అమరావతిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

ABN , First Publish Date - 2020-08-08T07:52:40+05:30 IST

వరాలిచ్చే వరలక్ష్మీ.. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించే వరం ప్రసాదించు తల్లీ.. అంటూ రాజధాని మహిళలు వేడుకున్నారు.

అమరావతిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

తుళ్లూరు/తాడికొండ/మంగళగిరి క్రైమ్‌, ఆగస్టు 7 : వరాలిచ్చే వరలక్ష్మీ.. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించే వరం ప్రసాదించు తల్లీ.. అంటూ  రాజధాని మహిళలు వేడుకున్నారు.  అమరావతి ఉద్యమం 234వ రోజు, శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని తుళ్లూరు, వెలగపూడి, అబ్బురాజుపాలెం, నీరుకొండ, అనంతవరం, బోరుపాలెం, నేలపాడు, ఐనవోలు, పెదపరిమి తదితర గ్రామాల్లో మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. ప్రధానమంత్రి శంకుస్థాపన  చేసిన ఉద్దండరాయునిపాలెంలో శ్రావణ శుక్రవారం పూజలు చేశారు.


ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాజధానిలో ఇప్పటికే రూ.వేల కోట్లతో నిర్మించిన నిర్మాణాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మూడు రాజధానుల ప్రకటనతో వేలమంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. పెట్టుబడిదారులు రాష్ట్రంవైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. కానీ, న్యాయవ్యవస్థ రైతుల పక్షానే ఉందన్నారు. మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకునే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. 


మిన్నంటిన నిరసనలు

తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద రైతులు వినూత్న నిరసన తెలిపారు. నలుపు, ఎరుపు, తెలుపు పావురాలను ఎగురవేశారు. రాత్రి 7.30 గంటల సమయంలో ‘అమరావతి వెలుగు’ కార్యక్రమం కింద దీపాలు వెలిగించి మహిళా రైతులు ప్రతిజ్ఞ చేశారు. తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామ రైతులు, మహిళల నిరసన దీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ ఎర్రబాలెం రైతులు నిరసన చేపట్టారు. మూడు రాజధానులకు  వ్యతిరేకంగా సీపీఎం రాజధాని డివిజన్‌ నాయకులు తుళ్లూరులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసనలు తెలిపారు. 

Updated Date - 2020-08-08T07:52:40+05:30 IST