వరికి వందేనా!?

ABN , First Publish Date - 2022-06-12T04:34:41+05:30 IST

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాలతోపాటుగా సాగునీటి చెరువుల కింద 11లక్షల ఎకరాలకుపైగా వరి సాగు అవుతోంది.

వరికి వందేనా!?

కిలో ధాన్యానికి పెంచిన మద్దతు ధర ఒక్క రూపాయే!

కేంద్రం తీరుపై జిల్లా రైతాంగం పెదవివిరుపు

పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా పెంచాలని విజ్ఞప్తి


ప్రతి ఏటా వరి సాగు వ్యయం పెరిగిపోతోంది. విత్తనాల మొదలు డీజిల్‌, ఎరువులు, పురుగు మందులు, యంత్ర పరికరాల అద్దె, కూలీల రేట్లు నానాటికీ పెరిగిపోతున్నాయి. నారు పోసిన రోజుకు నాట్లు వేసే నాటికి రేట్లలో నియంత్రణ లేకుండా ఇష్టానుసారం ఎవరికి తగ్గట్టు వారు పెంచేస్తున్నారు. మరోవైపు పకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. పెరిగిన పెట్టుబడుల స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర పెంచలేదంటూ అన్నదాతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. క్వింటం ధాన్యానికి రూ.100 విదిల్చి కేంద్రం చేతులు దులుపుకొందన్న ఆవేదన జిల్లా రైతాంగంలో వ్యక్తమవుతోంది.


జలదంకి, జూన్‌ 11: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాలతోపాటుగా సాగునీటి చెరువుల కింద 11లక్షల ఎకరాలకుపైగా వరి సాగు అవుతోంది. జిల్లా రైతాంగంలో 70శాతానికిపైగా రైతులకు వరి సాగే ఆధారం. ఎన్‌ఎల్‌ఆర్‌ 34449 (నెల్లూరు మసూరి) విత్తన రకం ఇక్కడే వ్యవసాయ క్షేత్రంలో రూపాంతరం చెంది తక్కువ కాలంలో అధిక దిగుబడినిచ్చే రకంగా ప్రాచుర్యం పొందింది.


గిట్టుబాటు ధర కల్పించాలి


పెరిగిన సాగు వ్యయానికి తగ్గట్టు ధాన్యానికి గిట్టుబాటు ధర పెంచాలని ఎంతోకాలంగా రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. గత ఖరీ్‌ఫలో క్వింటం ధాన్యం మద్దతు ధర సాధారణ రకం రూ.1,940 ఉండగా రూ.2,040లకు చేశారు. ఏ గ్రేడ్‌ రకం రూ.1,960 ఉండగా రూ.2,060లకు పెంచారు. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం సాగు వ్యయం రూ.1360గా చూపింది. క్వింటం ధాన్యం పండించాలంటే  కేంద్రం చెప్పిన లెక్కకు వాస్తవ లెక్కకు తీవ్ర వ్యత్యాసం ఉందని అన్నదాతలు వాపోతున్నారు. బ్యాంకర్లు పంట రుణాలు ఇచ్చే విధానంలో ప్రభుత్వం స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఎకరానికి రూ.38వేల నుంచి రూ.40వేలు ఇచ్చేలా జాతీయ, సహకార బ్యాంకులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ఎకరానికి రూ.40వేలు పెట్టుబడి పెడితే దిగుబడి  3 పుట్ల వంతున వస్తే ప్రభుత్వం పెంచిన మద్దతు ధర ప్రకారం ఏ గ్రేడ్‌ రకం అయితే రూ.52,530 వస్తుంది. పెట్టుబడికి అదనంగా వడ్డీ  అర్ధ సంవత్సరానికి కలుపుకుంటే మరో రెండు, మూడు వేలు అదనపు ఖర్చు అవుతుంది. ఇది కూడా ప్రభుత్వ మద్దతు ధర దక్కిన రైతుకైతే ఎకరానికి ఏడెనిమిది వేలు మిగుతుంది. అదే కౌలు రైతు అయితే జిల్లాలో ఎకరానికి పుట్టి వడ్లు కౌలు ఇవ్వాల్సి ఉంది. పుట్టి వడ్లు కౌలుకు పోతే మిగిలేది ఏమీ ఉండదు. పైగా కౌలురైతులకు బ్యాంకుల్లో రుణం లభించదు. వడ్డీవ్యాపారులే దిక్కు. 2 నుంచి 3 రూపాయలకు అప్పు తెచ్చి ఎకరాకు రూ.40వేలు వంతున వరి సాగు చేస్తే ఆర్నెళ్లకు వడ్డీనే రూ.4,800 నుంచి 5వేలు అవుతుంది. ఇలా చూస్తే కౌలురైతుకు నష్టాలే తప్ప లాభం ఉండదు. జిల్లాలో 5లక్షల కుటుంబాలకుపైగా వరిసాగుపై ఆధారపడి ఉండగా వీరిలో 4లక్షల కుటుంబాలు కౌలురైతులే కావడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే కౌలురైతులు వరిసాగుకు దూరమైతే జిల్లాలో సగానికిపైగా వరి మాగాణి భూములు బీళ్ళుగా మారే ప్రమాదం ఏర్పడింది. ధాన్యం మద్దత్తు ధర రూ.400 నుంచి 500 పెంచి ఉంటే ఎంతో ఊరటనిచ్చేదని అన్నదాతలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా కేంద్రం మద్దతు ధరపై పునరాలోచన చేయాలని జిల్లా రైతాంగం కోరుతోంది. 


క్వింటంకు రూ.500 పెంచాలి


కేంద్ర ప్రభుత్వం క్వింటం ధాన్యానికి రూ.100 మద్దతు ధర పెంచింది. ఇది చాలదు. పెరిగిన సాగు వ్యయం ప్రకారం రూ.500 వరకు ధర పెంచేలా కేంద్రం పునరాలోచించాలి. లేకుంటే రైతులు వరిసాగుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇది ఆహార సంక్షోభానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. 

- పూనూరు బాస్కర్‌రెడ్డి, ఉదయగిరి అసెంబ్లీ తెలుగురైతు అధ్యక్షుడు


ఏమాత్రం సరిపోదు


 డీజిల్‌ ధర బాగా పెంచేశారు. దీని ప్రభావం వ్యవసాయంపై పడింది. ట్రాక్టర్‌ దగ్గర నుంచి ఎరువులు, పురుగుమందులు ఇలా అన్ని ధరలూ పెరిగిపోయాయి. ఇదే స్థాయిలో మద్దతు ధర పెంచలేదు. క్వింటంకు  రూ.100 పెంచడం సమర్దనీయం కాదు. ఇది రైతులకు అన్యాయం చేయడమే. సాగు వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని మద్దతు ధర పెంచాలి.

- స్వర్ణ కొండపనాయుడు, బీకే.అగ్రహారం, జలదంకి మండలం

Updated Date - 2022-06-12T04:34:41+05:30 IST