భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం

ABN , First Publish Date - 2022-08-06T05:11:05+05:30 IST

నగరంలో శుక్రవారం ప్రజలు వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇంటింట వ్రతాలు, ఆలయాల్లో సామూహిక వ్రతాలు జరిగాయి.

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం
రాజరాజేశ్వరి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం

 రంగనాయకమ్మకు సహస్ర దీపాలంకరణ

 భక్తులతో ఆలయాలన్నీ కళకళ

నెల్లూరు (సాంస్కృతికం) ఆగస్టు 5 : నగరంలో శుక్రవారం ప్రజలు వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.  ఇంటింట వ్రతాలు, ఆలయాల్లో సామూహిక వ్రతాలు జరిగాయి. ముత్తైదువులకు ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకొంటినమ్మ వాయనం అంటూ ఇచ్చిపుచ్చుకున్నారు. భక్తులతో ఆలయాలు కళకళలాడాయి. కరోనా మహమ్మారి తర్వాత తొలిసారిగా ప్రజలు వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు.  

 నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకుడు రఘురామశర్మ ఆధ్వర్యంలో జరిగిన  వ్రతానికి, అమ్మవారికి ప్రత్యేక అలంకారం చేశారు. మూలవరులకు ప్రత్యేక అలంకారం, పూలంగిసేవ జరిగింది. అన్నదానం జరిగింది. సాయంత్రం విశేష పూజలు, కుంభ హారతులు జరిగాయి. నగర ప్రముఖులు అధికారులు అమ్మవారిని సందర్శించుకున్నారు.వేడుకలను ఆలయ చైర్మన్‌ రత్నం జయరామ్‌, ధర్మకర్తలు, ఈవో సహాయ కమిషనర్‌ వెండిదండి శ్రీనివాసరెడ్డిలు పర్యవేక్షించారు. 

 మూలస్థానేశ్వరాలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. భారీ సంఖ్యలో భక్తులు వ్రతం ఆచరించారు. స్వామి వారికి భువనేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూలంగి సేవ జరిగింది. కార్యక్రమాలను ఆలయ చైర్మన్‌, ధర్మకర్తలు ఈవో ఆరంబాకం వేణుగోపాల్‌ సిబ్బంది పర్యవేక్షించారు. 

 శబరి శ్రీరామక్షేత్రంలో ఆలయ ప్రధాన అర్చకుడు నరేష్‌స్వామి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాదం వితరణ జరిగింది. చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 10న ఆలయం 22వ వార్షికోత్సవం జరుగుతుందని తెలిపారు. ఉదయం అభిషేకం, హోమం, పూర్ణాహుతులు జరుగుతాయని పేర్కొన్నారు. 

 స్టోన్‌హౌస్‌పేట వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి పూలంగిసేవ, విశేష అలంకారాలు జరిగాయి. బంగారు చీర అలంకారంలో కనువిందు చేసింది. రాత్రి ముత్తైదువులకు పసుపు కుంకుమ, జాకెట్లు ముత్తైదువులకు అందజేశారు. కార్యక్రమాలను ఆలయ ధర్మకర్తలు, ఉభయకర్తలు పర్యవేక్షించారు. 

 నగర దేవత ఇరుకళల పరమేశ్వరి ఆలయంలో ఉదయం విశేష గాజులు అలంకారం, రాత్రి సామూహిక కుంకుమార్చన  పూజలు జరిగాయి. కార్యక్రమాలను ఆలయ ధర్మకర్తలు, ఉభయకర్తలు ఈవో కడారి పెంచలప్రసాద్‌ పర్యవేక్షించారు. అయ్యప్పగుడి గురువాయురప్పన్‌ మహావిష్ణు ఆలయంలో  ఆదిలక్ష్మికి వరలక్ష్మీ వ్రతం, అష్ట మహాలక్ష్మి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిగాయి. 

మహాత్మాగాంధీనగర్‌ కృష్ణమందిరంలో శుక్రవారం వైభవలక్ష్మీ సామూహిక వరలక్ష్మీ వ్రతం కనుల పండుగా జరిగింది. నగరంలోని కోదండరామపురం, నవాబుపేట, ఫత్తేఖాన్‌పేట, టెక్కేమిట్ట, మూలాపేటలోని మహాలక్ష్మీ ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిగాయి. 

రంగనాయకమ్మకు సహస్ర దీపాల అలంకరణ

 రంగనాయకుల పేటలో రంగనాయకమ్మకు సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది. అమ్మవారికి విశేష పూజలు, ప్రాకార ఉత్సవం, ఊంజల్‌ సేవలు జరిగాయి. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాలను ఆలయ చైర్మన్‌ శివకుమార్‌, ఈవో డి.వెంకటేశ్వర్లు, ధర్మకర్తలు, అర్చకులు సిబ్బంది  పర్యవేక్షించారు.

 ఘనంగా సుమంగళి సత్కారాలు

 పురమందిరం వర్థమాన సమాజ మందిరంలో సృజన సాహిత్య, సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో  వివిధ రంగాల్లో రాణిస్తున్న బి.లీలావతి (వృద్ధాశ్రమ నిర్వాహకురాలు) టీచర్లు పి.విజితారెడ్డి, సీహెచ్‌ విజిత, గాయని ఎం.విజయలక్ష్మి, పరివార్‌ సేవా ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ ఎస్‌.మాధవిలకు సుమంగళి పురస్కారాలు అందజేశారు. తొలుత పాటల పోటీలు జరిగాయి. కార్య క్రమంలో దగ్గుమాటి రాధాకృష్ణ, వనం శ్రీరాములు, రాపూరి వెంకయ్య, సింగమశెట్టి మురళీమోహన్‌రావు, వి.హర్షవర్ధిని, వీవీ వినోద్‌కుమార్‌, ఎం.శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-06T05:11:05+05:30 IST