అమానవీయ విమర్శ

ABN , First Publish Date - 2020-11-20T06:43:09+05:30 IST

విరసాన్ని అడ్డం పెట్టుకొని వరవరరావు (వివి)ని విమర్శించాలనుకున్నారో, లేక వివిని అడ్డం పెట్టుకొని విరసాన్ని దుయ్యబట్టాలన్న ఉద్దేశ్యమో తెలియదు కాని, విక్టర్ విజయకుమార్ తన వ్యాసం (వ్యక్తిపూజలో విరసం, 13 నవంబరు)లో అమానవీయతను....

అమానవీయ విమర్శ

విరసాన్ని అడ్డం పెట్టుకొని వరవరరావు (వివి)ని విమర్శించాలనుకున్నారో, లేక వివిని అడ్డం పెట్టుకొని విరసాన్ని దుయ్యబట్టాలన్న ఉద్దేశ్యమో తెలియదు కాని, విక్టర్ విజయకుమార్ తన వ్యాసం (వ్యక్తిపూజలో విరసం, 13 నవంబరు)లో అమానవీయతను, అమానుషత్వాన్ని వెళ్లగక్కారు. వివి విడుదల గురించి, ప్రభుత్వ నిర్బంధంలో ఏళ్ల తరబడి జైళ్లల్లో మగ్గుతున్న ప్రజామేధావుల గురించి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రజాస్వామిక ఉద్యమాన్ని బలహీనపరచడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తున్నది. గొంతు లేని వారి గొంతుక తానే అయి, వాళ్ళ ఆవేదనను, ఆక్రోశాన్ని అనుభవించి పలవరించినవాడు వివి. ‘సొంత లాభము కొంత మానుక పొరుగువాడికి తోడుపడవోయి’ అన్నాడు గురజాడ. తన జీవితం కొంచెం కాదు...పూర్తిగానే సమాజం కోసం పణంగా పెట్టినవాడు వరవరరావు. దాన్ని విప్లవం అంటారో... మరేదైనా పదం వాడతారో తెలియదుగాని, స్నేహం ప్రేమ బోధన అన్నీ కలగలిసిన సంబంధాలను తోటి మానవులతో పంచుకొనే అసాధారణ వ్యక్తిత్వం వివి ది. తన లాంటి మనుషులు ఉద్భవించే పరిస్థితులు సమాజం లో ఏర్పడాలన్న తాపత్రయం వివి ది. వివి భాషలోనే చెప్పాలంటే ‘నూతన మానవుని ఆవిర్భావం’ ఆయన లక్ష్యం. దాని కోసం తన వంతు కృషి తాను చేసాడు. ఇదీ ఆయన వ్యక్తిత్వం, ఇదీ ఆయన జీవితం, ఇదీ ఆయన జీవన సిద్ధాంతం - అని చెపితే అది వ్యక్తిపూజ ఎలా అవుతుంది? 


వివి పరిచయం వల్ల, ఆయన వ్యక్తిత్వం వల్ల కొన్ని వేల మంది ఆలోచనలలో, జీవితాన్ని అవగాహన చేసుకోవడంలో మార్పులు వచ్చాయి. అందుకే ఆయన ఒక ‘లెజెండ్’. ఒక వ్యక్తి ని మనం ‘లెజెండ్’ అంటున్నామంటే పదిమంది ఆయన్ను గురించి ఆత్మీయంగా ఆలోచిస్తున్నారని, ఆయన తన పనుల వల్ల ఖ్యాతిని పొందుతున్నాడని అర్థం కాదా? ఏ సంస్థ అయినా పనిగట్టుకొని చేస్తే ఎవరూ లెజెండ్ కారు. ఆయన ప్రభావం సమాజం మీద ఉంటేనే లెజెండ్ అవుతారు. ఆయన మేనల్లుడో, ఆయన కుటుంబ సభ్యులో, ఆయన క్రియాశీల సభ్యుడయిన ఏ సంస్థనో ఆయన్ను గురించి మాట్లాడక, ఆయనపై మోపిన అసంబద్ధ అభియోగాల గురించి పోరాడక, అన్యాయం అట్లా సాగిపోవలసిందేనా? ఆయన మేనల్లుడు మాత్రమే కాదు, భారతదేశ చరిత్ర కారులలో గౌరవప్రదమయిన స్థానాన్ని అధిరోహించిన రొమిల్లా థాపర్ ఆయన గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడడమే కాదు, ఆయన అరెస్టు అక్రమమని సుప్రీంకోర్టులో దావా కూడా వేశారు. ప్రపంచంలో పేరెన్నిక గన్న మేధావులు వివి గురించి మాట్లాడుతున్నారు. దేశవిదేశాలలో ఆయన కవితలను వివిధ భాషల్లోకి అనువదించి, ఆయన పట్ల జరిగిన అన్యాయానికి తమ వంతుగా నిరసన వ్యక్తపరుస్తున్నారు. 


విజయకుమార్ ఆరోపణలకు విరసం బాధ్యులు సమాధానం చెపుతారో లేదో నాకు అప్రస్తుతం. కాని, వివి అభిమానిగా, వారి కవిత్వ వ్యక్తిత్వాన్ని ప్రేమించేవాణ్ణిగా, వారి సామాజిక చింతన పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా, ఆయన పూర్వ విద్యార్థిగా ఇది నా స్పందన.


రాజేంద్ర బాబు అర్విణి

Updated Date - 2020-11-20T06:43:09+05:30 IST