏజ్‌ గ్రూప్‌ క్రికెట్‌లో ఎదగడానికి ప్రయత్నించినా.. ప్రతిభను నిరూపించుకోలేకపోయాడు. తీవ్ర నిరాశకు గురైన ఇతడు.. ఆటను వదిలి ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌ డిగ్రీ చదువులో మునిగిపోయాడు. ఆ తర్వాత ఫ్రీలాన్స్‌ ఆర్కిటెక్ట్‌గా పని చేస్తున్నా.. క్రికెట్‌ను వీడిన వెలితి అతడిని అనుక్షణం వెంటాడసాగింది. దీంతో ఆటలోనే భవిష్యత్తును వెతుక్కోవాలనే దృఢమైన నిర్ణయంతో క్రికెట్‌ వైపు అడుగులు వేశాడు. క్రోమ్‌బెస్ట్‌ క్రికెట్‌ క్లబ్‌లో సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా చేరాడు. కానీ, మోకాలి గాయం రూపంలో దురదృష్టం మరోసారి వెంటాడింది. విధి విసిరిన సవాల్‌ను ఆత్మసైర్థ్యంతో స్వీకరించిన వరుణ్‌.. స్పిన్నర్‌గా కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ ఊచకోత నుంచి తప్పించుకోవడానికి ఆర్కిటెక్ట్‌ బుర్రతో తన బౌలింగ్‌కు పదునుపెట్టాడు. తనను తాను మిస్టీరియస్‌ స్పిన్నర్‌గా ఆవిష్కరించుకున్నాడు. 


తమిళనాడు లీగ్‌తో వెలుగులోకి..

 కొంతకాలం క్లబ్‌ క్రికెట్‌లో రాణించినా.. 2018లో తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌తో సత్తా చాటేందుకు వరుణ్‌కు మంచి వేదిక దొరికింది. ఆ లీగ్‌లో మధురై పాంథర్స్‌ తరఫున అదరగొట్టిన వరుణ్‌.. ఆ జట్టుకు తొలి టైటిల్‌ అందించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నెట్స్‌లో కూడా బౌలింగ్‌ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే కోల్‌కతా జట్టు స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌, స్పిన్‌ కోచ్‌ కార్ల్‌ క్రో వద్ద మెళకువలు నేర్చుకున్నాడు. 


నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

‘ఐపీఎల్‌లో పంజాబ్‌తో మ్యాచ్‌ అయిపోగానే టీమిండియాకు నన్ను ఎంపిక చేసిన విషయం తెలిసింది. ఈ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. నా ప్రధాన లక్ష్యం జాతీయ జట్టులో స్థానాన్ని పదిలం చేసుకోవడం. అందుకు వందశాతం కష్టపడతా. సోషల్‌ మీడియాలో నేను అంత యాక్టివ్‌ కాదు. అందుకే, ఇక్కడే అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెడతా’ 

- వరుణ్‌ చక్రవర్తి


ఊహించని ధరతో..

తమిళనాడు తరఫున విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడి సత్తాచాటాడు. వెంటనే రంజీల్లో ఆడే అవకాశం కొట్టేశాడు. పవర్‌ప్లే, డెత్‌ ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలడనే టాక్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ తరఫున ట్రయల్స్‌లో కూడా పాల్గొన్నాడు. గతేడాది ఐపీఎల్‌ వేలంలో రూ. 20 లక్షల కనీస ధర కలిగిన వరుణ్‌ను.. పంజాబ్‌ ఊహించని విధంగా ఏకంగా రూ. 8.4 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, తనపై పెట్టిన ధరకు చక్రవర్తి న్యాయం చేయలేకపోయాడు. దీంతో పంజాబ్‌ వదిలించుకోగా.. ఈ ఏడాది కోల్‌కతా రూ. 4 కోట్లకు దక్కించుకుంది. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొన్న వరుణ్‌.. ప్రస్తుత ఐపీఎల్‌లో పడిలేచిన కెరటంలా ఎగిశాడు. ఈ క్రమంలోనే దేశానికి ఆడాలనే కలను నెరవేర్చుకున్నాడు. మొత్తంగా వరుణ్‌ చెప్పేది ఒక్కటే.. తాను క్రికెట్‌ను వీడినా.. క్రికెట్‌ తనను వీడలేదని!

Updated Date - 2020-10-28T09:22:40+05:30 IST