వెరైటీగా ట్రై చేద్దాం!

ABN , First Publish Date - 2020-12-05T05:30:00+05:30 IST

ఎప్పుడూ ఒకే రకమైన వంటలంటే బోర్‌ కొడుతుంది. రుచుల్లో వైవిధ్యం ఉంటేనే జిహ్య చాపల్యం తీరుతుంది. భిన్నమైన రుచితో పాటు పోషకాలు సమృద్ధిగా లభించేందుకు చామ ఆకుల పకోడీ, సజ్జల కిచిడీ, తామర గింజల ఖీర్‌, ముల్లంగి వేపుడు...

వెరైటీగా ట్రై చేద్దాం!

ఎప్పుడూ ఒకే రకమైన వంటలంటే బోర్‌ కొడుతుంది. రుచుల్లో  వైవిధ్యం ఉంటేనే జిహ్య చాపల్యం తీరుతుంది. భిన్నమైన రుచితో పాటు పోషకాలు సమృద్ధిగా లభించేందుకు చామ ఆకుల పకోడీ, సజ్జల కిచిడీ, తామర గింజల ఖీర్‌, ముల్లంగి వేపుడు టేస్ట్‌ చేయండి.   



చామ ఆకుల పకోడీ


కావలసినవి

చామ ఆకులు - నాలుగైదు, సెనగపిండి - పావుకేజీ, ఉప్పు - తగినంత, కారం - సరిపడా, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, గరంమసాలా - ఒక టీస్పూన్‌, బేకింగ్‌ సోడా - అర టీస్పూన్‌, ఆవాల నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, ఇంగువ - చిటికెడు, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు.


తయారీ విధానం

  1. ఒక పాత్రలో సెనగపిండి తీసుకుని అందులో తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరంమసాలా, బేకింగ్‌ సోడా వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా తయారయ్యేలా కలపాలి. 
  2. చామ ఆకులను శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి. తరువాత సెనగపిండి మిశ్రమంలో ముంచి తీయాలి. 
  3. ఇప్పుడు ఆకులను గుండ్రంగా రోల్‌లా చుట్టి పదిహేను  నిమిషాల పాటు ఉడికించాలి.
  4. చల్లారిన తరువాత రింగ్స్‌లా కట్‌ చేసుకోవాలి.
  5. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేయాలి. ఇంగువ, జీలకర్ర, పసుపు వేయాలి. తరువాత కట్‌ చేసి పెట్టుకున్న రింగ్స్‌ వేసి వేగించాలి.
  6. నిమ్మరసం పిండుకుని పుదీనా చట్నీ లేదా కొత్తిమీర చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.



చామ ఆకులు 100గ్రాములలో...

  • ప్రొటీన్లు - 18 గ్రా
  • క్యాలరీలు - 42
  • కార్బోహైడ్రేట్లు - 7 గ్రా



సోయాబీన్‌ కర్రీ


కావలసినవి

నల్ల సోయాబీన్‌ - పావుకేజీ, బియ్యప్పిండి - కొద్దిగా, వేగించిన ఎండు మిర్చి - నాలుగు, వెల్లుల్లి - నాలుగైదు రెబ్బలు, పసుపు - ఒక టీస్పూన్‌, గరంమసాలా - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, ఆవాల నూనె - మూడు టేబుల్‌స్పూన్లు.


తయారీ విధానం

  1. స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి సోయబీన్స్‌ వేసి వేగించుకుని దింపాలి. కాస్త వేడిగా ఉండగానే గింజలను దంచుకోవాలి.
  2. తరువాత అందులో బియ్యప్పిండి వేసి కలపాలి.
  3. ఇప్పుడు  స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేయాలి. 
  4. బియ్యప్పిండి కలిపిన సోయాబీన్స్‌ మిశ్రమం వేసి కలపాలి. పసుపు, గరంమసాల, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. 
  5. వేగించిన ఎండుమిర్చితో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి. అన్నంలోకి ఇది రుచిగా ఉంటుంది.



  • బ్లాక్‌ సోయాబీన్‌లో...
  • క్యాలరీలు - 402
  • ప్రోటీన్లు - 33.6 గ్రా
  • కార్బోహైడ్రేట్లు - 36.4 గ్రా





తామర గింజల ఖీర్‌

కావలసినవి

తామరగింజలు - పావుకేజీ, పాలు - ఒక లీటరు, పంచదార - 25గ్రా, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, బాదం పలుకులు - పది, యాలకులు - నాలుగు.


తయారీ విధానం

  1. ఒక మందపాటి పాత్ర తీసుకుని స్టవ్‌పై పెట్టి వెన్న వేసి తామరగింజలను వేగించాలి.
  2. తరువాత వాటిని గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి.
  3. స్టవ్‌పై పాన్‌ పెట్టి పాలు పోసి మరిగించాలి. 
  4. పాలు మరుగుతున్న సమయంలో పంచదార వేయాలి. 
  5. ఇప్పుడు గ్రైండ్‌ చేసి పెట్టుకున్న తామరగింజలు వేసి కలపాలి.
  6. మరికాసేపు ఉడికిన తరువాత యాలకుల పొడి వేయాలి.
  7. బాదంపలుకులతో గార్నిష్‌ చేసి అందించాలి.


తామరగింజలలో...

ప్రోటీన్లు - 9.7 గ్రా

క్యాలరీలు - 347

ఫైబర్‌ - 14.5 గ్రా






ముల్లంగి వేపుడు


కావలసినవి

ముల్లంగి - నాలుగు, బంగాళదుంపలు - రెండు, టొమాటోలు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి - ఎనిమిది రెబ్బలు, ఎండుమిర్చి - మూడు, జీలకర్ర - అర టీస్పూన్‌, కారం - అర టీస్పూన్‌, ధనియాల పొడి - అర టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, వాము - అర టీస్పూన్‌.


తయారీ విధానం

  1. ముల్లంగి, బంగాళదుంపల పొట్టు తీసి శుభ్రంగా కడగాలి. 
  2. తరువాత వాటిని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. 
  3. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఇంగువ, జీలకర్ర, వాము, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించాలి.
  4. తరిగిన ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి  కలపాలి.
  5. కాసేపు ఉడికిన తరువాత పసుపు, ధనియాల పొడి, కారం వేసుకోవాలి.
  6. ఇప్పుడు ముల్లంగి, బంగాళదుంపల ముక్కలు వేసి మరో ఐదు నిమిషాల పాటు వేగించాలి.
  7. గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. 
  8. చిన్నమంటపై అరగంటపాటు ఉడికించిన తరువాత కొత్తిమీర వేసుకుని అన్నంతో పాటు వడ్డించాలి.



ముల్లంగిలో...

ప్రోటీన్లు - 0.7 గ్రా

క్యాలరీలు - 16

కార్బోహైడ్రేట్లు - 3.4 గ్రా






సజ్జల కిచిడీ


కావలసినవి

సజ్జలు - రెండు కప్పులు, పెసరపప్పు - అరకప్పు, మిరియాలు - ఐదు, లవంగాలు - నాలుగు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీస్పూన్‌, నెయ్యి - ఒక టీస్పూన్‌, నీళ్లు - ఐదు కప్పులు.


తయారీ విధానం

  1. ముందు రోజు రాత్రి సజ్జలు, ధాన్యాలను నానబెట్టుకోవాలి.
  2. ఉదయాన నీళ్లన్నీ తీసివేసి సజ్జలను గ్రైండ్‌ చేయాలి.
  3. స్టవ్‌పై పాన్‌పెట్టి నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక మిరియాలు, లవంగాలు, జీలకర్ర వేసి వేగించాలి.
  4. తరువాత ఇంగువ, పసుపు, తగినంత ఉప్పు వేసి కలపాలి.
  5. ఇప్పుడు నానబెట్టిన పప్పు, గ్రైండ్‌ చేసి పెట్టుకున్న సజ్జలను వేయాలి. తగినన్ని నీళ్లు పోసి కలియబెట్టు కోవాలి.
  6. చిన్నమంటపై ఉడికించాలి. మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసుకోవచ్చు.
  7. ఉడికిన తరువాత నెయ్యి వేసుకుని వేడి వేడిగా సర్వ్‌ చేయాలి.



సజ్జలలో...

ప్రోటీన్లు - 11 గ్రా

క్యాలరీలు - 382

కార్బోహైడ్రేట్లు - 75 గ్రా

Updated Date - 2020-12-05T05:30:00+05:30 IST