వర్షం పడితే ఆగాల్సిందే

ABN , First Publish Date - 2022-08-03T06:03:27+05:30 IST

వర్షం వస్తే పీవీ నర్సింహ్మరావు ఎక్స్‌ప్రెస్‌ వే మార్గంలోని ఉప్పర్‌పల్లి పిల్లర్‌ నెంబర్‌ 191 వద్ద రోడ్డు చెరువులా మారుతుంది.

వర్షం పడితే ఆగాల్సిందే
ఉప్పర్‌పల్లి పిల్లర్‌ నెంబర్‌ 191 వద్ద వర్షపు నీటిలో నిలబడి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్న రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు

ఉప్పర్‌పలి పిల్లర్‌ నెంబర్‌ 191 వద్ద నిలుస్తున్న వర్షపు నీరు

చెరువును తలపించేలా రహదారి 

2 గంటల పాటు నిరీక్షణ

పదేళ్లుగా ఇదే సమస్య 

స్థానికులు, వాహనదారుల అవస్థలు

పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

రాజేంద్రనగర్‌, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): వర్షం వస్తే పీవీ నర్సింహ్మరావు ఎక్స్‌ప్రెస్‌ వే మార్గంలోని ఉప్పర్‌పల్లి పిల్లర్‌ నెంబర్‌ 191 వద్ద రోడ్డు చెరువులా మారుతుంది. అంతర్జాతీయ  విమానాశ్రయానికి వెళ్లే ఈ రహదారిలో పది సంవత్సరాలుగా వాహనదారులు ఇబ్బందులు పడుతునే ఉన్నారు. అయినా ప్రజా ప్రతినిధులు, అధికారులకు పట్టడం లేదు. సమస్యకు పరిష్కారం కనుక్కోవడంలో చొరవ చూపడం లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లే మార్గంలో ఇలాగే ఉంటే ఊరుకుంటారా..? అని ప్రశ్నిస్తున్నారు. మెహిదీపట్నం నుంచి రాజేంద్రనగర్‌, శివరాంపల్లి పరిసర బస్తీలకు వెళ్లాలంటే ఈ మార్గంలోనే వెళ్లాలి. అనేక విద్యా, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు రాజేంద్రనగర్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. వర్షం పడితే  మాత్రం ఈ మార్గంలో వెళ్లే వారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సిందే. సమస్యకు త్వరగా పరిష్కారం చూపాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. 

మంగళవారం 10:35 వరకు నరకం

మంగళవారం ఉదయం 8 గంటలకు కురిసిన వర్షానికి 10:35 గంటల వరకు ఉప్పర్‌పల్లి పిల్లర్‌ నెంబర్‌ 191 చెరువులా మారింది. వాహనాలు ఎక్కడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వర్షంలోనే రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్యామ్‌సుందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిలబడి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ మాన్‌సూన్‌ స్పెషల్‌ టీమ్‌ నీరు వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తూనే ఉన్నప్పటికీ రెండు గంటల పాటు నీరు రోడ్డుపై నిలవడటంతో పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లడానికి ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. 

త్వరలో పనులు ప్రారంభం

మూసీ నది నుంచి ఫోర్ట్‌వ్యూ కాలనీ వరకు గ్రేటర్‌ ప్రాజెక్టు విభాగం ఆధ్వర్యంలో నాలా పనులు జరుగుతున్నాయి. ఉప్పర్‌పల్లి పిల్లర్‌ నెంబర్‌ 191వద్ద టర్నెల్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. ఆ పనులను  కూడా ప్రాజెక్టు విభాగం అధికారులు చేపట్టే అవకాశాలున్నాయి. ఒకటి రెండు రోజుల్లో టెండర్లు పిలుస్తాం. పనులు పూర్తయితే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. 

- నరేందర్‌గౌడ్‌, ఈఈ, రాజేంద్రనగర్‌ సర్కిల్‌ 


Updated Date - 2022-08-03T06:03:27+05:30 IST