కాళ్లు, పాదాల్లో... తిమ్మిర్లు, మంటలు

ABN , First Publish Date - 2022-08-02T10:41:51+05:30 IST

సూదులతో గుచ్చినట్టు అనిపించడం, మొద్దుబారడం, తిమ్మిర్లు, మంటలు... ఇలా కాళ్లు, పాదాల్లో రకరకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ పలు రకాల ఆరోగ్య సమస్యలకు సంకేతాలు.

కాళ్లు, పాదాల్లో... తిమ్మిర్లు, మంటలు

సూదులతో గుచ్చినట్టు అనిపించడం, మొద్దుబారడం, తిమ్మిర్లు, మంటలు... ఇలా కాళ్లు, పాదాల్లో రకరకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ పలు రకాల ఆరోగ్య సమస్యలకు సంకేతాలు. కాబట్టి ఈ లక్షణాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి అంటున్నారు వైద్యులు.


నరాల్లో చిన్నవీ, పెద్దవీ ఉంటాయి. ఇవి రెండూ వేర్వేరు బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటాయి. చిన్న నాడులు (సెన్సరీ) నొప్పినీ, స్పర్శనూ, వేడికీ స్పందిస్తే, పెద్ద నాడులు (మోటార్‌) నడక బ్యాలెన్స్‌ను నియంత్రిస్తాయి. ఈ రెండింట్లో తలెత్తే సమస్యలకు స్మాల్‌ ఫైబర్‌ న్యూరోపతీ, లార్జ్‌ ఫైబర్‌ న్యూరోపతీ అనే రెండు పేర్లున్నాయి. దెబ్బతిన్న నాడుల మీదే లక్షణాలు ఆధారపడి ఉంటాయి. చిన్న నాడులు దెబ్బతింటే సూదులతో గుచ్చినట్టు, మొద్దుబారినట్టు, మంటలు పుట్టడం లాంటి లక్షణాలు మొదలవుతాయి. ఈ సమస్య స్మాల్‌ ఫైబర్‌ న్యూరోపతీ. పెద్ద నాడులు దెబ్బతింటే అడుగులు తడబడడం, నడక బ్యాలెన్స్‌ తప్పడం లాంటి లక్షణాలు మొదలవుతాయి. ఇది లార్జ్‌ ఫైబర్‌ న్యూరోపతీ. అయితే ఎక్కువ మందిలో ఏదో ఒక రకం న్యూరోపతీ వేధిస్తే, కొందర్లో రెండు రకాల న్యూరోపతీలు కలిసి ఇబ్బంది పెడుతూ ఉంటాయి.


మధుమేహంతో ముప్పు

రెండు రకాల న్యూరోపతీలకు ప్రధాన కారణం మధుమేహం. అయితే మధుమేహం బారిన పడిన ఎంత కాలానికి ఈ లక్షణాలు మొదలవుతాయనేది చెప్పడమూ కష్టమే! దాంతో మధుమేహం ఉన్నప్పటికీ, ఈ లక్షణాలు కనిపించకపోవడంతో, మధుమేహాన్ని ఆలస్యంగా గుర్తించే పరిస్థితి నెలకొంటోంది. అయితే అప్పటికే నాడులు 20ు మేరకు దెబ్బతింటాయి. ఒకవేళ ఎటువంటి లక్షణాలూ లేకపోయినా, సాధారణ పరీక్షల్లో మధుమేహం ఉన్నట్టు తేలిన వాళ్లలో కూడా, వ్యాధి నిర్థారణ అయ్యే సమయానికే నాడులు 20ు మేరకు దెబ్బతిని ఉంటున్నట్టు కూడా పరిశోధనల్లో తేలింది. కాబట్టి కుటుంబ చరిత్రలో మధుమేహం ఉన్నవారు, రెట్టింపు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మధుమేహులు మందులను క్రమం తప్పకుండా, తగిన మోతాదుల్లో వాడుకుంటూ ఉండాలి. మందులతో లక్షణాలు అదుపులోకి వస్తాయి.


ఇవీ కారణాలే!

నాడీ సమస్యలకు ప్రధాన కారణం మధుమేహం. దీంతో పాటు ...

మద్యపానం: మితిమీరిన మద్యపానంతో (ఆల్కహాలిక్‌ న్యూరోపతీ) న్యూరోపతీ మొదలవుతుంది.

మందులు: కొన్ని రకాల యాంటీబయాటిక్స్‌, దీర్ఘకాల వ్యాధుల్లో వాడుకునే మందులు.

విటమిన్లు: విటమిన్‌ బి12, బి5 లోపం

వెన్ను సమస్య: కాళ్లలో తిమ్మిర్లు, మంటలకు మూల కారణం వెన్నులో కూడా ఉండవచ్చు. 

థైరాయిడ్‌: హైపో థైరాయిడ్‌లో కాళ్ల కండరాలు బలహీనపడి పెరిఫెరల్‌ న్యూరోపతీ రావొచ్చు.

అనీమియా: రక్తహీనతలో కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి

వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు: హెచ్‌ఐవిలో కూడా ఈ లక్షణాలు వేధిస్తాయి

డీమైలినేటింగ్‌ డిజార్డర్‌: నరాల పైపొర మైలీన్‌ షీట్‌ ఊడిపోయినా పై లక్షణాలతో పాటు కాళ్ల బలహీనత కూడా వేధిస్తుంది.

రహస్య కేన్సర్లు: బయటపడకుండా శరీరంలో రహస్యంగా దాగిన కేన్సర్లు న్యూరోపతీ లక్షణాల ద్వారా బయటపడుతూ ఉంటాయి. న్యూరోపతీకి ఇతరత్రా కారణాలు కనిపించనప్పుడు వైద్యులు ఇమ్యునో ఎలకో్ట్రఫొరెసిస్‌ అనే రక్తపరీక్ష చేయించి, ‘పారాప్రొటీనిమియా’ పరిస్థితిని కనిపెట్టడం ద్వారా శరీరంలో దాగిన కేన్సర్లను కనిపెడతారు. 

ఆటోఇమ్యూన్‌ డిజార్డర్‌: ఈ సమస్యతో యాంటీమ్యాగ్‌ న్యూరోపతీ వస్తుంది.


మందుల ప్రభావంతో...

క్షయ వ్యాధిలో వాడే ఐఎన్‌హెచ్‌ మందులు, ఇన్‌ఫెక్షన్లకు వాడే ‘లెనోజెల్లిట్‌’ యాంటీబయాటిక్‌ మొదలైన మందులను దీర్ఘకాలం వాడడం వల్ల కూడా న్యూరోపతీ తలెత్తవచ్చు. కాబట్టి ఆ మందుల ప్రభావాన్ని తగ్గించే ఇతర మందులను కూడా కలిపి వాడుకోవాలి. క్షయ వ్యాధిలో వాడే ‘ఇథాన్‌బ్యూటాన్‌’ అనే డ్రగ్‌ వల్ల కంటి నరం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే ఊపిరితిత్తుల కేన్సర్‌లో వాడే ‘ప్యాక్లిటాక్సెల్‌’ మందు వల్ల కూడా న్యూరోపతీ రావొచ్చు. కీమోథెరపీలో వాడే మందుల వల్ల కూడా ఈ సమస్య వేధించవచ్చు. కాబట్టి లక్షణాలు తీవ్రంగా వేధిస్తున్నప్పుడు, మందుల మోతాదును తగ్గించుకోవడం లేదా మందుల మధ్య వ్యత్యాసం పాటించడం లేదా ప్రత్యామ్నాయ మందులను ఎంచుకోవడం చేయాలి.. అలాగే విటమిన్‌ సప్లిమెంట్లను కూడా వాడుకోవలసి ఉంటుంది. కొలెస్ట్రాల్‌ తగ్గుదలకు వాడుకునే మందుల వల్ల కూడా న్యూరోపతీ లక్షణాలు మొదలవుతాయి. 


రెస్ట్‌లెస్‌ లెగ్‌ సిండ్రోమ్‌

కొందరికి పగలంతా ఎటువంటి ఇబ్బందీ లేకపోయినా, మధ్య రాత్రుళ్లు కాళ్లలో పోట్లు, కాళ్లు లాగడం, మంటలు, నొప్పులు, తిమ్మిర్లు, పిక్కలు పట్టేయడం, గుంజేయడం లాంటి ఇబ్బందులు వేధిస్తాయి. ఈ ఇబ్బందులతో నిద్ర మెలకువ అయిపోయి, కొద్ది సేపు నడిస్తే తప్ప లక్షణాల నుంచి ఉపశమనం దొరకని పరిస్థితి ఉంటుంది. ఈ సమస్యకు అనీమియా, థైరాయిడ్‌ ప్రధాన కారణాలుగా ఉంటాయి. వీళ్లకు సీరమ్‌ ఫెరిటిన్‌, థైరాయిడ్‌ పరీక్షలు చేసి వైద్యులు కారణాన్ని బట్టి చికిత్సను ఎంచుకుంటారు. అరుదుగా కొందర్లో ఏ కారణం లేకుండానే ఈ సమస్య తలెత్తే అవకాశాలూ ఉంటాయి.


జాగ్రత్తలు ఇవే!

క్రమం తప్పక వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి. నడక లాంటి తేలికపాటి వ్యాయామాలతో కూడా ఫలితం ఉంటుంది. అలాగే సమతులాహారం తీసుకోవాలి. న్యూరోపతీ సమస్య ఉన్నవాళ్లు పాదాలకు దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. చెప్పులు లేకుండా నడవకూడదు. పాదాల్లో చిన్న చీలిక ఏర్పడినా, అది పుండుగా మారి చికిత్సకు లొంగని పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఫుట్‌ కేర్‌ తీసుకోవాలి.


పోషక లోపంతో...

పోషకలోపంలో న్యూరోపతీ లక్షణాలన్నీ కనిపిస్తాయి. థయామిన్‌ (విటమిన్‌ బి1) లోపంతో, పాంటోథెనిక్‌ యాసిడ్‌ (విటమిన్‌ బి5) లోపంతో అరికాళ్ల మంటలు (బర్నింగ్‌ ఫీట్‌ సిండ్రోమ్‌) రావొచ్చు. 


ఇలా అప్రమత్తం

కాళ్లలో తిమ్మిర్లు, మంటలు, సూదులతో పొడవడం లాంటి లక్షణాలు రెండు వారాలకు పైగా వేధిస్తున్నా, లక్షణాల తీవ్రత క్రమేపీ పెరుగుతున్నా, కాళ్లతో మొదలై చేతులకు పాకినా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.


లక్షణాల మీద ఓ కన్నేసి

చెప్పులు జారిపోతూ ఉండడం

నడక తడబడడం, వేయాలి అనుకున్న చోట అడుగు వేయలేకపోవడం

కళ్లు మూసుకుంటే, అడుగులు వేయలేక అయోమయానికి లోనవడం


చెప్పులు జారిపోతుంటే...


కొందరు కాలి నుంచి చెప్పు జారిపోతున్నా, ఆ విషయాన్ని గ్రహించలేరు. టు వీలర్‌ మీద భర్త వెనక కూర్చుని, షాపింగ్‌ వొళ్లొచ్చిన ఆడవాళ్లు ఇంటికొచ్చేసరికి వాళ్ల కాలికి ఒక చెప్పే మిగిలి ఉంటూ ఉంటుంది. రెండో చెప్పు ఎప్పుడు జారిపోయిందో వాళ్లు కనిపెట్టలేకపోతూ ఉంటారు. న్యూరోపతీ కారణంగా చెప్పును పట్టి ఉంచే, వేలి కండరాలు బలహీనపడడం, ఆ ప్రదేశంలో స్పర్శ లోపించడమే!


డా. ఆర్‌.ఎన్‌ కోమల్‌ కుమార్‌

సీనియర్‌ న్యూరాలజిస్ట్‌, యశోద హాస్పిటల్స్‌,సికింద్రాబాద్‌.

Updated Date - 2022-08-02T10:41:51+05:30 IST