శుభకరం... సౌభాగ్యప్రదం

ABN , First Publish Date - 2020-07-31T04:45:47+05:30 IST

శ్రావణమాసం మహిళల మాసం. ఈ మాసంలో నిర్వహించే వరలక్ష్మీ వ్రతాన్ని తెలుగునాట

శుభకరం... సౌభాగ్యప్రదం

శ్రావణమాసం మహిళల మాసం. ఈ మాసంలో నిర్వహించే వరలక్ష్మీ వ్రతాన్ని తెలుగునాట మహిళలు సర్వాభీష్ఠదాయకంగా పరిగణిస్తారు. తమ కుటుంబాలకు సకల సౌభాగ్యాలూ ఒనగూరాలని కోరుకుంటూ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. 


వ్రతాలకూ, నోమూలకూ సనాతన భారతీయ సంప్రదాయంలో విశిష్టమైన స్థానం ఉంది. నిత్యం చేసే పూజలూ, ఆరాధనల కన్నా వ్రతాలను నిర్వహించే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి వ్రతానికీ ఒక ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతారు. ఒక ఫలితాన్ని ఆశించి, నిర్దిష్ట విధి, విధానాలతో చేసే వ్రతాలను ‘కామిత వ్రతాలు’ అని అంటారు. వ్రతం అంటే ‘నియమం’, ‘ప్రవర్తన’ అనే అర్థాలు ఉన్నాయి. వ్రత నియమాలూ, వ్రతం చేసేవారి ప్రవర్తనను బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ నియమ నిష్ఠలను ఆచరించేవారెవరైనా... సామాజిక, ఆర్థిక స్థాయిలకూ, వర్ణాలకూ అతీతంగా వ్రతాలు చేసుకోవచ్చు. శ్రావణమాసంలో ఆచరించే వ్రతాలు అమిత ఫలదాయకాలని నమ్మిక. ఈ నెలలో మంగళవారాల్లో గౌరీ (పార్వతీ) దేవినీ, శుక్రవారాలు శ్రీమహాలక్ష్మినీ ఆరాధిస్తే కోరిన కోర్కెలు తీరుతాయనీ, సకల సౌభాగ్యాలూ లభిస్తాయనీ పురాణాలు చెబుతున్నాయి. గౌరి, లక్ష్మి - వీరిద్దరూ ఆదిశక్తికి వేర్వేరు అభివ్యక్తి రూపాలే!


శ్రావణ మంగళవారాల్లో గౌరీ దేవిని కొలుస్తూ చేసే వ్రతం మంగళగౌరీ వ్రతం. దీన్ని యువతులు వివాహమైన మొదటి ఏడాది ప్రారంభించి, అయిదు సంవత్సరాలు కొనసాగిస్తారు. ఆ తరువాత ఉద్యాపన చేస్తారు. వివాహితలైన పుణ్యస్త్రీలు ఆచరించే వ్రతం ఇది. ఇక వరలక్ష్మీ వ్రతాన్ని అవివాహితలూ, వివాహితలూ ఆచరిస్తారు. జీవితాంతం చేసుకొనే వ్రతం ఇది. 


లక్ష్మీదేవిని అష్టవిధ రూపాలలో కొలుస్తూ ఉంటారు. వాటిలో వరలక్ష్మీ దేవి కనిపించదు. కానీ అష్టలక్ష్ములు అందించే ఫలితాలకు చోదక శక్తి వరలక్ష్మీ దేవి. ‘వర’ అంటే ‘శ్రేష్టమైనది’ అనీ, ‘ఎంపిక చేసినది’ అనీ అర్థం. ఏ లక్ష్మిని ఆరాధించినా, ఆయా దేవతల పరంగా వరాన్ని అందించే దేవత వరలక్ష్మే!  కుమార స్వామి అభ్యర్థన మేరకు పార్వతీ దేవి సమక్షంలో ఈ వ్రతాన్ని శివుడు ఉపదేశించాడనీ, దాన్ని స్కంధుడు భూలోకంలో వ్యాప్తి చేశాడనీ కథ ఉంది.


వ్రతం ఇలా...

శ్రావణమాసం తెలుగు లోగిళ్ళకు పండగ కళ తీసుకొస్తుంది. మహిళలు పసుపు, కుంకుమలతో గడపలను తీర్చి దిద్దుతారు. పూజామందిరాలకు అలంకారాలు చేస్తారు. గుమ్మాలను మామిడి కొమ్మలతో అలంకరించి, మహాలక్ష్మికి స్వాగతం పలుకుతారు. శ్రావణ పౌర్ణమికి ముందు శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. వ్రత విధానానికి అనుగుణంగా అమ్మవారికి షోడశోపచార పూజ, తోరాల పూజా చేస్తారు. ముంజేతికి తోరాలను కట్టుకున్న తరువాత చారుమతి అనే సాధ్వి కథ చెప్పుకొంటారు. చారుమతి భక్తిప్రపత్తులకూ, నడవడికకు వరలక్ష్మీ దేవి ప్రసన్నురాలైంది. ఆమెకు కలలో కనబడి శ్రావణ శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను పూజిస్తే సర్వ సౌభాగ్యాలూ ప్రసాదిస్తానని చెప్పింది. వ్రత విధి విధానాలను వివరించింది.  వ్రతం గురించి, అత్తమామలకూ, భర్తకూ, తోటి మహిళళకూ చారుమతి చెప్పగా, అందరూ సామూహికంగా వ్రతాన్ని ఆచరించారనీ, తద్వారా వారు అపార సౌభాగ్యాన్ని పొందారని చారుమతి కథ చెబుతోంది. ఈ వ్రతానంతరం ముత్తయిదువలకు వాయినాలు ఇచ్చి, పురోహితులను సత్కరించి, పెద్దలకు నమస్కరించి ఆశీస్సులు అందుకుంటే శుభఫలితాలు కలుగుతాయని వ్రత కథ వివరిస్తోంది. - ఎ. సీతారామారావు

Updated Date - 2020-07-31T04:45:47+05:30 IST