కుండపోత

ABN , First Publish Date - 2022-10-02T05:53:43+05:30 IST

జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముసురుతో రెండు రోజుల నుంచి ఎడతెగని వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

కుండపోత
రేపల్లె: రహదారులపై వర్షపునీరు నిలవటంతో ప్రయాణీకుల ఇక్కట్లు

అద్దంకిలో  178.8 మి.మీ వర్షపాతం

ఉధృతంగా నల్లవాగు ప్రవాహం

బాపట్లలో భారీ వర్షం

కొల్లూరులో  ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీరు


బాపట్ల, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముసురుతో రెండు రోజుల నుంచి ఎడతెగని వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ప్రజల ఇబ్బందులకు గురవుతున్నారు. బాపట్లలో శనివారం ఉదయం గంటసేపు కురిసిన భారీ వర్షానికి పట్టణం జలమయమైంది. మధ్యాహ్నం మరోసారి చీకట్లు కమ్ముకుని వరుణుడు విరుచుకుపడడంతో జనజీవనం స్తంభించింది. విద్యుత్‌ సరఫరాకు కూడా అంతరాయం కలిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బాపట్ల, అద్దంకి పట్టణాల్లో భారీ వర్షంతో పలు కాలనీల్లో నీళ్లు నిలిచిపోయాయి. రేపల్లె మండలంలో కూడా ఓ మోస్తరు వర్షం కురిసింది. కొల్లూరు ప్రాంతంలో వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరింది. భట్టిప్రోలు మండలంలో శనివారం మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఎంపీడీవో కార్యాలయంలోకి నీరు చేరడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  

 పలు ప్రాంతాల్లోని పంటపొలాలు నీటమునిగాయి. నాట్లు వేసి వారం రోజులు కూడా కాకుండానే పంట నీట మునిగడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.  వర్షాల దెబ్బకు మిర్చి తెగుళ్ల బారిన పడే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. శనివారం ఉదయం వరకు రికార్డు స్థాయిలో అద్దంకి పరిధిలో 178.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. కారంచేడు మండలంలో 79.4, మార్టూరు, ఇంకొల్లులో 52.4, నిజాంపట్నం 42.8, చీరాల 44.4, బాపట్లలో 28.4, కర్లపాలెంలో 25.6, పిట్టలవానిపాలెం మండలంలో 35.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 1131 మి.మీ. వర్షపాతం నమోదైంది.   


పిడుగుపడి ఒకరు మృతి

సంతమాగులూరు: మండలంలోని కొప్పరం గ్రామంలో  పిడుగుపాటుకు గురై గుంజి వెంకటేశ్వర్లు(50) మృతి చెందాడు. పొలం గేదెలు కాస్తున్న క్రమంలో సాయంత్రం  పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో ఉన్న అంకమరావు వెళ్ళి చూడగా అప్పటికే వెంకటేశ్వర్లు మృతి చెంది ఉన్నాడు. వెంకటేశ్వర్లకు భార్య, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Updated Date - 2022-10-02T05:53:43+05:30 IST