కార్న్‌ సీజన్‌!

ABN , First Publish Date - 2020-07-25T05:30:00+05:30 IST

వానాకాలం... చిరుజల్లులు పడుతుంటే కాల్చిన మొక్కజొన్న పొత్తులు తినడం మామూలే. అయితే ఈ కాలంలో విరివిగా దొరికే మొక్కజొన్నతో కాస్త వెరైటీగా పకోడి, గారెలు, దోశ, సబ్జీ, కబాబ్‌లు కూడా చేసుకోవచ్చు...

కార్న్‌ సీజన్‌!

వానాకాలం... చిరుజల్లులు పడుతుంటే కాల్చిన మొక్కజొన్న పొత్తులు తినడం మామూలే. అయితే ఈ కాలంలో విరివిగా దొరికే మొక్కజొన్నతో కాస్త వెరైటీగా పకోడి, గారెలు, దోశ, సబ్జీ, కబాబ్‌లు కూడా చేసుకోవచ్చు. ముసురు పడుతున్న వేళ ఈ కార్న్‌ రుచులు మీరూ ట్రై చేయండి. 


 


పకోడి

కావలసినవి

స్వీట్‌ కార్న్‌ - ఒకటిన్నర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, సెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, బియ్యప్పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా - అర టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, కరివేపాకు - రెండు రెమ్మలు, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, కారం - అర టీస్పూన్‌, నూనె - సరిపడా.


తయారీ

  1. కార్న్‌ను మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. బాగా మెత్తగా కాకుండా చూసుకోవాలి.
  2. తరువాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, సెనగపిండి తగినంత ఉప్పు, గరంమసాలా, బియ్యప్పిండి, కారం వేసి బాగా కలపాలి.
  3. మిశ్రమం మరీ మెత్తగా ఉండకూడదు. ఒకవేళ  మెత్తగా అయితే కొద్దిగా బియ్యప్పిండి కలపాలి.
  4. స్టవ్‌పై పాత్ర పెట్టి నూనె పోయాలి. నూనె వేడి అయ్యాక ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చిన్నమంటపై వేగించాలి.
  5. ఈ వేడి వేడి కార్న్‌ పకోడి చట్నీతో తింటే రుచిగా ఉంటుంది. 





కార్న్‌ కబాబ్‌

కావలసినవి

మొక్కజొన్నలు - రెండు  కప్పులు, బంగాళదుంపలు - రెండు, జున్ను - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - రెండు, అల్లం - కొద్దిగా, నల్ల మిరియాల పొడి - అర టీస్పూన్‌, గరంమసాలా - అర టీస్పూన్‌, తెల్ల మిరియాల పొడి - అరటీస్పూన్‌, జాపత్రి - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.

తయారీ

  1. ముందుగా బంగాళదుంపలు ఉడికించి, గుజ్జుగా చేయాలి.
  2. ఒక పాత్రలో మొక్కజొన్నలు, బంగాళదుంపల గుజ్జు, జున్ను, తరిగిన పచ్చిమిర్చి, దంచిన అల్లం, నల్లమిరియాల పొడి, గరంమసాలా, తెల్లమిరియాల పొడి, జాపత్రి, తగినంత ఉప్పు వేసి కలపాలి.
  3. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ కబాబ్‌లు చేయాలి.
  4. స్టవ్‌ పై పాన్‌ పెట్టి నూనె వేడి అయ్యాక కబాబ్‌లు వేసి చిన్న మంటపై గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి. 
  5. పుదీనా చట్నీతో వేడి వేడి కార్న్‌ కబాబ్స్‌ను చేసుకోవాలి.




కార్న్‌ సబ్జీ

కావలసినవి

స్వీట్‌ కార్న్‌ - ఒక కప్పు, బిర్యానీ ఆకు - ఒకటి, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, టొమాటోలు - మూడు, నూనె - సరిపడా, కారం - ఒక టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, జీడిపప్పు - ఐదారు పలుకులు, క్రీమ్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా - అర టీస్పూన్‌, మెంతి పొడి - ఒక టీస్పూన్‌, కొత్తిమీర - ఒకకట్ట.


తయారీ

  1. పావుకప్పు గోరువెచ్చటి పాలలో జీడిపప్పును నానబెట్టాలి. తరువాత దాన్ని మిక్సీలో వేసి పేస్టుగా చేసి పెట్టుకోవాలి.
  2. ఒక గిన్నెలో నీళ్లు పోసి స్వీట్‌ కార్న్‌ను ఉడికించాలి. 
  3. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేగించాలి. 
  4. తరువాత ఉల్లిపాయలు వేయాలి. అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేగించాలి.
  5. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
  6. తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. చిన్న మంటపై ఉడికిస్తూ ఉండాలి.
  7. జీడిపప్పు పేస్టు వేసి కలపాలి. తరువాత ఉడికించి పెట్టుకున్న స్వీట్‌కార్న్‌ వేయాలి.
  8. ఒక కప్పు నీళ్లు పోసి మరో పది నిమిషాల పాటు ఉడికించాలి.
  9. క్రీమ్‌ వేసి, గరంమసాలా, మెంతిపొడి, ధనియాల పొడి వేసి కలపాలి.
  10. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసి దింపాలి.
  11. రోటీ లేదా చపాతీలోకి ఈ సబ్జీ ఎంతో రుచిగా ఉంటుంది.




గారెలు

కావలసినవి

కార్న్‌ - రెండు కప్పులు, జీలకర్ర - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, ఎండుమిర్చి - పది, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, పసుపు - చిటికెడు, నూనె - సరిపడా.


తయారీ

  1. గారెలకు స్వీట్‌కార్న్‌ కాకుండా మామూలువి తీసుకోవాలి. మొక్కజొన్నలు మరీ లేతగా ఉండకూడదు. అలాగనీ మరీ ముదిరిపోయినవి తీసుకోవద్దు.
  2. మొక్కజొన్నలు, జీలకర్ర, ధనియాల పొడి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి పట్టుకోవాలి. నీళ్లు పోయకుండా పట్టుకోవాలి. 
  3. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకొని కరివేపాకు, తగినంత ఉప్పు, పసుపు వేసి కలియబెట్టాలి.
  4. స్టవ్‌పై పాత్ర పెట్టి నూనె వేడి చేయాలి. మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ గారెలు నూనెలో వేసి వేగించాలి. గారెలు గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి.
  5. ఈ గారెలు వేడి వేడిగా వడ్డించాలి.




స్పైసీ కేక్‌

కావలసినవి

స్వీట్‌కార్న్‌ - ఒక కప్పు, కార్న్‌ దాలియా - ఒక కప్పు, పెరుగు - అరకప్పు, పచ్చిమిర్చి - రెండు, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీస్పూన్‌, ఉప్పు - తగినంత, ఫ్రూట్‌సాల్ట్‌ - ఒక టీస్పూన్‌, అల్లం - కొద్దిగా, నిమ్మరసం - అర టీస్పూన్‌, పంచదార - అరటీస్పూన్‌, కొత్తిమీర - ఒకకట్ట, నూనె - తగినంత, ఆవాలు - అర టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, కారం - అర టీస్పూన్‌.


తయారీ

  1. ముందుగా మిక్సీలో స్వీట్‌కార్న్‌ వేసి, తరువాత అల్లం, పచ్చిమిర్చి వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. 
  2. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని కార్న్‌ దాలియా, పెరుగు వేసి కలపాలి. తరువాత ఇంగువ, పసుపు, ఉప్పు, పంచదార, నిమ్మరసం వేసి కలియబెట్టాలి.
  3. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.
  4. ఇడ్లీ ప్లేట్‌ల లాంటి పాత్ర తీసుకోవాలి. చతురస్రాకారంలో మౌల్డ్‌ ఉన్న పాత్ర అయితే మరీ మంచిది. దానిపై కొద్దిగా నూనె రాయాలి. 
  5. తరువాత  పక్కన పెట్టుకున్న మిశ్రమానికి ఫ్రూట్‌ సాల్ట్‌ కలిపి మౌల్డ్‌ ప్లేట్స్‌పై పోయాలి.
  6. పావుగంట పాటు ఆవిరిపై ఉడికించాలి.
  7. స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. కరివేపాకు, ఇంగువ, కారం వేసి కలపాలి.
  8. ఈ పోపు మిశ్రమాన్ని స్పూన్‌ సహాయంతో కార్న్‌ కేక్‌పై చల్లాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి.




కార్న్‌ దోశ

కావలసినవి

కార్న్‌ - మూడు కప్పులు, ఎండుమిర్చి - రెండు, పచ్చిమిర్చి - రెండు, మినప్పప్పు - పావుకప్పు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.


తయారీ

  1. కార్న్‌, మినప్పప్పును అరగంటపాటు నానబెట్టాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.
  2. తరువాత అందులో మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మరోసారి గ్రైండ్‌ చేసుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి.
  3. స్టవ్‌పై పాన్‌ పెట్టి కాస్త వేడి అయ్యాక దోశలు వేసి కాల్చాలి. దోశలపై నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చాలి. తరువాత చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-07-25T05:30:00+05:30 IST