పర్యవేక్షకులా? లంచావతారులా?

ABN , First Publish Date - 2021-07-23T05:54:31+05:30 IST

నగరంలో వార్డు సచివాలయాల ఉద్యోగులపై పర్యవేక్షకుల వేధింపులు తీవ్రమయ్యాయి.

పర్యవేక్షకులా? లంచావతారులా?

వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాల నుంచి రూ.3500 చొప్పున స్వాహా

 వార్డు అడ్మినిస్ర్టేటివ్‌ సెక్రటరీల దందా

 మహిళా ఉద్యోగులపై ఒక వార్డు అడ్మినిస్ర్టేటివ్‌ సెక్రటరీ వేధింపులు

కలెక్టర్‌,  కమిషనర్‌లకు ఫిర్యాదు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

నగరంలో వార్డు సచివాలయాల ఉద్యోగులపై పర్యవేక్షకుల వేధింపులు తీవ్రమయ్యాయి. ప్రతి చిన్నదానికీ లంచం ఆశించడం పరిపాటిగా మారింది. ఉద్యోగులు సెలవు పెట్టినా లంచం, జీతం తీసుకున్నా లంచం ఇవ్వాల్సిందేనని పర్యవేక్షకులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతటితో ఆగక మహిళా ఉద్యోగులపైనా రకరకాల వేధింపులు నిత్యకృత్యమవుతున్నాయి. వీటిని తట్టుకోలేక నగరంలో కొందరు వార్డు సచివాలయ ఉద్యోగులు కలెక్టర్‌కూ,  వీఎంసీ కమిషనర్‌కూ ఫిర్యాదు చేయడంతో ఈ తతంగమంతా వెలుగులోకొచ్చింది.

నగరంలోని 300కుపైగా వార్డు సచివాలయాలున్నాయి. వీటిని విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తోంది. ఇందుకోసం కార్పొరేషన్‌ కొంతమందికి అఽధీకృత పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. సిబ్బంది అటెండెన్స్‌, జీతభత్యాల చెల్లింపులు, ఇతర సమస్యలను కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారు. అన్ని వార్డు సచివాలయాల్లో ఒక్కొక శాఖకు సంబంధించిన ఉద్యోగులను ఒకరు చొప్పున పర్యవేక్షిస్తారు. ఈ క్రమంలో కరోనా సెకండ్‌ వేవ్‌లో నగరంలోని సచివాలయాలకు కొందరు ఉద్యోగులు రాలేని పరిస్థితి ఏర్పడింది. మరికొందరు వచ్చారు. వీరిపై పర్యవేక్షణ చేసినవారు వేతనాల అవకతవకలకు పాల్పడ్డారని జిల్లా కలెక్టర్‌ నివాస్‌, మునిసిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌లకు ఫిర్యాదులు అందాయి. విధులకు హాజరైనవారి నుంచీ, హాజరు కాని వారి నుంచీ వార్డు అడ్మినిస్ర్టేటివ్‌ కార్యదర్శులు డబ్బులు డిమాండ్‌ చేసినట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఒక్కొకరు రూ.3500 ఇవ్వాల్సి వచ్చిందని వాపోయారు. నగరంలోని 286వ వార్డు సచివాలయానికి చెందిన వార్డు అడ్మినిస్ర్టేటివ్‌ కార్యదర్శి తమ జీతాలకు సంబంధించి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. తరచూ ఉద్యోగులకు ఫోన్‌ చేస్తుంటారని, బహుమతులకు డిమాండ్‌ చేస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. అతను కోరుకున్న విధంగా తమ నుంచి సహాయాలను ఆశిస్తున్నాడని వాపోయారు. దీనిపై ఉన్నతాధికారుల విచారణ మొదలైనట్టు తెలిసింది. వార్డు సచివాలయాల పరిధిలో ఉద్యోగుల జీతాలను కూడా మింగేసే పరిస్థితులకు ఈ ఒక్క ఘటన అద్దం పడుతోంది. గతంలో తమ ఇబ్బందులకు సంబంధించి సచివాలయ శానిటేషన్‌ ఉద్యోగులు కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన ఉదంతం ఇంకా మరచిపోకముందే తాజా ఫిర్యాదులు వెలుగుచూశాయి. 


Updated Date - 2021-07-23T05:54:31+05:30 IST