అను‘మతి’లేని పనులు!

ABN , First Publish Date - 2020-06-03T10:05:24+05:30 IST

వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం పరిధిలో అనుమతులు లేకుండానే అనేక పనులు జోరందుకున్నాయి.

అను‘మతి’లేని పనులు!

అప్పన్న సన్నిధిలో అక్రమాలు 

ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే నిర్మాణాలు 


సింహాచలం, జూన్‌ 2:  వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం పరిధిలో అనుమతులు లేకుండానే అనేక పనులు జోరందుకున్నాయి. దేవదాయశాఖ నిబంధనల ప్రకారం ప్రధాన దేవస్థానాలకు మాస్లర్‌ ప్లాన్‌ రూపొందించి, అనుమతి పొందిన తరువాతే చేపట్టాలి. అత్యవసర పరిస్థితుల్లో మాస్టర్‌ప్లాన్‌లో లేని పనులు చేపట్టాల్సి వస్తే వాటికి ప్రాథమిక అంచానాలు రూపొందించి, సమగ్ర వివరాలతో కూడిన ప్లాన్‌ను దేవదాయశాఖ రాష్ట్ర ముఖ్యకార్యనిర్వాహక ఇంజినీరు అనుమతి తీసుకోవాలి. అయితే ఇక్కడ ఇలాంటి నిబంధనలను కనిపించడం లేదు.  ఇటీవల ప్రభుత్వం నియమించిన విచారణాధికారి, దేవదాయశాఖ జాయింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర ఆజాద్‌ తన నివేదికలో ఇలాంటి అంశాల్నే ప్రస్తావించారు. వాటిలో తొలిపావంచా వద్ద దాతల సహకారంతో నిర్మించిన 12 దుకాణాల సముదాయం ఒకటి. దాని నిర్మాణానికి ఉన్నతాధికారుల అనుమతి లేదని కొందరు కోర్టును ఆశ్రయించారు.


ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా దుకాణాల నిర్మాణం, కేటాయింపుల్లో ఈఓ నిర్ణయాలు తీసుకోవడాన్ని తప్పుబట్టారు. అదే విధంగా సింహగిరి టోల్‌గేట్‌ తరలింపు, నూతన టోల్‌గేట్‌ నిర్మాణం వంటి అంశాలు అనుమతి పొందిన దేవాలయ మాస్టర్‌ ప్లాన్‌లో లేవు.  ఉన్నతాధికారుల అనుమతీ లేదు. ఇవేవీ లేకుండానే టోల్‌గేట్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం, ప్రణాళిక లేకుండా గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టడం వివాదాస్పదమైంది. తాజాగా సింహగిరి హిల్‌టాప్‌రోడ్డులోని గిరిజన గ్రామం కాటేజీలను వినియోగంలోకి తెచ్చేందుకు సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో స్థలాన్ని చదును చేసి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణాలకు కూడా ఉన్నతాధికారుల అనుమతి పొందలేదు. రోడ్డు నిర్మాణానికి చేపట్టిన తవ్వకాలతో భవిష్యత్తులో భారీ వర్షాలు కురిస్తే ప్రధాన దేవాలయానికి ముప్పుందని ఆజాద్‌ నివేదికలో పేర్కొన్నారు. దేవస్థానానికి చెందిన నృసింహవనం (గోశాల) ప్రాంగణంలో ఖాళీ స్థలం, పోస్టాఫీసు వీధిలోని ఖాళీ స్థలంలో షెడ్ల నిర్మాణంతో పాటు వ్యాపారాలు చేసుకునేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వేలం నిర్వహించారు. వాటికీ ఉన్నతాధికారుల అనుమతులు లేవని సమాచారం. 

Updated Date - 2020-06-03T10:05:24+05:30 IST