మాస్ ప్రేక్షకుల పల్స్ బాగా తెలిసిన దర్శకుల్లో హరీశ్ శంకర్ ఒకరు. పవర్ స్టార్ తో ఆయన తీసిన ‘గబ్బర్‌సింగ్’ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. అభిమానులు ఏ మాత్రం ఊహించని రీతిలో పవర్ స్టార్ ను ‘గబ్బర్ సింగ్’ గా ఎలివేట్ చేసిన తీరుని మెచ్చుకోవాల్సిందే. అలాగే... బన్నీతో తీసిన ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం కూడా మాస్ జానానికి బాగా కనెక్ట్ అయింది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ తో హరీశ్ శంకర్ రూపొందించిన ‘గద్దలకొండ గణేశ్’ చిత్రం కూడా అదే రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ‘జిగర్తాండ’ తమిళ చిత్రాన్ని వరుణ్ ఇమేజ్ కు అనుగుణంగా మలిచి సూపర్ హిట్ అందుకున్నాడు హరీశ్. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి వరుణ్ తో హరీశ్ శంకర్ ఓ సినిమా తీయబోతున్నట్టు సమాచారం.
నేడు (బుధవారం) వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా హరీశ్ శంకర్ అతడికి విషెస్ తెలుపుతూ.. ట్వీట్ చేశాడు. ‘జిగర్తాండలోని బాబీ సింహ పాత్రలో నిన్ను ఊహించుకున్నప్పుడు నాకు తెలియదు.. నువ్వు ఆ పాత్రను ఎంతో కష్టపడి ఆ స్థాయిలో రక్తికట్టిస్తావని. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం నాకు ఎప్పుడూ ఆనందం కలిగించే విషయం. నీతో మరోసారి వర్క్ చేయడానికి ఎదురుచూస్తున్నాను’. అంటూ హరీశ్ శంకర్ ట్వీట్ చేశాడు. దాంతో వరుణ్, హరీశ్ శంకర్ కాంబోలో మరో సినిమా రాబోతోందని వార్తలొస్తున్నాయి. మరి నిజంగానే వీరి కలయికలో మరో సినిమా వస్తుందేమో చూడాలి.