జల దిగ్బంధం

ABN , First Publish Date - 2021-08-06T05:30:00+05:30 IST

కృష్ణానదికి వరద ప్రవాహం శుక్రవారం అనూహ్యంగా పెరిగింది. రెండు రోజుల క్రితం వచ్చిన వరదతో ముంపునకు గురైన పొలాల్లోని నీరు ఒక్కరోజులోనే తగ్గిపోయిందని ఆనందిస్తున్న రైతుల ఆశలపై మళ్లీ వస్తున్న వరద కంటతడి పెట్టిస్తున్నది.

జల దిగ్బంధం
భట్టిప్రోలు : ఓలేరు తూర్పుపాలెం వద్ద అరటితోటలోకి చేరిన వరద నీరు

లంకలను చుట్టుముడుతోన్న వరద

పంట పొలాలను ముంచెత్తుతున్న కృష్ణమ్మ

చప్టాలపై ప్రవాహంతో నిలిచిన రాకపోకలు

నదిలో వేగంగా పెరుగుతున్న నీటి ప్రవాహం

నీటి ఉధృతికి విరిగి పడుతున్న కరకట్ట మట్టి పెళ్లలు

నేడు, రేపు మరింతగా ప్రవాహం ఉండొచ్చని హెచ్చరికలు


కృష్ణమ్మ మహోగ్రంగా ఉరకలెత్తుతూ లంకలను చుట్టేస్తోంది. పులిచింతల ప్రాజెక్టు 16వ నెంబరు గేటు కొట్టుకుపోవడంతో నీటి విడుదల కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు ప్రకాశం బ్యారేజికి చేరుతుంది. దీంతో బ్యారేజి నుంచి 4లక్షల 40వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా నదిలో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహ ధాటికి కరకట్ట మట్టి పెళ్లలు విరిగిపడిపోతున్నాయి. కృష్ణమ్మ ఉగ్రరూపానికి లంక గ్రామాల ప్రజలతో పాటు కరకట్ట సమీప గ్రామాలకు చెందిన వారు వణికిపోతున్నారు. నిన్నటి వరకు శాంతంగా ఉన్న కృష్ణమ్మ ప్రవాహం శుక్రవారం తెల్లవారుజాము నుంచి అతివేగంగా  మారింది. ఇప్పటికే పంట పొలాలను కృష్ణమ్మ ముంచెత్తింది. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లోని తీర గ్రామాలకు ముంపు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.



తెనాలి, భట్టిప్రోలు, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): కృష్ణానదికి వరద ప్రవాహం శుక్రవారం అనూహ్యంగా పెరిగింది.  రెండు రోజుల క్రితం వచ్చిన వరదతో ముంపునకు గురైన పొలాల్లోని నీరు ఒక్కరోజులోనే తగ్గిపోయిందని ఆనందిస్తున్న  రైతుల ఆశలపై మళ్లీ వస్తున్న వరద కంటతడి పెట్టిస్తున్నది. ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉదయం 3.8 లక్షల క్యూసెక్కుల విడుదల చేయగా అది సాయంత్రానికి 4.56 లక్షల క్యూసెక్కులకు పెరిగిపోయింది. దీనికి తోడు ప్రవాహ వేగం కూడా ఎక్కువగా ఉండటంతో నది అంచుల వెంట ఉన్న వ్యవసాయ భూములు కోతపడి పోతున్నాయి. పరివాహాక ప్రాంతాల్లోని లంక గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. లక్షలాది రూపాయల పెట్టుబడులతో వేసిన వాణిజ్య పంటలు వరద ముంపునకు గురయ్యాయి. కొల్లూరు మండలంలోని పెసర్లంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక గ్రామాలను వరద నీరు చుట్టు ముట్టింది. పెసర్లంక దగ్గర గండి పడిన ప్రదేశానికి అరవింద వారధికి మధ్య ఉన్న భూములు మట్టి పెళ్లలు విరిగిపడి నీటిలో కలిసిపోతున్నాయి. కొత్తూరులంక, అన్నవరపులంక, గాజుల్లంక, పోతార్లంక, జువ్వలపాలెం, పెదలంక గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూములకు కోత ఏర్పడి అరటి, కంద, పసుపు, తమలపాకు పంటలు నీటిలో కొట్టుకుపోతుండటం రైతుల కంట కన్నీటి పర్యంతమవుతున్నారు. దోనేపూడి-పోతార్లంక, గాజుల్లంక-పోతార్లంక, చింతల్లంక-సుగ్గునలంక గ్రామాల మధ్య చప్టాల పైకి వరద నీరు చేరుతోంది. పెసర్లంక, క్రీస్తులంక గ్రామాలను చుట్టుముట్టి కరకట్ట అంచుల వరకు నీరు చొచ్చుకు వస్తోంది. భట్టిప్రోలు మండలంలోని పెసర్లంక-కోళ్లపాలెం, పెదపులివర్రు-పెసర్లంక గ్రామాల మధ్య చప్టాల పైకి కూడా నీరు భారీగా చేరుతోంది. ఓలేరు నుంచి పెదలంక వెళ్లే కాకుల డొంకపైకి కూడా వరద నీరు వస్తుండటంతో ఈ గ్రామస్తులందరికీ వెల్లటూరు దగ్గర ఉన్న వంతెన ఒక్కటే మార్గంగా మిగిలింది. కొల్లూరు మండలంలోని లంక గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా గోతులలో వరద నీరు నిండిపోయి ఏ క్షణంలోనైనా రోడ్డును ముంచేసే పరిస్థితి పొంచి ఉంది. ఇటీవల గాజుల్లంక దిగువన కృష్ణానదిలో ఇసుక రవాణా కోసం గాలు మార్గం వేసి భారీగా వరద నీరు బయటకు చొచ్చుకు వచ్చింది. దీంతో ఇటు చిన్నరేవు అటు పెదరేవు మధ్యలో ఉన్న పోతార్లంక రహదారి మినహా అన్ని భూములు వరద నీటితో నిండిపోయాయి. రేపల్లె ప్రాంతంలోని వెల్లటూరు చిన్నరేవులో ఓలేరు - పెసర్లంక, గొరిగపూడి - పెసర్లంక, కోళ్లపాలెం - పెసర్లంక పల్లెపాలెం, పెదపులివర్రు - పెసర్లంక, పెదపులివర్రు - చింతమోటు గ్రామాల మధ్యలోని చప్టాలపై భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. కరకట్ట ఆనుకుని ఉన్న గ్రామాల్లోని ప్రజలు కట్టపై టెంట్లు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సబ్‌కలెక్టర్‌ డాక్టర్‌ నిథిమీనా అధికారులను ఆదేశించారు.  కొల్లిపర మండల పరిధిలోని బొమ్మువానిపాలెం గ్రామాన్ని  సందర్శించి వరద ఉధృతిని పరిశీలించారు. ఓలేరు పల్లెపాలెం వద్ద కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తుంది. 

- రేపల్లె రూరల్‌ సీఐ శివశంకర్‌ మండలంలోని నదిపరివాహక ప్రాంతాల్లో పర్యటించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. వరద నీరు పోటెత్తటంతో పెనుమూడి పుష్కరఘాట్‌ ఐదు మెట్లు మునిగిపోయాయి. భట్టిప్రోలు మండలం చినరేవుకు వరద నీరు పోటెత్తడంతో ఓలేరు నుంచి పెసర్లంక వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. 

- అమరావతి మండల పరిధిలోని పెదమద్దూరు వాగు చప్టాపై వరద నీరు నిలిచి వాహనాల రాకపొకలు నిలిచిపోయాయి. ద్యానబుద్ధ ప్రాజెక్టు వద్ద పుష్కరఘాట్లు నీటమునిగాయి. దుగ్గిరాల మండలంలోని పరిసర గ్రామాలైన వీర్లపాలెం, పెదకొండూరు, గొడవర్రు గ్రామాల్లోని పొలాలను వరదనీరు ముంచెత్తుతోంది.  కరకట్ట లోపలి వైపు ఉన్న పొలాల్లోకి పెద్దఎత్తున్న వరద నీరు చేరింది.  పెదకొండూరులో శ్రీరాజేశ్వరస్వామి ఆలయ సమీపంలోని హిందూ శ్మశానవాటిక ఇప్పటికే వరదనీటితో మునిగిపోయింది.

  

అమావాస్య భయం

పులిచింతల నుంచి భారీగా వరద నీటిని కిందికి వదిలి వేయడంతో బ్యారేజీ దగ్గర ఉన్న 12 అడుగుల నీటి నిల్వ సామర్థ్యాన్ని కొనసాగిస్తూ మిగిలిన నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. 4.4 లక్షలు వరద నీరు సముద్రంలోకి పోతుంటే 12 వేల క్యూసెక్కుల నీటిని తూర్పు, పశ్చిమ డెల్టా కాల్వలకు వదిలి పెట్టారు. శని, ఆది వారాల్లో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని, 6 లక్షల క్యూసెక్కులు వచ్చే పరిస్థితి ఉందంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నదిలో 5 లక్షల క్యూసెక్కుల వరకు నీటిని వదిలేస్తుంటే అంతటి వేగంతో వస్తున్న నీరు కూడా సముద్రంలోకి వెళ్లిపోతుంది. అయితే ఆదివారం అమావాస్య కావడంతో శనివారం నుంచే అటు పోట్లలో వ్యత్యాసం వస్తుందని పోటు సమయంలో నదిలో నీరు సముద్రంలోకి వెళ్లకపోగా, ఎదురు నిలిచే ప్రమాదం ఉండటంతో ముంపు తీవ్రత మరింత పెరగవచ్చని తీరవాసులు ఆందోళన చెందుతున్నారు. 

  


  

ఓలేరు గండికి మరమ్మతులు 

కోతకు గురై ప్రమాదభరితంగా ఉన్న కరకట్ట ప్రాంతాలను బలపరిచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2009లో గండి పడిన ఒలేరు పల్లెపాలెం వద్ద కరకట్ట బలహీనంగా ఉన్నట్లు ఆర్సీ అధికారులు గుర్తించారు. దీంతో ముందుజాగ్రత్తగా గండిపడిన ప్రాంతంలో బాదులు, మట్టి, ఇసుక బస్తాలు వేసి బలపరుస్తున్నారు.  


పులిచింతలలో స్టాప్‌లాక్‌ పనులు

ప్రాజెక్టుపై 9 వరకు రాకపోకల బంద్‌ 

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు వద్ద కొట్టుకు పోయిన 16వ గేటు స్థానంలో స్టాప్‌ లాక్‌ ఏర్పాటు చేసే పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టులో ఎనిమిది టీఎంసీలు నీరు నిల్వ ఉండటంతో పనులకు ఆటంకంగా మారింది. ప్రాజెక్టు నిర్మించిన   శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ మేనేజర్‌ శశిమోహన్‌ గేటు స్థానాన్ని పరిశీలించారు. పోలవరం ఇంజనీర్లు వచ్చి స్టాప్‌ లాక్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. స్టాఫ్‌ లాక్‌ను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుపై ఈ నెల 9వ తేదీ వరకు రాకపోకలను నిషేధించినట్టు ఎస్‌ఐ మణికృష్ణ తెలిపారు. ప్రాజెక్టులో శుక్రవారం సాయంత్రానికి 37 టీఎంసీల నీరు సముద్రం పాలయ్యాయి. నారు మళ్ళు ప్రారంభంలో ఈ విధంగా జరగటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ప్రాజెక్టుకు నీరు వస్తుందో రాదోననే అయోమయస్థితికి రైతులు చేరుకున్నారు. 

 

బ్యారేజి వద్ద కొనసాగుతున్న ఉధృతి 

తాడేపల్లి టౌన్‌: ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా వరదనీరు వస్తుండడంతో ప్రకాశం బ్యారేజి వద్ద వరద ఉధతి కొనసాగుతోంది. పులిచింతల నుంచి శుక్రవారం సాయంత్రానికి 4లక్షల 57వేల క్యూసెక్కుల వరదనీరు బ్యారేజికి ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతున్నట్టు నీటి పారుదల శాఖ జేఈ దినేష్‌ తెలిపారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 12వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, బ్యారేజి వద్ద 12 అడుగుల నీటిమట్టం నమోదవుతుంది. దీంతో 70 గేట్లను పూర్తిగా ఎత్తి 4 లక్షల 40వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.  


కరకట్టకు తూట్లు

చోద్యం చూస్తున్న అధికారులు

రేపల్లె: రొయ్యల, పొలాల రైతులు కరకట్టకు పైప్‌లైన్లు వేసి కరకట్టను బలహీన పరుస్తున్నారు. ఇలా వేసిన పైప్‌లైన్లు కారణంగానే 2009 అక్టోబరు 5న ఓలేరు పల్లెపాలెం వద్ద కరకట్టకు గండి పడి వరద నీరు ముంచెత్తింది. దీంతో ఊళ్ళు, పొలాలు మునిగి రూ.కోట్ల నష్టం వాటిల్లింది. ఈ ఘటన జరిగి పన్నెండేళ్లు అయినా నేటికీ అధికారులు కరకట్టను పటిష్టపరిచే చర్యలపై దృష్టి సారించలేదు. ప్రస్తుతం నదిలో ఆరు లక్షల క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తోంది. ఈ పరిస్థితుల్లో బలహీనంగా ఉన్న కరకట్టకు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని సమీప గ్రామాలకు చెందిన వారు ఆందోళన చెందుతున్నారు. కరకట్టకు ఇష్టం వచ్చినట్లు తూట్లు వేస్తున్నా ఆర్సీ అధికారులు మామూళ్లు తీసుకుంటూ కాలం గడుపుతున్నారనే విమర్శలున్నాయి. 2009లో గండి పడినప్పటి నుంచి ప్రతి ఏటా వరదల సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యక్షమై కరకట్టను పటిష్టం చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారే తప్ప పదేళ్లుగా పట్టించుకున్న వారే లేరు.   కరకట్ట అభివృద్ధి పేరుతో కట్టల వెంబడి పెద్దపెద్ద గోతులు తవ్వి ఆ మట్టితోనే వెడల్పు చేశారు. కొత్తగా పోసిన మట్టి గట్టి పరచకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఆ మట్టి కొట్టుకుపోయి అడుగున కోతకు గురైంది. అధికార పార్టీ నాయకులు కరకట్టను తవ్వి సొమ్ము చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో కరకట్ట దిగువనున్న మైనేనివారిపాలెం, పిరాట్లంక, చెన్నుపల్లివారిపాలెం, గంగడిపాలెం, లక్ష్మీపురం, అడవిపాలెం గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కృష్ణా బోర్డు రివర్‌ అధికారులు కనీసం పెట్రోలింగ్‌ చేసిన దాఖలాలులేవు.  

Updated Date - 2021-08-06T05:30:00+05:30 IST