Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరి పైరుపై తెగుళ్ల దాడి

వాతావరణంలో మార్పులతో విజృంభిస్తున్న చీడపీడలు

ఆందోళన చెందుతున్న రైతులు

తక్షణమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తల సూచన

మందులు పిచికారీ చేసినా పూర్తిగా తగ్గడంలేదని అన్నదాతల ఆవేదన

ధాన్యం దిగుబడిపై ప్రభావం చూపుతుందని గుబులు


చోడవరం/ రావికమతం, అక్టోబరు 17: 

జిల్లాలోని పలు మండలాల్లో వరి పైరుపై పలురకాల తెగుళ్లు దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా పొడతెగులు, దోమపోటు, 

ఆకు ముడత, రసం పీల్చు పురుగులు ఆశించి పంటకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మందులు పిచికారీ చేసినా.. తెగుళ్లు పూర్తిగా తగ్గడంలేదని, దీనివల్ల ధాన్యం దిగుబడి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కొద్ది రోజుల నుంచి తరచూ వర్షాలు పడుతుండడం, వేసవిని తలపించేలా ఎండలు కాస్తుండడం వంటి వాతావరణంలో ఏర్పడిన విపరీతమైన మార్పుల కారణంగా చీడిపీడలు విజృంభిస్తున్నాయని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. రైతులు నిత్యం వరి పైరుని గమనిస్తూ, తెగుళ్ల లక్షణాలు కనిపిస్తే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, ఏ తెగులుకి 

ఏ క్రిమి సంహారక మందు పిచికారీ చేయాలో మండల వ్యవసాయ అధికారులను లేదా అందుబాటులో వున్న శాస్త్రవేత్తలను సంప్రదించాలని సూచిస్తున్నారు.

జిల్లాలో జూలై చివరి వారం నుంచి ఆగస్టు రెండో వారం మధ్యలో వరి నాట్లు వేసి పొలాల్లో ప్రస్తుతం పైరు పొట్ట దశకు చేరువలో వుంది. గత నెలాఖరున తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలు పడడం, ఆ తరువాత కూడా అడపా దడపా వర్షాలు పడుతుండడంతో రిజర్వాయర్లు, చెరువుల ఆయకట్టు ప్రాంతాలతో పాటు వర్షాధారంగా వరి సాగు చేస్తున్న ప్రాంతాల్లో పైరు ఆశాజనంగా వుంది. అయితే సుమారు వారం పది రోజుల నుంచి వేసవిని తలపించేలా ఎండ కాస్తుండడం, అప్పుడప్పుడు వర్షాలు పడుతుం డడంతో వరి పైరును తెగుళ్లు ఆశిస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలం బడి కార్యక్రమంలో భాగంగా పంట పొలాలను సందర్శిస్తున్న శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు... కొన్నిచోట్ల తెగుళ్లు సోకినట్టు గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాలని ఆయా రైతులకు సూచిస్తున్నారు. ఈ మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పటికీ రెండు మూడు రోజుల్లోనే మరో రకం తెగులు వ్యాపిస్తున్నదని రైతులు వాపోతున్నారు.  

చోడవరం, పాయకరావుపేట, నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి సబ్‌ డివిజన్ల పరిధిలోని పలు మండలాల్లో వరి పంటను పొడతెగులు, దోమపోటు, అగ్గి తెగులు, ఆకు ముడత, రసం పీల్చు పురుగులు వంటి చీడపీడలు ఆశించినట్టు క్షేత్రస్థాయిలో పర్యటి స్తున్న వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. వరి నాట్లు ఆలస్యంగా వేసిన పొలాల్లో పైరు త్వరగా ఎదుగుతుందన్న ఉద్దేశంతో నత్రజని (యూరియా)  ఎరువుని మోతాదుకి మించి వేస్తున్నారని, తెగుళ్లు సోకడానికి ఇది కూడా ఒక కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనికితోడు కొద్ది రోజుల నుంచి తరచూ వర్షాలు పడుతుండడంతో గాలిలో తేమ అధికంగా వుండి తెగుళ్లు విజృంభిస్తున్నాయని పేర్కొన్నారు. కాగా వరి పైరుని ఆశిస్తున్న తెగుళ్లు, నివారణ చర్యల గురించి బుచ్చెయ్యపేట మండలం కొండెంపూడిలోని కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ వి.గౌరి తెలిపిన సమాచారం...

తెగుళ్లు... నివారణ చర్యలు

పొడ తెగులు: ఈ తెగులు ఆశించిన పొలంలో వరి దుబ్బు కింద నుంచి పై వరకు గోధుమ రంగు మచ్చలువచ్చి, ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు హెక్సాకొనజోల్‌ మందును లీటరు నీటికి రెండు మిల్లీలీటర్ల చొప్పున కలిపి, ఎకరానికి 200 లీటర్ల మందు నీటిని పది రోజుల వ్యవధిలో రెండుసార్లు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. ఈ సమయంలో పొలంలో నుంచి నీటిని పూర్తిగా తొలగించాలి. పైరుతోపాటు గట్లపైన కూడా మందు పిచికారీ చేయాలి.

దోమపోటు: పొలంలో నీరు ఎక్కువగా నిలువ వుంటే సుడిదోమ ఆశించే అవకాశం వుంది. అందువల్ల పొలంలో అవసరం మేరకు మాత్రమే నీటిని వుండేలా చూసుకోవాలి. దోమలు వరి దబ్బులను ఆశించి పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. వరి దుబ్బులను కదిలిస్తే పెద్ద సంఖ్యలో దోమలు కనిపిస్తాయి. సుడిదోమ నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్‌ 1.5 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్‌ 2.2 మిల్లీలీటర్లు లేదా ఇతోఫెన్‌ప్రాక్స్‌ 0.6 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. మందునీటిని వరి దబ్బులు మొత్తం తడిచేలా పిచికారీ చేయాలి.

ఆకు ముడత తెగులు/ రసం పీల్చు పురుగులు: ఈ తెగులు సోకిన పొలంలో ఆకులు ముడుచుకుపోయి వుంటాయి. ఆకుని చీల్చితే పురుగులు కనిపిస్తాయి. ఇవి రసాన్ని పీల్చివేయడంతో ఆకులు తెల్లగా మారి ఎండిపోతాయి. ఈ పురుగుల నివారణకు తొలుత పైరుపై ముళ్ల కంపతో లాగాలి. దీనివల్ల ఆకులు చీలిపోయి పురుగులు బయటకు వస్తాయి. వెంటనే లీటరు నీటికి 2 మి.మీ.ల చొప్పున క్లోరీఫైరిఫాస్‌ మందుని కలిపి ఎకరాకు  200 లీటర్ల మందునీటిని పిచికారీ చేయాలి.


Advertisement
Advertisement