గింజ.. గిజ గిజ!

ABN , First Publish Date - 2021-11-28T05:07:20+05:30 IST

కృష్ణా పశ్చిమ డెల్టాలో 5.73 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అకాల వర్షాల కారణంగా వీటిలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో వరిపంట నేలవాలింది.

గింజ.. గిజ గిజ!
తెనాలి : వెల్లబాడు వద్ద హార్వెస్టర్‌తో కోత కోయగా వచ్చిన తడిసిన ధాన్యం

కోతలు ప్రారంభమైనా కొనేవారేరీ?

వాయుగుండాల్లో కొట్టుకుపోయిన సర్కారు హామీలు

వరి కోతలు భారం... గిట్టుబాటు గాలిలో దీపం

మద్దతు ధర పెంచింది రూ.72...  

పంట నష్టం, ఖర్చులేమో తడిచి మోపెడు

వెనుక వాయుగండం... ముందు కొనుగోళ్ల అనిశ్చితి

నష్టం అంచనాలూ ఆమడ దూరమే

అయోమయ స్థితిలో డెల్టా రైతులు


 ఆరుగాలం కష్టపడి పంట పండించటం ఒకెత్తయితే, దానిని చేతికందివచ్చే దశలో కాపాడుకుని, గిట్టుబాటు ధరకు అమ్ముకోవటం తలకు మించిన భారమవుతోంది. ఓ పక్క వరుస వాయు గండాలు డెల్టా రైతన్నను నిలువునా ముంచేస్తున్నాయి. మరోపక్క ప్రభుత్వం రైతులను ఆదుకుంటామంటూ ఆర్భాటంగా చెబుతున్నా ఆచరణలో అది జరగడం లేదు. దీంతో ఖరీఫ్‌ వరి రైతన్న పరిస్థితి అయోమయంగా మారింది. 


కృష్ణా పశ్చిమ డెల్టాలో కాల్వలకు ఎగువనున్న భూముల్లో వరి పంట వరుస వాయుగుండాలతో నేలవాలిపోయింది. వరి కోతలు కూలీలతో అయితే గతేడాది ఎకరాకు రూ.3వేల నుంచి రూ.5 వేల వరకు ఉంటే, ఈ సంవత్స రం ప్రారంభంలోనే వరి కోతలకు రూ.7 వేలు చెబుతున్నారు.  కోతకే ఇంత రేటు పెడితే, రేపు కుప్ప, నూర్పిళ్లకు రెట్టింపు ఖర్చవుతుందని, అవన్నీ భరించే పరిస్థితిలేదని రైతులు వాపో తున్నారు. ఈ సంవత్సరం పెరిగిన ఖర్చులు, పెట్టుబడుల దృష్ట్యా ప్రభుత్వం గిట్టుబాటు ధర మరింత పెంచుతుందని రైతులంతా ఆశిం చారు. కానీ కేవలం రూ.72 మాత్రమే క్వింటాకు పెంచి చేతులు దులుపుకొంది. 


తెనాలి, నవంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): కృష్ణా పశ్చిమ డెల్టాలో 5.73 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అకాల వర్షాల కారణంగా వీటిలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో వరిపంట నేలవాలింది. దీనిలో 40 శాతం పంట కంకుల నుంచి మొలకలొచ్చి గింజకూడా దక్కని విధంగా పనికిరాకుండాపోయింది. మిగిలిన పంట గింజలు రాలిపోగా, ఉన్న కొద్దిపాటి కంకులు రంగుమారి నల్లగా మారిపోయాయి. ఈ తరుణంలో రైతన్నకు అండగా నిలుస్తామంటూ సర్కారు ఇచ్చిన హామీ వాయుగుండాల్లో కొట్టుకుపోయినట్టయింది.  15 నుంచి 20 రోజులుగా నేలపై వాలిపోయి కంకులు మొలకలెత్తిపోతున్నాయి. కోత కోద్దామంటే పంట నష్టం అంచనాలు వేయటానికి అధికారులు వస్తారేమోననే కొందరి ఆశ..! వారు వచ్చే వరకు వది లేస్తే పరిహారం మాట అటుంచితే ఒక్క గింజ కూడా మిగల కుండా పోతుందేమో అని మరి కొందరి ఆందోళన. ఇప్ప టికే దిగుబడి సగానికిపైగా తగ్గిపోతే, ఉన్న పంట ఖర్చులను కూ డా దక్కనిచ్చేలా లేదని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.  ఉన్న కొద్దిపాటి పంటనైనా దక్కించుకుందామని వరి కోతలకు రైతులు సిద్ధపడుతుంటే, కూలి భారం మరింత కుంగదీస్తోంది.


కొనుగోళ్ల ఊసేది!

కృష్ణా పశ్చిమ డెల్టాలో కాల్వలకు ఎగవున ఉన్న మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి, కొల్లూరు, వేమూరు, భట్టిప్రోలు, అమృతలూరు, చుం డూరు, రేపల్లె ప్రాంతాల్లోని భూముల్లో వరి పంట చివరి దశలో చేతికంది వచ్చింది. వరుస వాయుగుండాలతో పంట మొత్తం నేలవాలిపోయింది. అయితే వీటిలో చాలావరకు కంకులు నేలపై వాలిపోయి, వాన నీటిలో నానిపోయి మొలకలొచ్చేశాయి. మిగిలిన పంట నీటిలో నానటం వల్ల బంగారు వర్ణాన్ని కోల్పో యి నల్లగా మారిపోయింది. ఇటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావటంలేదు. మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం మా త్రం కొనుగోలు విషయంలో ముందుకు రాని పరిస్థితి. తాజాగా కో-ఆపరేటివ్‌ శాఖ అధికారులు కొంతమంది సిబ్బందికి సమావేశం ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాల ని చెప్పటం మినహా దానికి అవసరమైన పరికరాలు, గోతాల వంటివాటిపై ఊసేలేదు. మార్కెటింగ్‌ శాఖ, జి.డి.ఎం.ఎస్‌ల వంటివి ముందుకే రాలేదు. అయితే ఆర్‌.బి.కె లనే కొనుగోలు కేంద్రాలుగా ప్రభుత్వం ప్రకటించామని చెబుతుంటే, ఆ కేంద్రాల దగ్గరకు వెళ్లిన వారికి సమాధానమే దొరకటంలేదు. రైతులు ఎవ్వ రూ కొనుగోలు కేంద్రాల దగ్గరకు రావద్దని, మే మే రైతుల దగ్గరకు, వారి ఇళ్లకు వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రవాణా భారాన్ని కూడా వారిపై మోపబోమని వ్యవసాయ మంత్రి ప్రకటిస్తే, వచ్చి కొనటం అటుంచి రైతులే వెళ్లి అడి గి నా కొనుగోళ్లు చేయని పరిస్థితి. దీం తో రైతులు చాలామంది వరి కోతల ను కోసేందుకు వెనకాడుతున్నారు. 


గుండె కోతే 

సాధారణంగా ఎకరా వరి పండించటానికి రూ.25వేల నుంచి రూ.28వేల వరకు పెట్టుబడులు అవుతాయి. ఈ సారి వర్షాల వల్ల దెబ్బతిన్న పంటకు మ రింత పెట్టుబడులు పెరిగిపోయాయి. దీంతో సగటు పెట్టుబడి ఖర్చు ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.40వేలకు పెరిగింది. వరి నారుమళ్లు, నాట్లు, ఎరువులు, పురుగు మందులకు ఇప్పటివరకు ఎకరాకు రూ.20వేల నుంచి రూ.25వేల వరకు పెట్టుబడులు పెట్టేశారు. అయితే వరి కోతలు కూలీలతో అయితే గతేడాది ఎకరాకు రూ.3వేల నుంచి రూ.5 వేల వరకు ఉంటే, ఈ సంవత్సరం ప్రాంరభంలోనే వరి కోతలకు రూ.7 వేలు చెబుతున్నారు. పో యిన పంటకు అంత ఖర్చులు ఎక్కడ పెడతామని వదిలేస్తున్నామ ని ప్రభాకరరావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అదే హార్వెస్టర్‌ అయితే గతేడాది గంటకు రూ.3వేల వంతున చెల్లించామని, పడిపోయిన చేలకు గంటన్నర నుంచి 2 గంటలు పట్టిందని, ఎకరాకు రూ.4,500 నుంచి రూ.6వేలతో అయిపోయిందని, అయితే ప్రస్తుతం నీరు చేలల్లో ఉండటం, చాలావరకు తడితో ఉండటంతో కోయించలేకపోతున్నామని రైతులు చెబుతున్నారు. కోతకే ఇంత రేటు పెడితే, రేపు కుప్ప, నూర్పి ళ్ల కు రెట్టింపు ఖర్చవుతుందని, అవన్నీ భరించే పరిస్థితిలేదని రైతులు వాపోతున్నారు.


సగానికి సగం దిగుబడులు పోయే..

ఎకరాకు సగటున 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడులు దక్కుతాయని రైతులు ఆశపడ్డారు. పంట కంకి దశలో ఉన్నప్పటి నుంచి వర్షాలు మొదలవటం, పాలుపోసుకునే దశలోనే మానుకాయ వేయటంతో కొంత దిగుబడిపై ప్రభా వం పడితే, మిగిలిన పంటపై వర్షాలు, వాయుగుండాలు కోలుకోని నష్టాన్ని మిగిలిచ్చాయి. దీంతో ఎకరాకు 10 నుంచి 15 బస్తాల దిగుబడి కూడా దక్కటం గగనమైపోయింది. ఎకరాకు 38 బస్తాల సగటు దిగుబడి వస్తుందని అనుకుంటే, 5.73 లక్షల ఎకరాల్లో 2.17 కోట్ల బస్తాల ధాన్యం దిగుబడి దక్కేది. ఏ ఆటుపోట్లు లేకుంటే ఇది మరింత పెరిగేదికూడా. అయితే ప్రకృతి విపత్తులు, ఇతర కారణాలతో దిగుబడులు సగానికిపైగా పడిపోవటంతో ఎకరాకు సగటున 20 బస్తాల దిగుబడికూడా అంతంతమాత్రంగా ఉంది. ఈ లెక్క ప్రకారం చూసినా 1.14 కోట్ల బస్తా లు దిగుబడులు దక్కకుండా పోయినట్టే. అంటే నష్టపోయిన 1.03 కోట్ల బస్తాల దాన్యం మొత్తాన్ని  ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర 75 కిలోలకు రూ.1,470 ప్రకారం చూస్తే రూ.1,516.15 కోట్లు నష్టపోయినట్టువుతుంది. అయితే ఈ నష్టం చాలాచో ట్ల మరింత ఎక్కువగా ఉండటంతో దిగుబడుల నష్టం రూ.2వేల కోట్లు దాటిపోయే పరిస్థితి ఉంది.  అయితే ప్రభుత్వానికి మాత్రం దీనిపై చీమకుట్టినట్టు కూడా లేకపోవటం, ఉన్న ధాన్యాన్నయినా మంచి ధరకు కొనుగోలు చేయటం లేదు.


పెంచింది  రూ.72 మాత్రమే..

గతేడాది ఖరీఫ్‌ సీజన్‌కు ఎ గ్రేడ్‌ రకం ధాన్యం ధర రూ.1,888గా ప్రకటిస్తే, కామన్‌ రకం ధాన్యానికి రూ.1,868గా నిర్ణయించారు. అయితే ఈ సంవత్సరం పెరిగిన ఖర్చులు, పెట్టబడుల దృష్ట్యా ప్రభుత్వం గిట్టుబాటు ధర మరింత పెంచుతుందని రైతులం తా ఆశించారు. కానీ కేవలం రూ.72 మాత్రమే క్విం టాకు పెంచి చేతులు దులుపుకొంది. ఈ సంత్సరం మద్దతు ధర ఎ గ్రేడ్‌ రకం ధాన్యం క్వింటాకు రూ.1,960గా, కామన్‌ రకానికి రూ.1,940గా నిర్ణయించారు. అయితే ఈ సంవత్సరం వాయుగుండాలతో నష్టం పెరిగిపోయి సగానికి సగం దిగుబడులు తగ్గిపోవటంతో కనీసం ఖర్చులు కూడా రావనేది రైతుల ఆవేదన. ఈ మాత్రం పెంపునకే భారీగా పెంచామన్నట్టు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి గొప్పలు చెప్పుకోవటం సిగ్గుపడాల్సి విషయమం టూ రైతు సంఘం నా యకుడు ము లకా శివసాంబిరెడ్డి విమర్శించారు. రై తు పరిస్థితి వ్యవసాయ శాఖ మంత్రికి ఏమాత్రం తెలియదని, ముఖ్యమంత్రికైతే సరేసరని, ఇటువంటివారు రైతుల కష్టాలు తీర్చుతారనుకోవటం ఎండమావులపై ఆవిరయ్యే ఆశలవంటివేనన్నారు. ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు సమయం  దాటి నవంబరు నెల ముగుస్తున్నా కొనుగోళ్ల ఊసే లేకపోవటంపై రైతులు మండిపడుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని ఆర్‌బీకేల్లో అమ్ముకోవాలంటే ఈ-క్రాప్‌లో పంట వివరాలను నమోదు చేయించుకోవాల్సిందేనే షరతును ప్రభుత్వం పెట్టింది. అయితే ఆర్‌బీకేల్లో గత నెల నుంచి నమోదుకోసం వెళుతున్న రైతులకు సర్వర్‌ సమస్య ఉందని చెప్పి తిప్పి పంపుతున్నారు. అయితే అధికారులు మాత్రం చాలాచోట్ల నూరు శాతం ఈ-క్రాప్‌ నమోదు జరిగిపోయిందని చెబుతుంటే, మరికొన్ని చోట్ల ఇంకా కేవలం 20 శాతం మాత్రమే చెయ్యాల్సి ఉందని చెబుతున్నారు. అయితే రైతు సంఘాల నేతలు మాత్రం ఇంకా 50 శాతం కూడా పూర్తికాలేదని, దీనివల్ల ప్రస్తుతం వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులు చాలావరకు నష్టపోవలసి వస్తుందని, కేవలం ఇదంతా రైతులను మోసగించే కుట్ర మాత్రమేనంటూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తీవ్ర ఆరోపణలకు దిగుతున్నారు. ఈ-క్రాప్‌ నమోదే కాకుండా తర్వాత గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా సి.ఎం యాప్‌లో నమోదు కూడా తప్పనిసరే నంటున్నారు. ఇవన్నీ తెలియని రైతులు ప్రభుత్వం గొప్పగా ప్రకటించామని చెబుతున్న ఆ మాత్రం గిట్టుబాటు ధరకు కూడా నోచుకోలేని పరిస్థితి ఉంది.

Updated Date - 2021-11-28T05:07:20+05:30 IST